శర్మ కాలక్షేపం కబుర్లు-చదవేస్తే……

చదవేస్తే……

  చదవేస్తే ఉన్నమతి పోయిందని, చదువుకోకముందు కాకరకాయ చదువుకున్న తరవాత కీకర కాయ అన్నట్టు గా ఉంది మన బేంక్ ల పని. ప్రధాని పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన వెంటనే పెద్దలగుమ్మాల్లో కట్టలు అందజేసిన ఘనత కలిగినవి మన బేంకులు. ప్రజలు సొమ్ముకోసం బారులు తీరితే ఏ.టి.ఏమ్ లలో పెట్టవలసిన సొమ్ము నల్ల ధనవంతులకు చేరవేసినవి మన ప్రభుత్వరంగ ప్రైవేట్ బేంకులు, అన్ని శాఖలు అందరూ అలా చేసేరననుగాని ప్రభుత్వ నిర్ణయానికి తూట్లు పొడిచిన ఘనత మన బేంక్ లదే అని చెప్పక తప్పదు. దొరికినవారే దొంగలు దొరకనివారెందరో! బేంక్ లకు తెలియక నల్లడబ్బు నేడు నగదు రూపంగా మరొక చోట లేదు, ఇది కఠోర సత్యం.

  సామాన్యుడు వరసలో నిలబడి సొమ్ము తెచ్చుకోడానికి అవస్థ పడినా ప్రభుత్వంతో సహకరించాడు, కాని నేడు బేంక్ లు ఆ సామాన్యుడి నడ్డి విరిచే పనిలో పడ్డాయి, అంటే అతిశయోక్తి కాదు. బేంక్ పేరు చెబితే చాలు పన్నేసేలా ఉన్నాయి. ప్రభుత్వం నల్లధనాన్ని అరికట్టాలనుకుంటుంటే బేంక్ లు సామాన్యుడిని దోచుకోవాలనుకుంటున్నాయి. ప్రజలకి ఇబ్బంది కలగకూడదని ప్రభుత్వం అనుకుంటుంటే బేంక్ లు మాత్రం సామాన్యుడి కాతాలో సొమ్మెస్తే పన్ను,తీస్తే పన్ను, ఉండవలసిన సొమ్ము తగ్గితే పెనాల్టీ, క్రెడిట్ కార్డ్ పన్ను, నాలుగు సార్లకంటే ఎక్కువ సార్లు తీసుకుంటే పన్ను, మరో బేంక్ ఏ.టి.ఎం లో తీసుకుంటే పన్ను, సొమ్ము ఎంతైనా సరే మరొకరికి ట్రాన్స్ఫర్ చేస్తే పన్ను….. పన్ను,పన్ను,పన్ను ఇలా కాల్చుకుతినేస్తున్నట్టే వుంది. చిత్రమైన సంగతి ఒకే ఊళ్ళో ఉన్న మరో బేంక్ కాతాకి సొమ్ము మళ్ళించడానికి చెక్కిస్తే దానిని ఆ కాతాకి చేర్చడానికి బేంక్ లు తీసుకుంటున్న సమయమెంతో తెలుసా? దగ్గరగా పదిహేను నుంచి ఇరవై రోజులు. అంటే ఇలా చెక్కుల్ని నిరాదరణ చేయాలనీ, ఇంటర్ నెట్ ద్వారా సొమ్ము పంపిస్తే సొమ్ము గుంజచ్చనీ బేంక్ ల యోచన.

ఇప్పుడు బేంక్ లో అక్కౌంట్ ప్రతివారికి తప్పదు, ఆఖరికి బేంక్ ముందు రెండు సార్లు తచ్చాడినా అక్కౌంట్ నుంచి సొమ్ము పన్ను రూపంలో వసూలు చేసేలా ఉన్నాయి,బేంక్ లు. దీనికి ప్రభుత్వ ప్రవేట్ బేంక్ లకి తేడా ఉన్నట్టు లేదు. సామాన్యుల సొమ్ము ఇలా పన్ను రూపంలో దోచుకుని బేంక్ లు తమ నష్టాలను పూడ్చుకోవాలనుకుంటున్నాయనుకుంటా. ఇది రిజర్వ్ బేంక్ వారి దృష్టికి రాలేదా? వారు దీనిని సమస్యగా చూడటం లేదా? నల్ల ధనవంతులు ప్రభుత్వానికి, బేంక్ లకు దొరక్కుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోడం కోసం ప్రయత్నిస్తుంటే, బేంక్ లు అదే సావకాశాన్ని చిన్నవారి నడ్డి విరిచేందుకు ఉపయోగిస్తున్నాయి.

నగదు చెల్లింపుకు సామాన్యులు ఇష్టంగానూ లేరు, వారికి బేంక్ తప్పించి మరోదారిలేకుండా చేసి, వారిని పన్ను,సేవ రూపంలో బేంకులు దోపిడి చేయదలచుకున్నాయా? ఏప్రిల్ ఆరవతేదీన బేంకులను వినియోగించుకోవద్దనే స్థాయికి ఈ సమస్య పెరిగిపోయిందన్నది రిజర్వ్ బేంక్, ప్రభుత్వ దృష్టికి రాలేదా? చిన్న విషయంగా తీసుకుని దీనిని గనక అజమాయిషీ చేయడానికి, నియంత్రించడానికి రిజర్వ్ బేంక్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు చాలా ఘోరంగానే ఉండబోతాయి. బేంక్ అక్కౌంట్ నుంచి బేంక్ లు తీసుకుంటున్న సొమ్ము ఎందుకుతీసుకుంటున్నది వివరాలుండవు,అడిగితే చెప్పేనాథుడూ కనపట్టం లేదు, ఇదీ నేటి బేంక్ ల పరిస్థితి. సామాన్యులు నల్లధనవంతుల్ని పట్టుకోడంలో ప్రభుత్వానికిచ్చిన మద్దతుకు విలువలేనట్టే, ఇలా కొనసాగితే. ప్రతి విషయమూ ప్రధాని కలగజేసుకుంటే కాని పని కాదా? ఇది సామాన్యులను దొలుస్తున్న ప్రశ్న…….ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వ అడుగుజాడల్లోనే ప్రయాణిస్తోందా? బేంక్ లను కట్టడి చేయకపోతే జరగబోయేది నేను చెప్పక్కరలేదు,బేంక్ లు ప్రభుత్వం చేస్తున్న ఆర్ధిక సంస్కరణలకు వ్యతిరేకంగా ఉన్నాయి, గుర్తించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి….తస్మాత్ జాగ్రత

Follow on http://www.offprint.in/

6 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-చదవేస్తే……

 1. విన్నకోటవారు,
  మీ బ్లాంక్ చూసి మొదటగా గుర్తొచ్చింది ఎమర్జన్సీ రోజుల్లో ఎడిటోరియల్ కాలమే! కాని ఆ తరవాత ఏమో,ఎక్కడేనా తప్పు చేశామా అని సందేహం పీకిందండి! దాసుని తప్పు దండంతో సరి అన్నారు కదండీ 🙂 అందుకు ఒక ముదస్తు నమస్కారం పెట్టేసేననమాట, దానికేంగానండి

  పెద్ద కామెంట్ కదండి అందుకు వర్డ్ ప్రెస్ స్పాంలోకి పంపేసిందండి, కాని రెండు కామెంట్లూ తీసుకుని స్పాంలో పెట్టింది, చూసుకోవోయ్! అని. రెండూ తీసుకుందని మీకు తెలియడానికే రెండూ ప్రచురించా! మీరు చూసారని తెలిసి ఒకటి తీసేశా!

  ఒకప్పుడు నియంత్రణ ఉన్నది, దానిని అమలౌ బేంక్ లు అమలు
  పరచడం ఒక అందం ఉండేదండి, ఇప్పుడు ఎవరిష్టం వారిదైపోయి, సామాన్యులనుండి గోళ్ళూడకొట్టి సొమ్ములు వసూలు చేయాలనే దురాశ బేంక్ ల్లో పెరిగిపోయిందండి. దానికి నేనిచ్చిన్ ఒక చెక్కు ఉదంతమే సాక్ష్యం. ఏమండీ ఇంతకాలం తీసుకుందంటే ఒక బేంక్ ఉద్యోగి అన్నమాట, చాలా తొందరగా చేశారంది,మీపని, అంటూ క్లియరింగ్ హవుస్ పని గురించి చెప్పుకొచ్చాడు, విన్నానండి :).

  ఎంత సరళీకరణైనా ప్రజలు ఇష్టపడకపోతే, ప్రజలని పీడిస్తే ఏంజరుగుతుందో నేను చెప్పాలంటారా? 🙂

  రిజర్వ్ బేంక్ కి, ప్రభుత్వానికి వివేకం మేల్కొంటుందని ఆశిస్తానండి.
  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. మీరు నన్ను క్షమాపణ అడగడం ఏమిటండి శర్మ గారు, ఏ మాత్రం బాలేదు.
  ఇక Blank అనే నా వ్యాఖ్య కథ చెబుతాను. 1975 లో ఎమర్జన్సీ ప్రకటించినప్పుడు ఒక జాతీయ స్ధాయి వార్తాపత్రిక – Indian Express అని జ్ఞాపకం – ఎడిటోరియల్ కాలమ్ మాత్రం (అది అప్పట్లో సెంటర్ పేజ్ లోనే వచ్చేది. ఇప్పుడా సంప్రదాయం వదిలేసినట్లున్నారు 😕) పూర్తిగా ఖాళీగా (blank) ఉంచి ఆ రోజు పత్రిక ప్రచురించారు. అంటే ఆ రకంగా వారి నిరసన వ్యక్తం చేశారన్నమాట.
  అదే పంథాలో బ్యాంక్ రుసుముల పెంపు గురించి నేను అవాక్కయ్యానని తెలియజేసేలా నా వ్యాఖ్య పెడదామనుకున్నాను. కానీ కామెంట్ బాక్స్ blank గా ఉంచితే వ్యాఖ్య ప్రచురించనని WordPress మొండికేసింది. వేరే దారి తోచక Blank అనే పదం వ్రాసి వ్యాఖ్య పెట్టాను. అయ్యా అదీ సంగతి.
  LPG (Liberalisation, Privatisation, Globalisation) వరకు మన బ్యాంకుల మధ్య అనారోగ్యకర పోటీ నెలకొనకుండా పలు విషయాల మీద RBI వారి నిర్దేశకాలుండేవి. ముఖ్యంగా వడ్డీ రేట్లు, డిపాజిట్ల కాలపరిమితి, రుణాల మీద కనీస వడ్డీ రేటు వగైరా (అంతే కాదు, ఆహార ధాన్యాలు, పప్పులు, నూనెలు లాంటివి అక్రమ నిల్వలు చెయ్యకుండా, వాటిని బ్లాక్ మార్కెట్ చెయ్యకుండా నివారించే ప్రయత్నంలో భాగంగా Selective Credit Control పేరిట వాటి మీద ఇచ్చే బ్యాంక్ రుణాల మీద కంట్రోల్ కూడా ఉండేది). ఇక సర్వీస్ రుసుములు – బ్యాంక్ డ్రాఫ్టులు, కలెక్షన్లు వగైరా విషయాలు IBA వారు (Indian Banks’ Association) చూసేవారు. ఇవన్నీ అన్ని బ్యాంకులకూ యూనిఫాం కాబట్టి ఇక ఓ బ్యాంక్ బిజినెస్ పెరగాలంటే, ఉన్నది పోకుండా ఉండాలంటే ఆ బ్యాంక్ ఇచ్చే కస్టమర్ సర్వీస్ నాణ్యతే కీలకంగా ఉండేది చాలా మటుకు. ఆ రోజులే బాగున్నాయా? LPG తర్వాత ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు విరివిగా వచ్చేసాయి. వారి వ్యాపార దృక్పథం, పద్ధతులు వేరేగా ఉంటున్నాయి. పోటీ తట్టుకోవడం కోసం అనే పేరుతో మిగతావారు కూడా అదే ధోరణి అవలంబిస్తున్నారు. RBI, IBA జోక్యం బాగా తగ్గింది (సరళీకరణ కదండి మరీ). ఏతావాతా ఆ ప్రభావం సామాన్యుడి మీద కనిపిస్తోందనిపిస్తోంది.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 3. అన్యగామిగారు,

  ప్రభుత్వానికి అన్ని విషయాలూ తెలియవండి.

  బేంక్ లో కొన్ని కొన్ని విషయాలు రిజర్వ్ బేంక్ నిర్ణయిస్తుంది. కొన్నిటిని బేంక్ ల ఇష్టానికి వదిలేస్తుంది. ఇది రిజర్వ్ బేంక్ మరియు ప్రభుత్వానికి చిన్న విషయాలు, కాని ప్రజలకి ప్రాణాంతకాలు, మెడలకి వేసిన ఉచ్చులు.

  ఒకో బేంక్ ఒకోలా ఛార్జీలు తీసుకుంటున్నాయంటే అది వాటి స్వంత నిర్ణయానికి వదలివేయబడిందని అనుకోవాలి, బేంక్ లు ఆబగా ఛార్జీలు తీసుకోవాలనుకుంటున్నాయి.

  అదే రిజర్వ్ బేంక్ చెప్పిన మాటైతే అన్నిటా ఒకలాగే ఉంటాయండి ఛార్జీలు. ప్రభుత్వం కదలకపోతే మాత్రం….కదిలించక తప్పదండి.
  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 4. సరైన సమయంలో సరైన విమర్శ. ప్రభుత్వానికి తెలియకుండా ఉంటుందని అనుకోలేము. బ్యాంకులకి, ప్రభుత్వానికి సమన్వయం లోపించి, ఏదో ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నట్టుంది. మరో విషయం ఏమిటంటే నల్ల ధనం పరుపుల్లో , నేలలో దాచుకోవటం పాత పద్దతి, బ్యాంకులో దాచటం నయా పద్దతి.

  మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.