శర్మ కాలక్షేపంకబుర్లు-ఉగ్గు

ఉగ్గు

”సాము గరిడిలు ఉగ్గుబాలతో నేర్చిన విద్యమాకు” అన్నారో కవివరులు. ఉగ్గు వేరు,పాలు వేరు. పుట్టినప్పటినుంచి అనే వాడుకలో వాడేమాటిది. నిజంగానే ఉగ్గు పుట్టినప్పటినుంచీ పెడతారు. మొన్ననొకరు ఉగ్గు గురించి చెప్పమన్నారు, మెయిల్లో చెప్పేను, వివరంగా టపా రాయమంటే, తప్పలేదు…

పుట్టిన వెంటనే బొడ్డుతాడు కోస్తుంది మంత్రసాని, అదిగో అక్కడితో తల్లినుంచి నేరుగా ఆహారం తీసుకునే సౌకర్యం తప్పుతుంది. స్నానం చేయించినతరవాత వెచ్చగా వుండేందుకు మెత్తటి పాతగుడ్డలు కప్పి, అమ్మమ్మ ఎత్తుకుని, వేలికి తేనె రాసుకుని నోట్లో పెడుతుంది, వేలు, చీకడం అలవాటు చేస్తుందలా. మానవులు పుడుతూనే ఏపనీ స్వయంగా చేసుకోలేరు, అన్నీ పరాధీనమే. జంతువులు పుట్టిన గంటలో లేచి నిలబడతాయి, తల్లి దగ్గర పాలెక్కడ దొరుకుతాయో వెతుక్కుని తాగుతాయి. మానవులకి పాలు తాగడం కూడా నేర్పాల్సిందే! తల్లి కూడా మొదటిసారిగా ప్రసవిస్తే పాలివ్వడం కూడా నేర్పాలి, లేకపోతే బిడ్డ ఉక్కిరి బిక్కిరైపోతుంది, పాలు తాగలేక. తేనె బలవర్ధక ఆహారం, ఆ తరవాత విరేచనకారి కూడా. అప్పటికి కడుపులో ఉన్నది బయటికిపోవాలంటే అదే మార్గం. తేనె తొందరగా శరీరానికి శక్తినిస్తుంది, అదీ సంగతి.  తీసుకునే ఆహారానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తామో  మలవిసర్జనకీ అంతే ప్రాముఖ్యంఇవ్వాలి . రెండు కాని మూడో రోజునకాని తల్లికి పాలు పడతాయి. అంతతో బిడ్డకి కావలసిన ఆహారం తల్లిదగ్గరే దొరుకుతుంది. అప్పుడే పుట్టిన లేతపొట్టకి అనువుగా ఉండే ఆముదం పట్టేవారు విరేచనానికి, ఎంత? చిన్న చంచాడు. ఈ పట్టే ఆముదంలో తల్లిపాలు కొద్దిగా పితికి, ఐదారు సార్లు, రంగరించి పట్టేవారు. ఒకటి రెండు సార్లు రంగరిస్తే ఒక విరేచనమయ్యేది. ఎన్నిసార్లు రంగరిస్తే అన్ని విరేచనాలవుతాయి. రంగరించడం చాలా ముఖ్యం. ఆ రోజుల్లో ‘కుమ్ముటాముద’మని ఆముదాలు కుమ్ముకుని వాడుకునేవారు, బాగుండేది. కంపెనీలు తయారు చేసిన ఆముదం కూడా బాగుండేది. అందులో ప్రసిద్ధి చెందినది స్వస్తిక్ కంపెనీ ఆముదం. చిన్నపిల్లలకు పట్టేందుకు నేడు మంచి ఆముదం దొరుకుతోందో లేదో చెప్పలేను, అసలు ఉగ్గు పట్టడం మానేసి చాలాకాలమే అయిపోయినట్టుంది. నాడు ఉగ్గు గిన్నెలని చిన్న వెండి గిన్నెలుండేవి.

ఇలా అముదం మూడో ఏడు వచ్చేదాకా పట్టేవారు, అవసరాన్ని బట్టి, బిడ్డ విసర్జన క్రియని బట్టి. పట్టే ఆముదంలో తల్లిపాలు లేనిరోజుల్లో ’బస్తం’ అనేపొడి చిటికెడు కలిపేవారు. రంగరించడం మామూలే. ఈ బస్తం దేనితో తయారు చేసేది చెప్పలేను. మరి కొన్ని సహజౌషధాలూ వాడేవారు. ఆకు జెముడు, కాడ జెముడు అనేవి రెండు మొక్కలు, గిల్లితే పాలుకారుతాయి.వీటి శాస్త్రీయనామాలు తెలియవు, వీటిపాలని ఐదారు చుక్కలు ఆముదంలో కలిపి రంగరించి పట్టేవారు. ఇవి కడుపుకు సంబంధించిన వ్యాధులను దూరం చేస్తాయి, వీటిని ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణ్లలో మొదలు పెట్టచ్చు. నేటికి పెద్దలకి సంబంధించిన ఉదరవ్యాధులకు ఈ మొక్కల వేళ్ళతో సహా ఔషధమే. మొన్న ఒక డాక్టర్ గారి బ్లాగులో ఒక మాట చదివా! మనకి వచ్చే చాలా వ్యాధులకి మూలకారణం మలవిసర్జన సరిగాలేకపోడమే అన్నారు, ఎంత నిజం.

DSCN0002

ఈ ఫోటో లో మీరు చూస్తున్నది కాడ చెముడు మొక్క. దీని కాడని గిల్లితే రెండు మూడు చుక్కల పాలు కారతాయి. అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. ఇది పెరటి కుండీలో కూడా పెరుగుతుంది.టపా రాసేరోజుకి ఈ మొక్క ఫోటో దొరకలేదు, ఇప్పుడు దొరికింది అందుకు ఫోటో పెట్టేను.

‘తలనొప్పి వస్తోందండీ విడిచి పెట్టటం లేద’ని డాక్టర్ దగ్గరకెళితే ముందు టెస్టులు రాస్తారు, టెస్టులవుతాయి, అన్నీ బాగుంటాయి, మరో కొన్ని టెస్టులు, మరిన్ని మందులు ఇది అంతులేని కథ. రోగి చెప్పడు, విరేచనం సరిగా కావటం లేదని. అది అసలు రోగమని రోగి అనుకోడు, డాక్టరూ అడగడు. అడిగి దానికి వైద్యం చేసేస్తే వైద్యునికి ఎంత రాబడిపోయింది? ఇక రోగి సంగతి చూదాం, వీరు ఫ్రిజ్ లో పెట్టిన చల్లని నీళ్ళు తప్పించి తాగరు, ‘ఏంటీ ఫ్రిజ్లో నీళ్ళు తాగరా? మీ ఇంట్లో’ మీరు అనాగరికులు అనేస్థాయిలో ఉంటాయి, వీరి మాటలు. ఆ చల్లని నీటి మూలంగా పేగులు కుంచించుకుపోతాయి, మల విసర్జనకాదు, దానితో మొదలవుతాయి, అసలు తెగుళ్ళన్నీ. మలవిసర్జనకి టైమ్ లేదనేవారూ ఉన్నారు సుమా! మండు వేసవిలో కూడా అతి చల్లని పదార్ధాలు, నీరు, పానీయాలూ,ఐస్క్రీమ్ లూ తినకండి. శరీర ఉష్ణోగ్రతికి దగ్గరగా ఉన్న వేడి పదార్ధాలు తినాలి, ఎంతంటే నోరు వేడిపట్టినంత, సరిపోయిందా! పిన్నలు పెద్దలు అందరూ పదిహేనురోజులకో సారి ఉపవాసం చెయ్యాలి, అదే ఏకాదశి అన్నారు, అంటే జీర్ణకోశానికి శలవు. అలాగే ఋతువు మారేటపుడో సారి జీర్ణకోశం శుభ్రం చెయ్యమన్నారు, ఆముదం తాగి, దానిలో నిమ్మరసం, తేనె కలుపుకోమన్నారు. అసలు ఖాళీ ఎక్కడండి బాబూ! నిజం డాక్టర్ దగ్గరికి తిరగండి బాబూ!! నాదేంబోయిందీ!!! విరేచనాల తరవాత కరివేపాకు కారప్పొడి నేతితో అన్నం తినండి, చారు మాత్రమే పోసుకోండా రోజు, మజ్జిగొద్దు.ఉదయం లేవగానే పొట్టపట్టినన్ని రాత్రి పూట రాగి చెంబులో ఉంచిన మంచినీళ్ళు తాగితే రోగాలెక్కడ?,

ఇక చిన్నపిల్లలకి అన్నం ముట్టించినవాళ్ళకి ఆహారం అలవాటు చేయడానికి అన్నం మెత్తగా ఉడికించాలి, దీన్ని గుజ్జనగూడు అనేవారు. దీనిలో నెయ్యి, నేతిలో వేయించిన వాముపొడి, తగిన ఉప్పు వేసి కలిపి పెట్టాలి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాము, నెయ్యి రెండూ ఔషధాలే సుమా! ఆ తరవాత పిల్లలకి మెత్తటి అన్నంలో కంది కట్టు వేసి కలిపి పెట్టాలి. కుక్కర్లో కంది కట్టురాదు, వేరుగా పప్పు ఉడికించుకుని తయారు చేసుకోవాలి. కందికట్టు గురించి కావలిస్తే మూసేసిన బ్లాగు ”కష్టేఫలే” బ్లాగులో వెతకండి. పళ్ళు వచ్చిన తరవాత నమలడం అలవాటు చేయాలి. తల్లికి నమిలి మింగే అలవాటుంటే పిల్లకీ ఆ అలవాటొస్తుంది.

బిడ్డకి తల్లి మాత్రమే అన్నం పెట్టాలి, చిన్న వయసులో అనగా మూడేళ్ళొచ్చేదాకా తిప్పి కథ చెబుతూ, చుట్టూ ఉన్నవాటిగురించి చెబుతూ అన్నం పెట్టాలి. ఒక చోట కూలేసి పెట్టకూడాదు, ప్రకృతిని పరిచయం చేస్తూ పాఠం చెప్పినట్టుకాక, చెబ్తూ అన్నం పెట్టాలి. ఇటు అన్నం తినడమూ నేర్పాలి, అటు చుట్టూ పరిసరాలూ పరిచయం చేయాలి. ఒకరోజు చెప్పినదాన్న్ని మరునాడు బిడ్డ గుర్తుపట్టి మరలా తను చెబుతోంటే ఆ తల్లిపొందే ఆనందం ఏమని చెప్పను? మూడో ఏడు తరవాత నుంచి ఒక చోట కూచుని తినే అలవాటు చేయాలి.
ఎన్నని చెప్పను?

చివరిగా ముఖ్యమైన విషయమే! ఒక్కొకప్పుడు విచిత్ర పరిస్థితి ఏర్పడి బిడ్డ పాలు తాగదు, అప్పుడు తల్లికి  ”పాలచేపులు” అని స్థనాలలో పాలు నిలవ ఉండిపోయి పోట్లుగా బాధలు కలుగుతాయి. ఇవి తగ్గాలంటే చిటకా తమలపాకు కి ఆముదం రాసి వెచ్చచేసి స్థనాలపైవేసి కట్టెయ్యండి,పోట్లు తగ్గిపోతాయి. ఎక్కువ సార్లు ఇలా చేస్తే బిడ్డకి పాలు తగ్గిపోతాయి జాగ్రత.

20 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఉగ్గు

 1. గురువు గారు, జిలేబి గారు మిమ్మల్ని ఏ చెట్టు ఎక్కిన్చాక్కరలేదు, ఎక్కిన్చ్చిన మీకొచ్చిన ముప్పు లేదు. మీరు రుషితుల్యులు, మీరేది చెప్తే/వ్రాస్తే అదే సత్యం, సత్యం, సత్యం. బ్లాగ్ రచయితలలో మీలాగ విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కాని, దాన్ని అందిపుచ్చుకోనేల పాటకులకు మధురంగా అందించే వాళ్ళు కాని లేరు. మరోసారి మీకు కృతజ్ఞతపూర్వక వందనములు.

  మెచ్చుకోండి

 2. కష్టే ఫలే వారు,

  మీ బుర్ర లో ఉన్న మేథ కి విలువ కట్ట ఇంత అని చెప్పలేము అనుకుంటా !

  ఆ అడిగినది ఎవరో గాని మీ చేత చాలా మంచి టపా పెట్టించారు !

  ఇట్లాంటి విషయాలు ఈ కాలం లో తెలిసిన వారు చాలా అరుదు; ఆ పై చెప్పే వారు కూడా అరుదే ;

  చాలా చాలా మంచి టపా ! అంధ్ర జ్యోతి వార పత్రిక (నవ్య) కి పంపించ వలసినది; సో , ఇంకా చాలా మందికి ఈ విషయాలు తెలిసి వస్తాయి ;

  ఈ బస్తము అంటే మేక పోతు అని అర్థం వస్తోంది ఆంధ్ర భారతి ద్వారా; ఆ పొడి కి మేక పోతు కి సంబంధం ఉందా ?

  లేక ఈ బస్తం అన్నది లేక పోతే ‘గమ్ అరబికా’ యా ?

  జిలేబి

  మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.