శర్మ కాలక్షేపంకబుర్లు-చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో…..

”చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో….

ఏంటీ! తెగనీలుగుతున్నావ్!! చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో సహా కక్కిస్తానేంటనుకుంటున్నావో!!!” ఇలా తిట్టడం  తెనుగునాట బాగా అలవాటు.

చిన్నప్పుడు దొండాకు పసరు ఎందుకు తాగిస్తారు?. దొండ రెండు రకాలు. తియ్యదొండ,చేదుదొండ లేదా కాకిదొండ, లేదా పిచ్చిదొండ అంటారు. ఈ పిచ్చి దొండపాదులు పల్లెలలో బాగా పెరుగుతాయి, ఎక్కడపడితే అక్కడ. చిన్నపిల్లలికి మూడు నెలలుదాటి సంవత్సరం లోపులో వస పోస్తారు, మాటలుబాగా వస్తాయట, ఎక్కువగా మాటాడేవాళ్ళని వసపిట్టలని అంటారు, వసెక్కువ పోసినట్టున్నారంటారు. అలాగే ఈ పిచ్చిదొండ ఆకులు తెచ్చి మెత్తగా నలగకొట్టి రసం తీసి, రోజుకి రెండు పూటలా మూడు రోజులు పట్టిస్తారు. ఇలా చేయడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందట. ఇప్పటివారికి పోయటం లేదుగాని, మా చిన్నప్పుడు అందరూ దొండాకు పసరు తాగినవాళ్ళే. మరోమాట ఈ పిచ్చి దొండపాదుల్ని కాయలు బాగా కాస్తాయి, తెలివైనవాళ్ళు వాటిని తెచ్చుకుని చక్రాల్లా తరుక్కుని ఎండబెట్టి వరుగులు చేసుకుంటారు. వీటిని ఆ తరవాత వేయించుకుని తింటారు, కొంచం చేదుగా ఉన్నా ఆరోగ్యానికి మంచిదిట. మరో సంగతి పిచ్చి దొండాకుల్ని మెత్తగా నలిపి రక్తపుగడ్డ మీద వేస్తే మూడో రోజుకి ఫట్, ఆ తరవాత అదే ఆకులముద్ద వేస్తే పుండు మానుతుంది, ఇది ఆంటీ బయోటిక్ ట.

మరచాను మరోమాటా! తెనుగు నాట దొండాకు పసరే కాకుండా గాడిదపాలు పోయడమూ, దేశంలో కొన్ని చోట్ల ఒంటె పాలు పోయడమూ అలవాటే. ఇలా గాడిద పాలు మూడు రోజులు తాగిస్తే కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందటా! ఇప్పుడు తెనుగునాట గాడిదపాల వ్యాపారం మూడు గాడిదలూ రోజుకి ఆరువేల రూపాయల సంపాదనా లా నడిచిపోతోందట. ఇంటికి గాడిదనుతోలుకొచ్చి వంద ఎమ్.ఎల్ పాలు పితికి రెండువందల ఏభై రూపాయలు పట్టుకుపోతున్నారట. గాడిద మహాలక్ష్మి రాకకై ఎదురు చూస్తున్నారట. దానికీ సమయం కేటాయించేస్తున్నారట (కాల్ షీట్ బుక్ చేసుకొంటున్నారట) గాడిదలు కాసేవారు. పిల్లలకే కాదు పెద్దవారూ గాడిద పాలు తాగుతున్నారట.

చిన్నప్పుడు మా మాస్టారు చదువుకోక గాడిదల్ని కాస్తావా అనేవారు. నిజంగా గాడిదల్ని కాస్తేనే బాగున్నట్టుంది, రోజుకి ఆరువేలు నెలకి రెండు లక్షలు, ఆపైన లెక్కొద్దుబాబూ! టాక్స్ లేని ఆదాయం!

కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? గాడిదలు కాయండి!

ఒక కేజి గాడిద వెన్న తయారు చెయ్యడానికి డెభ్భై లీటర్ల గాడిద పాలు కావాలిట. ఒక కేజి గాడిద వెన్న ఖరీదు అక్షరాలా రెండు లక్షలు, గాడిద వెన్న చాలా సున్నితంగా మెత్తగా ఉంటుందిటా! సౌందర్య సాధనాల్లో,  మొహానికి రాసుకునేవాటిలో వాడతారటా!

ఆడగాడిదలని పెంచండి, కోటీశ్వరులు కండి.

గాడిద మహాలక్ష్మికీ జై!!!

16 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో…..

 1. మాస్టాఊ,
  ఎప్పటినుంచో అడుగుదామని ఎప్పటికప్పుడు మర్చిపోతున్న ఒక పాత డవుటు – ఇదివరకు పెళ్ళిళ్ళలో గానీ ఇతర శుభకార్యాలలో చదివిములకి 116 గానీ 1116 గానీ ఎన్నుకునేవాళ్ళు.ఈ రెండు నూటపదహార్లు,వెయ్యిన్నూటపదహార్లు ఒక రకంగా వూతపదంగా కూడా మారిపోయింది గదా!దాని రహస్యం ఏమయినా మీకు తెలిస్తే వివరించగలరు.

  మెచ్చుకోండి

 2. చూడర! వలదు పొలిటికల్
  గాడిద ! హరిబాబుజెప్పె! గాంచెను వేగన్
  గాటిన పెట్టెను పద్యం
  మేటిగ కందం జిలేబి మేడమ్ చుట్టెన్

  మెచ్చుకోండి

 3. లచ్చిమి రాగ తడికె బె
  ట్టిచ్చప్పున వలదునుటిచటే గంటినిరా
  అచ్చచ్చో జేబున జొ
  ప్పొచ్చిన డబ్బులు ఖరారు పోయే గదరా

  చీర్స్
  జిలేబి

  మెచ్చుకోండి

 4. అనామకం జిలేబిగారు,

  అదృష్టవంతులకి గాని భాగవతంలో వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకునే ఘట్టం కనపడదటండి 🙂

  మనవాళ్ళెప్పుడో చెప్పేరు కదా గాడిదల్ని కాయండీ అని “అర్ధం చేసుకోరూ” 🙂

  ఇప్పటికైనా మించిపోయిందేం లేదండీ ఆడగాడిదల్ని కాయడం నేర్చుకుంటే చాలటండి. 🙂
  ధన్యవాదాలు

  మెచ్చుకోండి

 5. భాగవతం లో వసుదేవుల వారు‌ గాడిద కాళ్లు పట్తుకుని అప్పుడే ఆ కాలం నే గాడిద వ్యాపారం చెయ్యండర్రా అని మొత్తుకున్నాడు;

  ఇంత కాలానికి గాని మన వాళ్ళ కి‌ అర్థం కాలేదన్న మాట !

  మన పురాణాల్లో అన్నీ సైంటిఫిక్ గా చెప్పేసేరండీ అల్రేడీ 🙂

  జిలేబి

  మెచ్చుకోండి

 6. విన్నకోట నరసింహారావు గారు,
  ఇప్పుడు గాడిద అని అస్సలు తిట్టకూడదుటండి. కుక్కో,పిల్లో ఆలోచించాలండి. 🙂 ఆడగాడిదని, అడ్డగాడిదని అసలనకూడదండి, నిజమేమరి లక్షల విలువైన పాలిస్తుంది కదండీ. మగగాడిదని తిట్టచ్చేమోనండి.

  దొండ తింటే బుద్ధి మాంద్యం అన్నారండి. శ్రీ హర్షుడు శృంగార నైషధం రాస్తే అస్సలర్ధం కాకపోతే మేనమామ దొండకాయ కూర చేయించి పెట్టించి, దొండపాదు కింద కూచోబెట్టి తిరగరాయించాట్టండి, మూడు సార్లు. ఇప్పుడు మనకి దొరుకుతున్నది అదేటండి 🙂
  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 7. కరక్టేలెండి, ఇంక ఇప్పుడు గాడిదతో పోల్చకూడదు (అడ్డగాడిద అని అసలు అనకూడదు 🙂 ), లక్షల విలువైన పాలిస్తుంది కదా 🙂
  అవును శర్మ గారూ, దొండ గురించి చాలామందికి ఓ భయం ఉంది – ఆ కూర తినడంవల్ల బుద్ధిమాంద్యం కలుగుతుందని. ఎంతవరకు నిజమంటారు? 🙂

  మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.