శర్మ కాలక్షేపంకబుర్లు-కంటికి నిద్ర వచ్చునే?

కంటికి నిద్ర వచ్చునే?

   పాండవులకు రాజ్యభాగం ఇచ్చిన తరవాత వారొకపట్టణం కట్టుకున్నారు, మయుడనేవాడు ఒక సభాభవనాన్నీ నిర్మించి ఇచ్చాడు. ఆ భవనాన్ని చూడ్డానికని రాజసూయం ఐపోయిన తరవాత దుర్యోధనుడు,శకుని ఉండిపోయారు.

” అట దుర్యోధనుండు శకునియుం దానును సభాభవనంబు జూచు వేడుక నందుగొన్ని దినంబులుండి యొక్కనాడు………………………..విమల మణిస్థలంబు జలాశయంబుగా వగచి పరిధానంబెగ ద్రోచికుని స్పటిక దీప్తి జాలపరివృతంబైన జలాశయంబు స్థలంబుగా జూచి కట్టిన పుట్టంబు దడియం జొచ్చి క్రమ్మఱిన వానింజూచి పాంచాలియు బాండు కుమారులు నగిరంత” సభా ప.ఆశా.2…86

సాధారణ నేలను జలాశయంగా అనుకుని పంచ ఎగ్గట్టి, జలాశయాన్ని మామూలు నేల అనుకుని అడుగేస్తే పంచె తడిసింది దీన్ని చూసి పాండవులు పాంచాలి నవ్వేరు.

ఇది తెలిసి ధర్మరాజు భీముని చేత పొడిబట్టలు దుర్యోధనునికి అందజేశాడన్నారు.ఇది కవిత్రయం మాట.

కాని సుయోధనుడు ఏం జరొగిందో వివరంగా తండ్రికి ఇలా చెప్పుకున్నాడు. ”నిర్మల స్ఫటిక శిలా నిర్మితంబై……………………….జలబుద్ధింజేసి బరిధానోత్కరణంబు సేసి విమలశిలాతలబుద్ధి నుదకపూర్ణంబున వాపి సొచ్చి కట్టిన పుట్టంబు దడియం ద్రెళ్ళిన నన్నుంజూచి వృకోదరుండు నగియె. దానినంతయు నెఱింగి ధర్మరాజచోదితులైన కింకరులు నాకు పరిధానంబు దెచ్చి యిచ్చిరి మఱియు……..యనేక సహస్ర విలాసినీపరివృతయయి యున్న ద్రౌపది నగియె నంత నకుల సహదేవులు పఱతెంచి యిదె వాకిలి ఇట వచ్చునది యని నన్నుం దోడ్కొనిపోయిరట్టి సభాప్రలంభంబు నాకు హృదయశల్యంబయి యున్నయది.” సభా ప.ఆశా2….140

స్పటిశిలామయమైన ప్రదేశంలో నీరుందనుకుని పంచె ఎగగట్టేను, మరోచోట మామూలు ప్రదేశమని కాలేస్తే నీటితో పంచె తడిసింది, అది చూచి భీముడు నవ్వేడు. అంతా తెలిసిన ధర్మరాజు సేవకులతో పొడిబట్టలు పంపేడు. ఆ తరవాత అనేకవేల చెలికత్తెలతో ఉన్న ద్రౌపది నవ్వింది అని చెప్పుకున్నాడు.

   ముందు వ్యాసుడు చెప్పినదానికి దీనికి కొంత తేడా ఉంది గమనించారా? వ్యాసుడు పాండవులు,ద్రౌపది నవ్వేరన్నారు,దుర్యోధనుడు భీముడు నవ్వేడు, ఆతరవాత ద్రౌపది చెలికత్తెలతో ఉన్నది నవ్వింది,నకులసహదేవులు దారి చూపించారు. అన్నాడు. ఇందులో ఏది నిజం? రెండూ నిజమే ఎలాగంటే ఇద్దరు చెప్పినదానిలోనూ ధర్మరాజు లేడు. దుర్యోధనుడు చెప్పినదానిలో నకులసహదేవులు దారి చూపారన్నాడు. మిగిలినవారు ఇద్దరు వాళ్ళు భీముడు,అర్జునుడు. ద్రౌపది నవ్విందని ఇద్దరిమాటా. అసలు దుర్యోధనునికి బాధ కలిగించినది భీముని నవ్వేగాని ద్రౌపది నవ్వు కాదు 🙂

ఎందుకంటే

కంటికి నిద్రవచ్చునే సుఖంబగునే రతికేళి జిహ్వకున్
వంటకమిందునే, ఇతర వైభవముల్ పదివేలు మానసం
బంటునె, మానుషంబుగలయట్టి మనుష్యున కెంతవానికిన్
గంటకుడైన శాత్రవు డొకండు తనంతటివాడు గల్గినన్ (కాశీఖండం.)

కంటి మీద కునుకొస్తుందా? రతికేళి సుఖంగా ఉంటుందా? రుచికరమైన వంటకం జిహ్వకు రుచిగా తోస్తుందా? అంతెందుకు పదివేల వైభవాలు మనసుకి పడతాయా? పౌరుషం కలిగినవారికి, తనంతవాడైన శత్రువు కనపడితే?

అంతటి శత్రువు కలిగితే పైవన్నీ కనపడవని తాత్పర్యం. 🙂

అందుకే బలవంతుడైన శత్రువు, భీముని నవ్వు దుర్యోధనుని అంతగా బాధించింది.

కంటికి నిద్ర వచ్చునే…… 🙂

ప్రకటనలు

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కంటికి నిద్ర వచ్చునే?

 1. తాడిగడప శ్యామలరావుగారు,
  దుర్యోధనునికి కూడా ఆత్మన్యూనత ఉంది, అది ఆసమయంలో అసూయగా మారి, వాళ్ళు నవ్వుకుంటుంటే తననే చూసినవ్వేరనుకుని నిండా పడ్డాడు, అదే ఉలికిపాటు.
  మరోమాట రాజధానికి పట్టణస్ం లేని రాజ్యమిస్తే అక్కడ ఒక పట్టణం కట్టేసుకున్నారు, గొప్ప సభని మయుడు నిర్మించి ఇచ్చాడు, ఇంతమంది రాజులు నజరానాలు చెల్లిస్తున్నారు,వంగి దణ్ణాలు పెడుతున్నారు, రేపు నేనూ ఇంతేనా? ధర్మరాజు ముందు వెలవెలపోతానా అనే భయం పట్టుకుంది, పాపం. వారు ఉల్లాసంగా నవ్వుకుంటుంటే చూసి సహించలేని చూపోపమే దుర్యోధనునిది.
  మీ వివరణకి
  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. విన్నకోటవారు,
  నూతన వత్సర శుభకామనలు. కొత్త సంవత్సరంలో నైనా బ్లాగ్ మొదలుపెట్టండి, మేమంతా రాయడం లేదూ 🙂 లలితమ్మాయి బానే చెప్పింది, ఉన్నమాట.

  DG గారు భట్టాత్తిరిగారి నారాయణీయంలో అలా వుందంటున్నారు. వ్యాసభారతానికి కవిత్రయానికే కొన్ని కొన్ని భేదాలున్నట్టున్నాయి. ఇలా అసలు మినహాలు చాలానే ఉన్నాయనుకుంటా 🙂

  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 3. శ్యామలరావు గారికి,
  ముందుగా మీకు, మీ కుటుంబానికీ ఉగాది శుభాకాంక్షలు.

  ఇక్కడ విషయం గురించి మీరు మరింత విశ్లేషణ చేసినందుకు ధన్యవాదాలు.

  నా వ్యాఖ్య ఏకైక ఉద్దేశ్యం మయసభలో దుర్యోధనుడు భంగపడినప్పుడు కృష్ణుడు అక్కడ లేడని DG గారికి చూపిద్దామని మాత్రమే. ఎందుకంటే ఇక్కడ వ్యాఖ్యల క్రమంలో వారు తన వ్యాఖ్యలో అన్నారు కృష్ణుడితో సహా అందరూ అక్కడే ఉన్నారని. కవిత్రయంలో అలా లేదు అని చెబుదామని నా ప్రయత్నం. ఆ పద్యాలను తెచ్చే బదులు TTD వారి పుస్తకంలో ఇచ్చిన తాత్పర్యం యథాతథంగా తీసుకున్నాను. అందరూ ఉన్నది యాగం సమయంలోనేననీ, మయసభ భంగపాటప్పుడు కాదనీ, యాగం అయిపోగానే కృష్ణుడు తిరిగి ద్వారక వెళ్ళిపోయాడనీ చెబుదామనే ప్రయత్నం.

  మీరన్నట్లు కృష్ణుడు తదితరులు ఆనందపడుతుంటే తనని చూసే నవ్వుతున్నారని, “ఒంటికి కారం” రాసినట్లుందని అనుకోవడం దుర్యోధనుడి అప్పటి మానసికస్ధితిలో ఆశ్చర్యమేమీ లేదు. ధర్మరాజుతో జూదమాడడానికి తండ్రిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడుగా, అందుకని జరిగినదాన్ని వక్రీకరించి చెప్పడం / తనకు అనుకూలమైన భాష్యం చెప్పడం మానవనైజమే కదా.

  ఇక పోతే “అప్పుడు ధృతరాష్ట్రుడితో తనకు మయసభలో జరిగిన భంగపాటును ప్రస్తావించలేదు దుర్యోధనుడి మాటలు” అన్నారు మీరు. ఈ రెండు పద్యాలల్లోనూ చెప్పలేదు నిజమే. కానీ ఈ సంభాషణలోనే కొనసాగింపుగా ఆ సంగతీ ప్రస్తావించాడు (వ.140 చూడండి). తమ పన్నాగం కోసం ప్రస్తావించాలి కదా, అలాగే చేశాడు.

  మీ విశ్లేషణ కరక్టే. అయితే DG గారు ఓ కొత్త కోణం చెప్పారు కాబట్టి నేను నా వంతు ప్రయత్నం చేశాను.

  మెచ్చుకోండి

 4. ఇకపోతే దుర్యోధనుడు తండ్రితో యాగం గురించి చెప్పిన మాటల్లో మీరన్న పద్యం

  యేను మొదలుగా మహీపతులెల్లను
  దీప్తిదఱిఁగి యుండఁ దివిరి మమ్ము
  నగిరి కృష్ణపాండునందన ద్రౌపదీ
  సాత్యకులుఁ గరంబు సంతసమున

  అన్నది ఉంది. ఇక్కడ ఈ మాటలవలన పాండవుల ఉల్లాసాన్ని చూసి, వారి హితైషులు ఆనందాన్ని చూసీ వారి ముఖాల్లో దరహాసచంద్రికలను అవి చిన్నబోయి ఉన్న తమపైన వారు విసరిన వెటకారపు నవ్వులని సుయోధనుడు భ్రమపడుతున్నాడని స్పష్టం అవుతున్నది. ఆ భ్రమకు కారణం అతన మాత్సర్యపూరిత మనస్తత్త్వం తప్ప మరొకటి కాదు.

  అదీకాక అప్పుడు ధృతరాష్ట్రుడితో తనకుమయసభలో జరిగిన భంగపాటును ప్రస్తావించలేదు దుర్యోధనుడి మాటలు. కాబట్టి పైపద్యం వారు కులుకుల నవ్వులకు తనఒంటికి కారంరాసిన ట్లుందని చెప్పుకోవటమే తప్ప ఒక ఉదంతాన్ని గురించి కాదనేది స్పష్టం.

  మెచ్చుకోండి

 5. విన్నకోటవారూ, దుర్యోధనుడిని చూసి కృష్ణుడు నవ్వింది యాగ సమాప్తప్పుడే గాని మయసభలో కాదని తెలుస్తోందంటారు. పాండవసభామహిమకు దుర్యోధనుండు లజ్జితుండైన సందర్భంలో సభాపర్వ వచనం “అట దుర్యోధనుండు శకునియుం దానును సభావిభవంబుఁ జూచువేడుక నందుఁ గొన్ని దినంబు లుండి యొక్కనాఁడు దాని యపూర్వరమణీయతకు విస్మితుం డగుచు నయ్యయి ప్రదేశంబులం గ్రుమ్మరువాఁడు వివృతంబైన ద్వారదేశంబు సంవృతంబుగా వగచి చొర నొల్లక సంవృతంబుగా వగచి చొర నొల్లక సంవృతంబైనదాని వివృతంబుగా వగచి చొరంబోయి లలాటఘట్టిత గృహద్వారుం డయి సమప్రదేశం బున్నతంబుగా వగచి యెక్క సమకట్టి నీలాశ్మరశ్మిస్థగితం బైన విమల మణిస్థలంబు జలాశయంబుగా వగచి పరిధానం బెగఁద్రోచికొని స్పటికదీప్తిజాల పరివృతం బైన జలాశయంబు స్థలంబుగా వగచి కట్టినపుట్టంబు దడియంజొచ్చి క్రమ్మఱిన వానిం జూచి పాంచాలియుఁ బాండుకుమారులును నగి రంత” అని ఉంది. ఇక్కడ శ్రీకృష్ణభగవానుడి గురించి లేదు. అదీ కాక ఇది వ్యాసభారతంతో ఎంతవరకూ ఏకీభవిస్తుందో పరిశీలించవలసి ఉంది.

  మెచ్చుకోండి

 6. DG గారు, మళ్ళా ఉగాది పండగ నాడు మొదలెట్టాడేమిటి అనుకోకండి. మయసభ సంఘటన జరిగినప్పుడు కృష్ణుడక్కడ ఉండడమేమిటి అనే సందేహ నివృత్తి కొరకై మరొకసారి భారతం తిరగేశాను.
  //////////////////
  ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగం చూడడానికి దుర్యోధనాదులు తరలి వచ్చారు. యాగానంతరం హస్తినకు తిరిగి వచ్చిన తను విచారంగా ఉండడానికి కారణాలు తండ్రికి వివరిస్తూ దుర్యోధనుడు అన్న మాటల గురించి కవిత్రయ భారతంలో ఇలా ఉంది.
  ===========
  శ్రీ మదాంధ్ర మహాభారతము
  సభాపర్వము – ద్వితీయాశ్వాసము

  103. వ. అనిన విని ధృతరాష్ట్రునకు దుర్యోధనుం డి ట్లనియె.
  ——————-
  118. వ. అట్టి రాజసూయాధ్వరంబున …………..
  తాత్పర్యం : అలాంటి రాజసూయయాగం చివర చేసే అవబృథస్నానసమయంలో – పాండవ పురోహితుడు ధౌమ్యుడు, నారద వ్యాసాది మహర్షులతో కలిసి – బ్రహ్మర్షులు, రాజర్షులు, దిక్పాలకులు కొలుస్తున్న ఇంద్రునిలా వెలుగుతున్న ధర్మరాజును, అన్ని పుణ్యనదుల జలాలతో అభిషేకించాడు.
  ———————
  119. సీ. అభిషిక్తుడయిన యయ్యమరాజసుతునకు । …………
  ఆ. యేను మొదలుగా మహీపతు లెల్లను । ………………
  తాత్పర్యం : రాజసూయంలో అభిషిక్తుడైన ఆ ధర్మరాజుకు సాత్యకి ముచ్చటగా ముత్యాలగొడుగు పట్టాడు. భీమార్జునులు మణులు పొదిగిన బంగారుకాడలున్న చామరాల జంటను ధరించి చెరొకవైపు నిలిచారు. శ్రీకృష్ణుడు, నకులసహదేవులు, ద్రుపదరాజ పుత్రుడైన ధృష్టద్యుమ్నుడు పట్టాభిషిక్తు లయిన రాజు లందరిని వేరువేరుగా కొనిపోయి ధర్మరాజుకు మ్రొక్కించారు. ఆ వైభవాన్ని చూచి నేను, తక్కిన రాజులు వెలవెలబోతూ ఉంటే, శ్రీకృష్ణుడు, పాండవులు, ద్రౌపది, సాత్యకి అదే పనిగా ఆనందాతిశయంతో మమ్మల్ని చూచి నవ్వారు.
  ——————–
  యాగం తరువాత బంధువులు రాజులు అందరూ వీడ్కోలు తీసుకున్నట్లు 76వ పద్యం, శ్రీ కృష్ణుడు ద్వారకకు తిరుగు ప్రయాణమయాడని 84వ పద్యం చెబుతున్నాయి. మయసభ విశేషాలు చూడాలన్న కుతూహలంతో దుర్యోధనుడు, శకుని కొద్ది రోజులు ఇంద్రప్రస్ధంలేనే ఉండిపోయినట్లు 86 చెబుతోంది. తరువాత మయసభలో తిరుగుతున్నప్పుడు దుర్యోధనుడి భంగపాటు జరిగింది.
  =============
  కాబట్టి దుర్యోధనుడిని చూసి కృష్ణుడు నవ్వింది యాగ సమాప్తప్పుడే గాని మయసభలో కాదని తెలుస్తోంది.

  మెచ్చుకోండి

 7. Chandrika గారు,
  అందరూ నవ్వేరు,ఆవిడా నవ్వింది. నిజానికి దుర్యోధనుడు తండ్రితో చెప్పుకున్న దానిలో బాధ కలిగించినది భీముని నవ్వే అనిపిస్తుంది, దానికి ద్రౌపది నవ్వు తోడయిందంతే….. అందుకే కంటికి నిద్ర వచ్చునే…. అలా వాపోయాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు తండ్రి దగ్గర ఏకాంతంలో ఇలా వాపోయాడు, అప్పుడు చెప్పేది నిజమే….అబద్ధానికి తావులేదు, అందునా ధృతరాష్ట్రుని ఒక పనికి ఒప్పించడానికి చెబుతున్న సమయం అది…
  ధన్యవాదాలు.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 8. బావుందండి మీ బ్లాగు లో మహాభారతం మీద చర్చ 🙂 సినిమాలలో, సీరియల్ లో ద్రౌపది పక పకా నవ్వినట్లు చూసినట్లు . ఆశ్చర్యం అనిపించేది ద్రౌపది ఇలా ఎలా నవ్విందని . DG గారు, నేను కొత్తగా వింటున్నాను కృష్ణుడు నవ్వాడని . just out of curiosity: ఏ పుస్తకమండీ అది?

  మెచ్చుకోండి

 9. DGగారు,

  ధర్మరాజక్కడ లేడని కవిత్రయం మాటా, దుర్యోధనుని మాట కూడా కదండీ! దుర్యోధనుని మాట నమ్మచ్చు,నమ్మాలి కూడా! పొడి బట్టలు తెప్పించి దుర్యోధనునికి ఇప్పించే ఏర్పాటు చేసినవాడు. నకుల సహదేవులు ఇదె ద్వారమని వచ్చి దారి చూపినవారు, ఇక మిగిలినవారు భీముడు,అర్జునుడే కదండీ! వాళ్ళలో అర్జునుని నవ్వంటే దుర్యోధనుడికి పెద్ద లేక్కలేనిమాటే! ఇక మిగిలింది భీముడు, చిన్నప్పటినుంచీ ఇద్దరికి ఉప్పూ నిప్పేకదా! ఆ నవ్వే బాధ పెట్టింది దుర్యోధనుని. 🙂

  ఇక శ్రీకృష్ణుడు అక్కడ వున్నాడన్నమాట నాకు కొత్తే. అలా అవసరానికి, అంటే కృష్ణుని లీల చెప్పడానికి భట్టాత్తిరిగారు రాసి ఉండచ్చు, కాని కవిత్రయం మాట పైన చెప్పినదే.

  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 10. DG గారూ, దుర్యోధనుడు మయసభలో తిరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడక్కడే ఉన్నాడంటారా?! 🤔

  మెచ్చుకోండి

 11. శర్మ గారు
  ఇది పూర్తిగా నిజం కాదని నేను అనుకుంటున్నానండి. తమ్ముళ్ళూ ద్రౌపదీ నవ్వుతూంటే యుధిష్టిరుడు వద్దని తీవ్రంగా వారిస్తాడు. వాళ్ళు వెంఠనే నోర్లు కట్టేసుకుంటారు. అక్కడే ఉన్న జగన్నాధుడు మాత్రం కావాలని పంచె నోటికి అడ్డం పెట్టుకుని మరీ మరీ నవ్వుతాడు. అది చూసి ధర్మజుడు ఏమీ అనడు ఎందుకంటే అటువైపు ఉన్నవాడు జగన్నాధుడు. ఆయనని వద్దనే వారెవరు? ఆయన నవ్వడం చూసి మరోసారి పాండవులు (ధర్మరాజు మినహా) ద్రౌపది ఈ సారి ధైర్యంతో మళ్ళీ నవ్వుతారు. అలా కృష్ణుడే ఈ జగడానికంతటికీ కారణం. అలా నవ్వకపోతే మరోసారి పాచికలాడ్డం కుదరదు, యుద్ధం రాదు, జన క్షయం జరగదు ధర్మ రక్షణ కోసం తానెత్తిన అవతారం ఉపయోగం లేదు. అప్పుడు గురువుగారు దీనికోసం సంభవామి యుగే యుగే అన్నట్టూ మరో జన్మ ఎత్తాలి. అమ్మా, అంత త్వరగా పోనిస్తాడా ఎత్తిన జన్మ సార్ధకం కాకుండా? దానికోసమే ఆయన కావాలని పంచె నోటికి అడ్డం పెట్టుకుని మరీ మరీ నవ్వుతాడు. ఇటువంటిదే మరో సంఘఠన అర్జునుణ్ణి పద్మవ్యూహం నుంచి దూరంగా తీసుకెళ్ళడం. అలా తీసుకెళ్లకపోతే అభిమన్యుడు చావడు. వాడొక్కడి కొసం మరో జన్మ ఎత్తాలి. అబ్బో ఇలాంటివి భారతంలో అడుక్కొకటి ఉంది. చదివి అర్ధం చేసుకోవాలే గనీ ఇందులో అసలు యుద్ధానికి అన్నింటికీ ఆయనే కారణం. చివరకి జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడని ధర్మజుడి నోట్లోంచే ఆయన అబద్ధం చెప్పిస్తాడు. ఆయనకి చేతకానిదేముంది?

  అందుకే ఆయన నవ్వుని పోతన – అనేక మాయా విశేషాలతోనూ, భట్టాత్తిరిగారు నారాయణీయంలో ఆయన రూపాన్ని – త్వద్రూప మాశ్చర్యతో ప్యాశ్చర్యం – అంటూ పోల్చారు.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s