శర్మ కాలక్షేపంకబుర్లు-ఏ నిమిషానికి….

ఏ నిమిషానికి….

నా బ్లాగు చదివే అభిమానులు నా ఊళ్ళోనే ఉండడం, నాతో ప్రత్యక్షంగా మాటాడటం, నిజంగానే నేను చేసుకున్న పుణ్యం, అదృష్టం కుడా. అటువంటి ఒక అభిమాని పదో తారీకు సాయంత్రం ”అన్నయ్యగారు ఎలా ఉన్నారంటూ” వచ్చింది. ఆమె నాకంటే నాలుగేళ్ళు చిన్నది. ”బండి నడుస్తోందమ్మా” అన్నా కూచోమని కుర్చీకేసి చూపుతూ. ”నడిచినంతకాలం నడిపేద్దాం” అంటూ కూచుని. ”అన్ని బాధ్యతలూ తీర్చేసుకున్నాం కదా! ప్రశాంతంగా వెళిపోడమే కావల్సింది. ’అనాయాసేన……’ అన్నారుకదా మీరూ” అంది నవ్వుతూ. ”అమ్మా! అది అదృష్టవంతులకే దక్కుతుంది తల్లీ” అంటే, ”అది సరేగాని, మనకి తగువులొద్దండీ! అది మేధావులపని, ఇప్పుడు రాస్తున్న బ్లాగులు మూసెయ్యండి. కొత్త బ్లాగులు తెరవండి, మేదావులతో కలవకండి,ఏ ఆగ్రిగేటర్ లోనూ కలపద్దు, మనం సామాన్యులంకదా!, మీ బ్లాగు మన మిత్రులందరూ చదువుతారు, లింక్ ఇవ్వండి. లింక్ చెప్పడం మరచిపోకండీ, ఉంటానూ” అని లేచి వెళ్ళింది. ఎవరికి తెలుసు అదే ఆఖరు సారిని మళ్ళీ కలవడమే కుదరదనీ….

అలా వెళ్ళిన మరునాడు రాత్రి ఆయాసంగా ఉందంటే మాత్ర ఇచ్చి మంచినీళ్ళు పట్టించేరు భర్త. ఆయాసం ఎక్కువగా ఉందని డాక్టర్ దగ్గరకి తీసుకువెళ్ళేలోపే హంస లేచిపోయింది. ( హం అనే శబ్దం మనం లోనికి గాలి పీల్చుకునేటపుడు కలిగేది, స అనే శబ్దం ఊపిరి విడిచేటపుడు కలిగేది. ఈ హంస మంత్రం ఎల్లప్పుడు జరుగుతూనే ఉంటుంది, అందరికి సర్వకాల సర్వాస్థలలోనూ.. అది ఆగిపోవడమే హంసలేచిపోవడం అంటారు) కబుర్లెళ్ళిపోయాయి. కొడుకులు రెక్కలు కట్టుకుని అమెరికా నుంచి ఎగిరొచ్చేటప్పటికి నలభై ఎనిమిది గంటలు పట్టింది. అయిపోయింది,  గురువారం సాయంత్రం నాతో మాటాడి మార్గ నిర్దేశం చేసిన తల్లి, ఆదివారం నాటికి, పిడికెడు బూడిదగా మిగిలింది, పంచేంద్రియాలు పంచ భూతాల్లో కలసిపోయాయి. మనసు మూలిగింది బాధతో, ఏడ్చింది బావురుమని, చెప్పలేని ఆవేదన, మూగబాధ, మనసు మెలితిరిగింది. తను చెప్పిన పనిచేసేనని మళ్ళీ చెబుదామంటే కబురు అందనంత, మాట వినపడనంత దూరం వెళిపోయింది…

సోమవారం తీరుబడిగా మాస్టార్ని పలకరించడానికెళ్ళేము, మాటల్లో ”చెల్లాయి అదృష్టవంతురాలండీ” అన్నా. మాస్టారు ఒక్క నిమిషం దిగులుగా కనపడ్డారు, వెంటనే సద్దుకుని ”అవునండి క్షణాలలో వెళిపోయింది, శర్మగారూ! రెండు కట్టెలు రెండు అడవుల్లో చెట్లనుంచి రాలాయి, వర్షానికి సెలఏళ్ళలో పడ్డాయి, వాగుల్లోకి చేరాయి, నెమ్మదిగా నదిలోకి చేరాయి రెండు పక్కలనుంచీ. నీటి ప్రవాహంలో కాలంతో పాటు కలిసాయి, కలిసిప్రయాణం మొదలెట్టేయి, కొన్ని చిన్న చితుకులూ అంటుకున్నాయి. ప్రవాహగతిలో ముందుకూకదిలేయి, కాలంతో చితుకులూ విడిపోయాయి, మళ్ళీ రెండు కట్టెలే ప్రయాణం కొనసాగించాయి, కాలప్రవాహంలో మళ్ళీ రెండూ విడిపోయి ముందు వెనకలుగా సముద్రం చేరతాయి. పూర్ణమిదం పూర్ణమదం… అనంతం లోనుంచి వచ్చి మళ్ళీ అనంతంలో కలసిపోవడమే ఇది,ఇదే జీవితం, ఆవిడ వెళిపోయిందని బాదెందుకూ! ఇద్దరం ఒకసారి పుట్టలేదు, ఒకసారిపోము కూడా” అన్నారు. తత్త్వాన్ని అందరం చెబుతాం కాని జీవితానికి అన్వయించుకుని, ఒంటపట్టించుకుని నిర్వికారంగా వారు పలుకుతుంటే మహానుభావులు మరెక్కడో లేరు, మన మధ్యనే, సామాన్యులలోనే మాన్యులున్నారని, వారికి నమస్కారం చేసి వచ్చేం.

ఆమె ఆత్మ పరమాత్మలో లీనం కావాలని ప్రార్ధిస్తూ…ఏంటో ఉన్న నాలుగు రోజుల్లోనూ ఈ తగులాటం,తంటాలు, తగువులు…నాలుగురోజులుగా మనసు బాగోలేదు.

ఏ నిమిషానికి
ఏమిజరుగునో
ఎవరూహించెదరూ
విధివిధానమును
తప్పించుటకూ ఎవరు
సాహసించెదరూ!

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఏ నిమిషానికి….

  1. విన్నకోట నరసింహారావుగారు,
    ఆ అభిమాని నన్ను కలిసిన మరునాడే కాలం చేయడం చాలా వ్యధనే కలగజేసిందండి! ఆమె ఆత్మ పరమాత్మలో కలవాలని ఆశిస్తాను.
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.