శర్మ కాలక్షేపంకబుర్లు-రావణకాష్ఠం

రావణకాష్ఠం

రావణ కాష్ఠం అంటారు కదా దీని సంగతేంటో చూడాలని రామాయణం తిరగేశా.  అందులో వాల్మీకి ఇలా చెప్పేరు. శ్లోకాలు పెట్టాలనుకున్నాగాని, టైప్ చెయ్యలేక మానేశాను, అర్ధం మాత్రమే రాస్తున్నా!

”రావణ కాష్ఠానికి గాను చందనపు కఱ్ఱలు, పద్మకములు, పేర్చారు, వట్టివేళ్ళు, సుగంధాన్నిచ్చేవాటిని పేర్చారు, వాటిపై. దానిపై జింక చర్మం పరచారు. దానిపై రావణుని శరీరాన్ని ఉంచారు.  చితికి ఆగ్నేయంగా ఒక వేదిక నిర్మించారు. దానిపై పశ్చిమంగా గార్హపత్యాగ్ని, తూర్పున ఆహవనీయాగ్ని, దక్షణాన దక్షణాగ్ని ఉంచారు. సృక్కు,సృవాలతో పెరుగు,నెయ్యి కలిపినది చితిపై ఉంచారు. కాళ్ళ వైపు సోమలత తెచ్చిన బండిని ఉంచారు, తొడల మధ్య సోమలతను దంచిన కఱ్ఱరోలుంచారు. ఇక సృక్కు,సృవాలు,అరణులు,చెక్క పాత్రలు,ముసలము అనగా రోకలి ఇతర యజ్ఞ సంబంధ వస్తువులు కఱ్ఱవాటిని వాటికి తగిన ప్రదేశాల్లో ఉంచారు. మంత్రపూరితంగా మేకను బలి ఇచ్చారు. ఆ పైన నేతితో తడిపిన దర్భలుంచారు. ఆ తరవాత రావణ శరీరంపై పూలమాలలు, వస్త్రాలు ఉంచారు. ఇప్పుడు విభీషణుడు రావణకాష్ఠా  నికి నిప్పు పెట్టేడు” అన్నారు.

దీనిలో చిత్రం ఏముందని కదా! రావణుడు బ్రహ్మగారి మనుమడు, అనేక యజ్ఞాలు చేసిన వాడు. ఒక యజ్ఞంలో సోమలత తేవడానికి బండి కావాలి,దానిని తయారు చేస్తారు, కొత్తది. సోమలతను దంచడానికి రోళ్ళు తయారు చేస్తారు, సృక్కులు,సృవాలు ఉంటాయి నేతిని అగ్నిలో ఆహుతి చేసేందుకు. సోమలతను దంచే రోకళ్ళుంటాయి, చెక్కపాత్రలుంటాయి, అగ్నిని మథించే అరణులుంటాయి, ఇలా యజ్ఞానికి కావలసిన సకలమూ కఱ్ఱరూపంలోనే ఉంటుంది. వీటిని తయారుచేస్తారు. ఒక యజ్ఞానికి వాడిన వాటిని మరొక యజ్ఞానికి వాడకూడదు. రావణుడెన్ని యజ్ఞాలు చేశాడో తెలియదు. యజ్ఞం చేసినవారు, వారు యజ్ఞంలో ఉపయోగించిన సామగ్రి మొత్తం దాచుకోవాలి, దానిని వారి అనంతరం వారి శరీరంతో కాష్టం మీద వేసి తగలేస్తారు, రావణుడెన్ని యజ్ఞాలు చేశాడో అంత సామగ్రి చితి మీద వేశారనమాట.  ఇవేకాక రావణుడు నిత్య కర్మలో ఉపయోగించినవాటినీ ఇందులో చేరుస్తారు. మనవాళ్ళో మాటంటారు, ఎవరేనా వస్తువులు ఇలా దాచుకుంటుంటే ”చచ్చాకా మీదేసి తగలేస్తారా?” అని. అదొగో అదేఇది. అలాగే మరోమాట ”నీకు నల్లమేకపోతును బలేస్తారురా” అనీ తిడతారు,కోపంలో అది కూడా ఇందునుంచి వచ్చినదేనని నా ఊహ. యజ్ఞం చేసిన ఒకరు కాలం చేస్తే, ఈ ప్రక్రియకి కొంత సాయం చేశా, అందుకు ఇదంతా గుర్తొచ్చింది. ఇలా రావణకాష్ఠం మామూలుకు అనేక రెట్లు పెరిగిపోయి, చాలా ఎక్కువ సేపు తగలబడిందన మాట. ఇలా ఎక్కువ సేపు ఉండిపోయే తగవును రావణ కాష్ఠంతో పోలుస్తారు.

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-రావణకాష్ఠం

 1. రమణాజీ!
  పంచకట్టు పండగ,ఓణీ వేయించే పండగ జరిపేవారు పల్లెలలో! ఈ పండగలు వారికి ఒక నిర్ణీత సమయంలో చేసేవారు. ఆ పండగల్లో వారిని ఇక పెద్దవారిగా పరిగణిస్తున్నాం అన్న సూచనా, అలా మెలగాలనే భావనా కనిపించేవి. ఓణీ పండగలో అమ్మాయి ఆరోగ్యానికి సంబంధించినవీ కొన్ని చేసేవారట. వీటిని వినడమేగాని ప్రత్యక్షంగా చూడలేదు. ఒక ఓణీ వేసే పండగకి భార్యాభర్తలమిద్దరం ”పెద్దలుగా” వెళ్ళేంగాని, పూర్తి వివరాలు తెలుసుకోలేకపోయాం!
  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. సర్,
  ఎంత వివరంగా రాసారు. రావణకాష్టం గుర్నిచి విన్నదే తప్ప ఇంట విపులంగా ఇప్పుడు తెలుసు కొన్నాను. ఇంకో రిక్వెస్ట్. పంచకట్టు పండుగ గురంచి వ్రాయగలరు………….. నమస్తే.
  అ.వ. ramana

  మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.