శర్మ కాలక్షేపంకబుర్లు-జీవితసమరం తొలిరోజులు-షావుకారు గుమాస్తా

dscn0044

షావుకారు గుమాస్తా

  షావుకారుగారు అమ్మకి చెప్పడంతో మర్నాడే ఆయన దగ్గరకెళ్ళేను. దీని గురించిన టపా ఒకసారి రాసేను అందుకు విస్తారంగా చెప్పను. నేను ఆయనకి ఏం చేసిపెట్టేనో తెలీదుగాని ఆయన నుంచి కొన్ని నేర్చుకున్నా. వడ్డీ కట్టడం, డోకడాలు (చక్రవడ్డి ఏమో) చెప్పేరుగాని నాకు నచ్చక నేర్చుకోలేదు. మరొకరితో ఎలా పని చేయించుకోవాలో, చేయించుకునేటప్పుడు తీసుకోవలసిన జాగ్రతలు,ఎవరితోనైనా గౌరవంగా మాట్లాడే నేర్పు, కోపంలో కూడా సంయమనం కోల్పోకపోవడం, అవసరాన్ని బట్టి మన్నింపుకోరడం, చేసేపనిలో దీక్ష ఆయన్ని చూసి నేర్చుకున్నమాట నిజం, వారి పేరు శ్రీకాకుళపు సుబ్బారావు గారు. ఇవి నా తరవాతి జీవితంలో చాలా ఉపయోగించాయి కూడా. నేను వారి దగ్గర పనిచేసిన కాలం మూడు నెలలు,అంతే. మొదటి రోజుల్లో చేసిన ప్రతి ఉద్యోగం మూడేసినెలలే, బ్రాకెట్ కంపెనీ మొదలుకొని, ఈ సందర్భాలలో సమాజం, మనుషుల మనస్తత్త్వాలు,స్త్రీ పురుష సంబందాలు, డబ్బు చిక్కులు…అంతెందుకు జీవితం లో ప్రాక్టికల్ ట్రైనింగ్….:)

మా యజమాని సుబ్బారావు గారి దగ్గరకి పెద్ద పెద్దవారు వచ్చేవారు, దానితో వీరందరితోనూ పరిచయాలు పెరిగాయి. చాలామందితో పరిచయాలయ్యాయిగాని ఒకరు మా పక్క ఊరి కోఆపరేటివ్ రూరల్ బేంక్ ప్రెసిడెంట్ శ్రీ ఈదర కొండలరావు గారి పరిచయం నా జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. ఈ రూరల్ బేంక్ లో అమ్మ సభ్యురాలు, అప్పుకి దరఖాస్తు చేసుకుంది, ఒక రోజు మురమండ వెళ్ళేం, ఓంటెద్దు బండి మీద. ఆ రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒంటెద్దు బండి కిరాయి రెండు రూపాయలు,అవే ఉండేవికావు. ఉదయం పది గంటలకి మురమండ బేంక్ కి చేరేం.సాయంత్రం దాకా కూచున్నాం, పని కాలేదు,తిరిగిపోదామనుకుంటుండగా కొండలరావు గారొచ్చేరు, నమస్కారం పెడితే మా గురించి వాకబు చేసేరు, పని చేసేవారు తక్కువమంది కావడంతో పని కాలేదని తెలిసి విచారించారు, ఈ సందర్భంలో నేను ఉపయోగపడగలనా? అడిగా, సెక్రెటరీ గారు ఉపయోగపడతానన్నారు, రేపటి నుంచి సాయం చేయడానికి వస్తానని చెప్పేను, మరి షావుకారుగారి మాటో అడిగారు కొండలరావుగారు. ఒక పదిరోజులు వారికి చెప్పివస్తా! వారి పని ఇక్కడనుంచి వెళ్ళేకాను,ఉదయమూ చేసి పెడతానంటే ఒప్పుకున్నారు, అమ్మ సంతకాలన్నీ పెట్టించుకుని, మరల అమ్మ రానక్కరలేకుండా, డబ్బు తరవాత తీసుకునేలా అమ్మకి చెప్పి వెళిపోయాం. మర్నాడు సుబ్బారావుగారికి చెప్పి ఒప్పించి, బేంక్ కి చేరి సాయపడటం మొదలు పెట్టేను. ఫారాలన్నీ నింపడం సంతకాలు పెట్టించడం కార్యక్రమం నేను చేపట్టి తొందర తొందరగా చేయడంతో ఊపందుకుని, అప్పులు మంజూరు వేగమయింది. ఇలా పని చేస్తుండగా బేంక్ కొత్త భవనంలోకి మారింది, భవనం వెనుక ఏవో సామాన్లు సద్దిస్తుండగా ”తమ్ముడూ” అన్నమాట వినపడితే తలెత్తి చూశా, ఎదురు వాకిటిలో అక్క కనపడింది……రమ్మని చెయ్యి ఊపితే వెళ్ళాను, ఇక్కడ పని చేస్తున్నావా? కొండలరావుగారు మంచివాడు, ఆయనను వదలకు,నీకు మంచి జరుగుతుందని చెప్పి, స్వీట్ చేతిలో పెట్టి పంపించింది. మర్నాడు ఉదయం బేంక్ కొచ్చేటప్పటికి అంతా చెవులు కొరుక్కుంటున్నారు, వాతావరణం వింతగా అనిపించింది. సెక్రెటరీ గారు “……. ఇంటికెళ్ళేవా?” అడిగారు, అవును అన్నా, నిన్న సాయంత్రం నువ్వెళ్ళిన తరవాత ప్రెసిడెంట్ గారొచ్చారు, నీ గురించి అడిగారంటే, నేను అక్క ఇంటికెళ్ళినందుకు అడిగినట్టుగా ధ్వనిస్తూ, ఇప్పుడే వెళ్ళి కలుస్తా అన్నా! ఆయన ఊళ్ళో లేరు,రేపొస్తారు అంటే నీరసపడ్డాను,నేను అక్క ఇంటికెళ్ళడానికి ప్రెసిడెంట్ గారు అడగడానికి ఏమైనా సంబంధం ఉందా గుంజాటన పడ్డాను, కొంత తరవాత నిబ్బరించాను, తప్పేం చెయ్యలేదు,భయమెందుకని అనుకున్నా!

మర్నాడు ఉదయమే ప్రెసిడెంట్ గారి దగ్గరకెళ్ళాను, ఆయన నవ్వుతూ పలకరిస్తే,నేను అక్క ఇంటి కెళ్ళిన సంగతి అక్క అన్నమాటలు చెప్పి, నేనేం తప్పు చెయ్యలేదన్న భావన వారికి కలగజేసి, నాకు మీరే సహాయం చెయ్యాలి జీవితంలో స్థిరపడేందుకని అడిగాను. నేను బేంక్ లో సహాయం చేసినందుకు కొంత మొత్తం పారితోషకమిచ్చారు. నేను బేంక్ లో ఉద్యోగం ఇవ్వగలనుగాని అది చిన్నది, ఉపయోగపడనిది. మీకు ఇంతకంటే మంచిభవిషత్తుకోసం ఒక మాట చెబుతానని, ఒక అప్లికేషన్ చేతిలో పెట్టి, రాజమంద్రిలో ఉన్న సహకార శిక్షణా సంస్థ వారి దరఖాస్థు ఇది, నిన్నను వెళ్ళి ఈ ఫారం తెచ్చాను. దీనిలో మీకు సీట్ రిసర్వ్ చేసి ఉంచాను, ఈ ట్రైనింగ్ పది నెలలు, ఫారం పూర్తి చేసి పట్టుకొస్తే నేను సంతకం చేసిస్తా, వెళ్ళి ఆ ట్రైనింగ్ అవండి, కోఆపరేటివ్ సూపర్ వైజర్ గా మంచి ఉద్యోగం వస్తుంది, నేను చూసిపెడతానుకదా అని హామీ ఇచ్చారు, ఒక పక్క సంతోషం, మరో పక్క గుండెల్లో రాయి పడింది…. ఇంటికొచ్చి అమ్మకి చెప్పా……

ఇక్కడ పని చేసిన కాలం బహు తక్కువేగాని మనుషుల్ని పరిశీలించడం అలవాటయింది, వృత్తులు, ప్రవృత్తులు తేడాగా ఉంటాయని తెలుసుకున్నా! అక్క గణిక కావచ్చు కాని ఆమె ప్రవృత్తి నన్ను ఆకట్టుకుంది, ఇతరులకు చేయగల ఉపకారం చేయాలనే ఆమె మాట నాకు నాటుకు పోయింది. శ్రీ కొండలరావు గారు నేనెవరో తెలియని సందర్భం, ఆయనకు నా వలన చిన్నమెత్తు ఉపకారం లేకపోయినా నాకు ఉపకారం చేయాలనే వారి ప్రవృత్తి…ఏమని చెప్పను? మెరిసేదంతా బంగారమూ కాదు, మెరవనిది బంగారం కాకాపోదు… అక్క మాటతో నాకు సహకారమిస్తే కొండలరావుగారు చేతతో సహకారమిచ్చారు, నేనెవరో తెలియకపోయినా జీవితంలో వీరు నా పట్ల ఎందుకు అభిమానం చూపారు? అది వారి సహజ స్వభావం……

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-జీవితసమరం తొలిరోజులు-షావుకారు గుమాస్తా

 1. అనామకంగారు,
  తమ పేరు చెప్పి ఉంటే ఆనందించేవాడిని. మంచి సూచన, పెద్దలమాట చద్ది మూట, కాదనడం కాదుగాని,

  ఇప్పటికే ”జీవితసమరం” పేరుతో చాలా టపాలు రాసేశాను, మరి రెండో మూడో టపాలతో ముగిసిపోతోంది, ఇప్పుడు మార్చలేని అశక్తతకి మన్నించ వేడుకుంటున్నాను.

  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. అన్యగామిగారు,
  లేమిలో పుట్టి లేమిలో బతకడం, వానాకాలం చదువుతో ఆగిపోవడం, పల్లెలలో బతకడం, సామాన్యుల బాధలు,ఆనందాలు దగ్గరగా చూడడం, సామాన్యంగా బతకడం, చిన్న ఉద్యోగాలు చాలా చేయడం, సమాజంలోని ప్రతివారితోనూ మాటా పలుకూ చేయడం, ఇవి అనుభవాలకి మెట్లు.

  ఒక గణిక, వేశ్యకీ మనసుంటుంది, బాధ,భయం, ప్రేమ, ఆనందం…..ఎలా చెప్పను. ఆ అక్క నన్ను చదువుకోమని ప్రోత్సహించింది, ఇంకా చదువుకో నేను డబ్బులిస్తానంది, నమ్మగలరా? ఒక గణికను అక్కగా భావిస్తే నవ్వుకోరూ…. కొన్ని కొన్ని సందర్భాలలో అనుభవించిన అవమానాలు, ఎన్నని చెప్పేది? సంఘం చెక్కిన మనిషిని 🙂

  చాలా అనుభవాలు చెప్పుకుంటే చిన్నగా ఉంటాయి, నవ్వుకోవచ్చు,లేదా ఎగతాళీ చేయచ్చు నేటి ఆధునికులు 🙂
  చివరికొచ్చేసేను గనక కొంత మనసు విప్పేను.
  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 3. విన్నకోట నరసింహారావుగారు,
  నాటి కాలానికే నిరుద్యోగ సమస్య బాగా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం కలగలపు,సోషలిజం అనడంతో రాజకీయ నాయకులు ప్రతి రంగంలోనూ అధికారం వెలగబెట్టే రోజులైపోయాయి. అప్పటికే అవినీతి,బంధుప్రీతి,చీకటి బజారు జడలు విప్పి నాట్యం చేస్తున్నాయి. మనవాడైతే చాలు ఏం చేసినా చెల్లిపోతుందనే రోజులు. నిజాయితీ వదిలేస్తే బతకడానికి కావలసినన్ని అవకాశాలు.

  బతకాలన్నది ఒక్కటే ఆశ,కోరిక. ఊరక ఏదీరాదన్నదీ, వచ్చినా నిలవదన్నదీ నాటికే నాటుకుపోయిన మాట. చిన్న చిన్నవి చెప్పి మరీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. కొత్తగా టూరింగ్ సినిమా వచ్చింది, మావూరు. టూరింగ్ సినిమా హాల్లో ఆపరేటర్ గా పని చెయ్యాలని పని నేర్చుకున్నా కొంతకాలం. ఆ తరవాత టూరింగ్ సినిమా గేట్ దగ్గర టిక్కట్లు చింపాను, గొప్ప ఉద్యోగాలేం చేయలేదండి 🙂 .

  కోఆపరేటివ్ సూపర్ వైజర్ గా ట్రినింగ్ అయ్యా! తర్వాత భాగంలో చెబుతున్నా!

  ఎన్ని అవమానాలు, చెప్పుకోలేక, అక్షరబద్ధం చెయ్యలేక…ఎన్ని అనుభవాలు…..
  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 4. కొందరు పెద్దలు ఇంత వైవిధ్యంతో ఎలా రచనలు చేస్తారనుకొనేవాడిని. శ్రీశ్రీ గారైన, తిరుమలరామచంద్ర గారైనా, గురువుగారైనా యుక్త వయస్సులో చదువుతో పాటు అనేక ఉద్యోగాలు అనుభవాలు పొందటంవల్ల వారు వ్రాసే వస్తువు పరిపుష్టంగాను, ఆసక్తికరంగాను ఉంటుంది. పాశ్చ్యాది రచయితల్లో కూడా ఇటువంటి వారి వ్రాతల్లోనే లోటు ఎక్కువ కనిపిస్తుంది. ఎందరో అన్నట్టు గురువుగారి గురించి రోజు చదివి మురిసిపోవటం తప్ప, ఎంత చెప్పినా తక్కువే.

  మెచ్చుకోండి

 5. టెలిఫోన్ డిపార్టుమెంటు లో ఉద్యోగం దొరికే వరకు మీ ప్రయత్నాలలో చాలా అనుభవాలే ఎదురయినట్లున్నాయి మీకు, శర్మ గారు! బ్రాకెట్ కంపెనీ లో స్లిప్పులు, షావుకారు దగ్గర వడ్డీ లెక్కలు, రూరల్ బ్యాంక్ లో ఫారాలు నింపడం, కోపరేటివ్ ట్రెయినింగ్ …….. వైవిధ్యంగా ఉంది (ఇంతకీ కోపరేటివ్ సూపర్ వైజర్ శిక్షణ అయ్యారా?). మీరన్నట్లు రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు ఎదురవడం కూడా జీవితంలో పాఠాలు నేర్పే అనుభవమే.

  మెచ్చుకోండి

 6. కుంభికా కోకిలం 🙂

  షావుకారు గుమాస్తగానటు సాగరమ్మున దేలితీ
  జీవితమ్మున నేర్చుకొంటిని జీవగర్రల నెన్నియో
  రావుగార్లట సాహచర్యము రాటుదేల్చగ, భోగినీ
  భావమెల్లెడ మేలుజేయు సుభాషితమ్ముల గాంచితీ !

  జిలేబి

  మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.