శర్మ కాలక్షేపంకబుర్లు-జీవితసమరం తొలిరోజులు-కాకినాడ ఉద్యోగం

జీవితసమరం తొలిరోజులు-కాకినాడ ఉద్యోగం

ట్రైనింగ్ పూర్తయింది, మేజరయ్యా, షావుకారు గారితో ”నోటు రాస్తా, పాత నోట్లు తిరగరాస్తా” అన్నా! ఆయన ”నోట్ రాయక్కరలేదు,మీ మాటమీద నమ్మకం” అన్నారు.

కోర్ట్ లో ఉన్న దావా అప్పటికి మూడు సంవత్సరాల కితమే రాజీ అయింది. అదికూడా తగవులో ఉన్న ఆస్థిని ఐదుభాగాలు చేసి నాలుగు భాగాలు నాకు ఒక భాగం ఎదుటివారు తీసుకునేలాగా! అంటే న్యాయం ఎటుందో తెలిసినట్టేగా! దావా కాలనికి ఆ ఆస్థి మీద రాబడి నేను మేజర్ అయిన తరవాత తీసుకునేలా కోర్ట్ లో కట్టడంతో, లాయర్ గారి దగ్గరకెళ్ళి పిటీషన్ వేస్తే సొమ్మొచ్చేటప్పటికి మూడు నెలలు పట్టింది. వచ్చిన సొమ్ములో లాయర్ గారి ఫీస్ ఇచ్చి మిగిలిన దానితో షావుకారుగారి బాకీ కొంత తీర్చి, కొంత ఊపిరి పీల్చుకున్నా.

అప్పటికి స్వతంత్రం వచ్చి పన్నెండేళ్ళు, భూపరిమితి చట్టం, దున్నేవాడిదే భూమి, నాటి మాటలు. వీటివల్ల పల్లెలలో అప్పటి వరకు ఉన్న ఆమాత్రం సఖ్యత, ప్రశాంతత కూడా చెడిపోయింది. పెద్దవారెప్పుడో సద్దేసుకున్నారు, ఇంట్లో కుక్కపిల్ల దగ్గరనుంచి, విడాకులుచ్చుకుని, ఇంట్లో ఉంచుకున్న విడిచిపెట్టిన పెళ్ళాంతో సహా, చాలా మంది పేర భూములు రాసి. ఇక దున్నేవాడిదే భూమి, అప్పటిదాకా కాస్త గౌరవంగా బతికిన రైతు, కూలీగా మారిపోయాడంతే! మార్పు మాత్రం రాలా! ఏ పని చేయాలన్నా లైసెన్స్, ప్రతిదానికి పర్మిట్. ఇటువంటి పరిస్థితులలో, అవినీతి,బంధు ప్రీతి చీకటి బజారు విశృంఖలంగా తాండవిస్తున్న రోజులు. ఎక్కడ చూచినా నిరుద్యోగమే! ఎంతమందిని కలిసినా ఉపయోగం లేదు, కొంతమంది దర్శనం కూడా ఇవ్వలేదు, మాటాడ్డానికి కూడా. ప్రెసిడెంట్ గారు ప్రయత్నం మానలేదు.

ట్రయినింగ్ పూర్తి కాగానే రూరల్ బేంక్ లో అప్రెంటిస్ గా చేరాను. అక్కడ పని చేయడం మొదలెట్టి దగ్గరగా ఆరు నెలలైంది,ఉద్యోగం వచ్చే సూచన కనపడ లేదు.

ఒక రోజు సాయంత్రం ఊరినుంచి వచ్చిన ప్రెసిడెంట్ గారు బేంకి వచ్చి నాతో, మర్నాడు కాకినాడ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీకి వెళ్ళమని ఉత్తరమిచ్చి, అప్పుడు చెప్పేరు, నాకు ఆ సంస్థలో ఉద్యోగమిస్తారని. ఆనందం కలిగి వారికి నమస్కారం చేసి,అక్కకి చెప్పి, ఇంటికొచ్చాను.అమ్మకి చెబితే ఆనందించింది,ప్రయోజకుడినయ్యానని.

మర్నాడు కాకినాడ వెళ్ళి మేనేజర్ గారిని కలిశా,వారు అక్కౌంటెంట్ గారిని కలవమంటే బయటికొచ్చి వారి కోసం అడిగితే ఒక తాతగారిని చూపించారు. వారి దగ్గరకెళ్ళి ”తాతగారు, నమస్కారం” అన్నా! ఆయనని అంతా ”తాతగార”నే పిలుస్తారట నాకది తెలియదు, ఆయన కళ్ళజోడులోంచి చూసి ”ఏమన్నట్టు” కళ్ళెగరేస్తే,వివరం చెప్పుకున్నా. ఈ లోగా ప్యూన్ ఫైల్ తెచ్చాడు,చూసి, డ్రాఫ్ట్ రాసి ”టైప్ చేయగలవా?” అడిగారు. ”అవు”నన్నట్టు తలూపా. ఫైల్ చేతికిచ్చి ”కొట్టుకురా” అన్నారు. చూస్తే అది నా అపాయింట్ మెంట్ ఆర్డరు, అలా నా తొలి నియామక పత్రం నేనే టైప్ చేసుకున్నా 🙂 అందంగా టైప్ చేసి పట్టుకెళ్ళా. కళ్ళజోడులోంచి చూసి బాగుందని ప్రశంసించారు, కళ్ళతోనే. ఫైల్ సంతకానికెళ్ళింది. ఈ లోగా ఎక్కడుంటున్నదీ అడిగితే ”ఏమీ తెలియద”ని ఉన్న మాట చెప్పేను. ఈ లోగా ఆర్డర్ సంతకమై వచ్చింది, అది చేతికిస్తూ ”ఈ ఆర్డర్ పుచ్చుకుని లోపలికెళ్ళు, మేనేజర్ గారికి ధన్యవాదాలు చెప్పు, గది దొరికేదాకా ఆఫీస్ లో ఉంటానని చెప్పుకో” అని ఉపదేశం చేశారు. ఈ సారి నిజంగానే ఆయనకు నమస్కారం చేసి లోపలికెళ్ళి పని చక్కబెట్టుకొచ్చి తాతగారికి చెబితే, ”బతికేస్తావ్! బాధలేదు, విజయోస్తు” అని దీవించారు. ఆ దీవెన ఈ రోజుకీ ఫలిస్తూనే ఉంది.

అది మొదలుగా ఆయన చెప్పిన ప్రతిపని శ్రద్ధగా చేస్తూ మెప్పుపొందుతూ వచ్చా. ఆఫీస్ లో మిగిలిన వారి సీట్ లలో పని కూడా అందుకుంటూ రావడంతో అందరికి చేరువయ్యా! మరీ చేరువైనది కేషియర్ తో. ఆ రోజుల్లో బేంక్ కి, కేషియర్ కి తోడు వెళ్ళినందుకు రెండు రూపాయలు బేటా ఇచ్చేవారు, కేషియర్ కి రఫ్ కేష్ బుక్ రాసిపెట్టేవాడిని, దానితో అతను నన్ను తోడు తీసుకుపోయేవాడు, బేటా నాకిచ్చేవాడు, ఇది గొడవకి కారణమైంది, మిగిలినవారితో. విషయం మేనేజర్ గారి దగ్గరకెళితే, తాతగారు ఉన్న సంగతి చెప్పేసేరు. ఇతను అందరికి సాయం చేస్తున్నాడు, కేషియర్ కి పనెక్కువ, అతనికి సాయం చేస్తున్నాడు, అంతే తప్పించి మరో సంగతేం లేదనడంతో, ”ఇక ముందు శర్మనే బేంక్ కి తీసుకుని వెళ్ళ”మని చెప్పి ,బేటా మూడు రూపాయలకి పెంచేరు. ఈ సంపాదన వారానికి పదిహేను రూపాయలు, జీతం నూట ఇరవై రూపాయలు. పులగం మీద పప్పే, సంపాదన, ఆరోజుల్లో. పై సంపాదన సినిమాలకి సిగరెట్ల కి సరిపోయేది.

ఆఫీస్ అంటే ఒక పాత బిల్డింగ్ పిఠాపురం రాజావారి విడిది మేడ. పడమర వైపు రోడ్ దాటితే ఎదురుగా మెక్లారిన్ హైస్కూలు, ఉత్తరంగా రోడ్ మీదకెళ్ళి తూర్పుగా నాలుగడుగుల్లో మైన్ రోడ్డు, ఎడం పక్క ఉడిపి హొటల్,దానికెదురుగా టవున్ హాల్, మైన్ రోడ్ దాటి తిన్నగా ముందుకెళితే ఎడమ పక్క ఇండియన్ కాఫీ హవుస్,కుడిపక్క కాంగ్రెస్ ఆఫీస్, ముందుకెళితే సినిమాహాల్ రోడ్డు. సాయంత్రం ఆరు నుంచి రాత్రి పదివరకు ఆ రోడ్డే శరణ్యం. మధ్యలో ఒకడుగు మైన్ రోడ్డులోకేసి దింటకుర్తి గురునాథం హొటల్ లోభోజనం చేసి మళ్ళీ సినిమాహాల్ రోడ్ కి పోతే, కల్పనా లో రాజకపూర్ వీక్, కిషోర్ కుమార్ వీక్,అశోక్ కుమార్ వీక్ రోజుకో హిందీ సినిమా. అదే మొదలు హిందీ సినిమాలు చూడ్డం,అర్ధం కాకపోయినా 🙂 సినిమా కుర్చీ టిక్కట్టు రూపాయిన్నర,రెండుపూటలా భోజనానికి పెరుగుతో అరవైరూపాయలు.

ఒకరోజు సినిమా వీధిలో తిరుగుతుండగా వెనకనుంచెవరో ”మావా!” అని పిలిస్తే తిరిగిచూశా! మా సోవన్న కనపడ్డాడు, మా సోవన్న మీకు తెలీదు కదూ! మండపేటలో టైపు సహాధ్యాయి, ’నువ్వేంటీ’ అంటే ’నువ్వేంటీ’, వివరాలు చెప్పుకుంటే దిగులుగా నిట్టుర్చాడు మా సోవన్న. ”బతుకు బాగోలేదురా మావా! డిగ్రీదాకా డింకీలు కొడుతూ, ఊళ్ళో పైలా పచ్చీసుగా తిరిగేశాను, డిగ్రీ కాలేదు, పాతికేళ్ళొచ్చేసేయి, గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరావన్నారు, ఇదిగో ఇక్కడ ఖాదీభాండార్ లో సేల్స్ మన్ గా చేరేను, నెలకి డెభ్భై ఐదు రూపాయలు జీతం”,బాధలు చెప్పుకొచ్చేడు…. ఒక్క నిమిషం నేనే మేలేమో అనిపించేసింది…’రూమెక్కడ?’ ”దొరకలేదు, ఎక్కడికెళ్ళినా లాకేత్వం దకి కొమ్మే! ఖాదీ భాండార్ లో పడుకుంటున్నా, మేనేజరు మంచాడు,ఒప్పుకున్నాడు”, పడుకోడానికి బాధ చెప్పేడు, సోవన్న, నేనూ అదే స్థితిలో ఉన్నానన్నా! ఇద్దరం రూం కోసం తిరగాలనుకున్నాం. మర్నాడు ఉదయమే మా సోవన్నొచ్చేసేడు, ఆఫీస్ కి ”ఏరా?” అంటే రెండు వేళ్ళు చూపించి ”ఎక్కడా?” అని, నేను దారి చూపితే పని కానిచ్చుకుని వచ్చి,ఏడుపుమొహంతో చెప్పుకొచ్చాడు, ”బతుకు అడుక్కునేవాడికంటే కనాకష్టమైపోయింది మావా! ఉదయమే దీనికోసం ఎక్కడికో పోవాల్సివస్తోంది, ఆ తరవాత స్నానానికి పబ్లిక్ కుళాయే గతి,ఏమనుకోకు ఇక్కడ సౌకర్యం ఉందని వచ్చే”నని భూతద్దాల కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకున్నాడు. నిజంగా నాకు కడుపులో దేవినట్టే ఐపోయింది. ”ఛ! వెధవ జీవితం కనీసావసరాలు కూడా తీర్చుకోలేని నికృష్టపు బతుకులయ్యాయే” అని ఏడ్చా! ”వస్తానుండని” స్నానం చేసి తెచ్చుకున్న బట్టలేసుకుని ఉడిపి కెళ్ళి టిఫిన్ చేసి నాకు వేడి వేడిగా ఇడ్లీ, అల్లం జీలకఱ్ఱా పెసరట్టూ తెచ్చిపెట్టి ”తిను మావా” అంటూ కూచున్నాడు. నాటిరోజుల్లో వాటి ఖరీదు ఏభై పైసలు, అదే గొప్ప. ఇలా నాకు అల్లం జీలకఱ్ఱ పెసరట్టు అలవాటు చేశాడు, ఇలా చాలానే అలవాట్లు చేశాడు 🙂

మొదటివారం చివర ఇంటికొచ్చి, ప్రెసిడెంట్ గారికి కనపడి వివరాలు చెప్పి ఆయన ఆశీర్వాదం తీసుకుని, అమ్మ ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేను. రోజులు నడుస్తున్నాయి, ఇంటికి రావడం, ప్రెసిడెంట్ గారిని కలవడం, అక్కని కలవడం, అమ్మకి కావలసినవి సమాకూర్చి మళ్ళీ వెళ్ళడం జరుగుతూ ఉంది… రోజులు నడుస్తున్నాయి…..

చిన్నమాట: కర్ణుడు,జీవిత సమరం రెండిటిని రాస్తూ వచ్చా,పక్కపక్కనే. కర్ణుడు ఎక్కువ సమయం తీసుకోవడం, ఖాళీ ఇస్తే ధార చెడిపోవడం, మళ్ళీ స్థాయీభావం ఏర్పడానికి సమయం తీసుకోవడం జరిగి, దీన్ని వెనకబెట్టా, మనవరాలు శిరీష ఏమీ అనుకోదనే ధైర్యంతోనే! కర్ణుడు పూర్తైనా కొంత విరామం తప్పలేదు, మన్నించ కోరుతాను. కాకపోయినా ఇటువంటి జీవిత కథల్లో ఏముంటుంది? ఆ కాలేజీలో చదివేను,ఈ యూనివర్సిటీలో చేరేను, అక్కడ పిజి చేసేను,ఈ ఫారిన్ యూనివర్సిటీ లో డాక్టరేట్ చేసేను అని చెప్పుకోడానికేం లేదు, అక్కడ బ్రేకెట్ కంపెనీలో పని చేసేను,ఇక్కడ సినిమాహాల్లో టిక్కట్లు చింపేను, ఆ ఊళ్ళో గది అద్దె కోసమెళితే కుక్కని తరిమినట్టు తరిమారు ఇవేకదా? 😦 చాలామంది ‘రేఖ వేసుకు పుట్టనివాళ్ళే’ 😦 ” Not born with a silver spoon in mouth”

టపా పెద్దదైపోయింది, మరోటపాతో దీన్ని ముగిస్తున్నా!

17 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-జీవితసమరం తొలిరోజులు-కాకినాడ ఉద్యోగం

 1. డీజీ గారూ,
  తల తాకట్టు పెట్టి ఉద్యోగం చేసేచోట అస్తమాను లేఖిని వాడుతూంటే చివాట్లు పడతాయన్నది నిజం. సాధారణంగా నేను ఆఫీసులో ఉన్నప్పుడు తెలుగుబ్లాగులజోలికి పోను. ఒక సారి మిత్రులు ఒకరు పెద్దవారు, తెలుగులో జాబు వ్రాసారు. వారికి వెంటనే సమాధానం పంపవలసి ఉంది. అందుకని ఒక మూడు నాలుగు నిముషాలు తెలుగులో సమాధానం వ్రాసి పంపాను. అఫీసు సమయంలో నిరంతరాయంగా తెలుగులో వ్రాసుకుంటున్నానన్న నింద వచ్చింది. తమాషా ఏమిటంటే ఆఫీసు సమయంలో షేర్లధరలు చూసే వారూ, మొబైల్ తీసి గేములు ఆడుకొనే వారూ, తరచూ ఫోన్ సంభాషణల్లో ఉండేవారూ, నెట్టింట్లో పచారీలు చేసేవారూ అందరూ ఏ నిందలూ చెందకుండా నిక్షేపంగా ఉన్నారు. వయోధికుణ్ణైన నేను పని చేసుకోవటం కొందరికి నచ్చక ఇబ్బందిగా ఉండటం కారణమేమో మరి.

  మెచ్చుకోండి

 2. డీజీ గారు, చప్పున స్పందించి తెలుగులో వ్రాసారు. చాలా సంతోషం, వెంటనే ఆచరించినందుకు మీకు కృతజ్ఞతలు. మీ రచనల పరిచయం నాకింకా అవలేదు. చదివే ప్రయత్నం చేస్తాను.

  మెచ్చుకోండి

 3. అన్యగామి గారు,
  అదేమో చెప్పలేనుగానండి, కష్టానికి ఎదురొడ్డేనే తప్పించి పారిపోలేదు 🙂 ఓపిక ఉన్నవరకు రాయడం మానలేను 🙂
  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 4. DG గారు,
  అర్ధాంతరంగా ఆపెయ్యటం లేదండి 🙂 విశేషాలేం ఉండవు కదా అన్నదే మాట గాని, జరిగినవి చెప్పుకోడానికి సిగ్గూ పడలేదు,భయమూ పడలేదు.
  పడిపోయిన ప్రతిసారి లేచి పరుగే పెట్టేను, అదే అలవాటు కూడా 🙂
  ప్రతిది జీవితంలో సాధించుకున్నదే. ఇల్లాలితో సహా ప్రేమించి,ప్రేమింపబడి పెళ్ళి చేసుకుని దగ్గరగా ఆరు పదులు కలిసి జీవితం, సాధించుకున్నదే!
  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 5. మిత్రులు రాజారావు గారు,
  సీతాఫలం కొద్ది ఎక్కువగా తింటే జలుబు చేస్తుందంతే.
  రామా ఫలం మీకంతగా దొరికిందంటే అదృష్టమే. రామాఫలం లక్ష్మణ ఫలం కేన్సర్ మందులుగా వాడుతున్నారు,నిరోధకంగా కూడా. లక్ష్మణఫలాన్నే కొన్ని చోట్ల హనుమఫలం అని కూడా అంటున్నారు. తొందరలో ఫోటో పెట్టడానికి ప్రయత్నిస్తా. లక్ష్మణ ఫలం శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా దొరుకుతుందట. ఇది పుల్లపుల్లగా,తియ్య తియ్యగా ఉంటుందట,నేనూ తినలేదు.
  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 6. లలితమ్మాయ్,
  విశేషాలేం లేని చప్పటి కథేమో అనిపించి కాని చెప్పుకోడానికి సిగ్గు పడలేదమ్మా!

  పులగం అంటే అత్తెసరుకి బియ్యం కడిగి నీళ్ళు పోసి అందులో కడిగిన పొట్టు పెసరపప్పుపోసి వండుతారు. దీన్నే పులగం అంటారు. దీనిలో బెల్లం నెయ్యి వేసుకుని తింటారు. పప్పు వేసి వండిన పులగం కమ్మహా ఉంటుంది, దానిలో మళ్ళీ పప్పు వేసుకు తింటే మరికాస్త కమ్మహా ఉంటుంది. అదే పులగం మీద పప్పు ఏకోత్తర వృద్ధి లేదా geometric progression 🙂
  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 7. తల తాకట్టు పెట్టి ఉద్యోగం చేసేచోట అస్తమాను లేఖిని వాడుతూంటే చివాట్లు పడతాయండి. అందుకని అలా తొందరగా ఇంగ్లీషులో టైప్ చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. అంతేకానీ కౌముదిలోనూ, ఈమాటలోనూ, సుజనరంజనిలోనూ ఇంకా అనేకానేక చోట్ల కధలు రాసే నాకు తెలియదా? నేను ఏమీ అనుకోను మీరు ఇలా అన్నారని. కాస్త దళసరి చర్మం ఉన్నవాణ్ణే 🙂

  మెచ్చుకోండి

 8. గురువుగారు, నాది మిగిలిన వ్యాఖ్యతల బాటే. ఐశ్వర్యంలో పుట్టిన పెద్దలు కూడా వాటిని త్యజించి, సామాన్యుడిలా బ్రతికి , గొప్ప రచనలు చేశారు. అందుకే అవన్నీ చిరస్థాయిగా నిలిచాయి. మీది ఆ కోవకే చెందుతుంది. దయచేసి మీ మనస్సుకు నచ్చినవి వ్రాయటం మానకండి.

  మెచ్చుకోండి

 9. డీజీ గారు, మీరు కొంత నాలాగా ఆలోచిస్తున్నారని స్వతంత్రించి ఈ సలహా ఇస్తున్నాను. నాలాంటి బద్దకస్తులకి టైపు చెయ్యటం రాక ఇంగ్లీషులో అయినా కీబోర్డ్ చూసి కానీ చేయలేము. పైగా తెలుగులో చెయ్యటం ఇంకా శ్రమతో కూడుకున్నది. అయినా శ్రమకోర్చి తెలుగులో వ్రాస్తే తెలుగు బ్లాగులకి సహాయం చేసినవారం అవుతాము. దయచేసి దీని గురించి ఆలోచించండి.

  మెచ్చుకోండి

 10. I think your story is much better than saying “I woke up, used my dad’s money to enter IIT, then migrated to USA and got my Ph.D, invented something and became millionaire and lost all in another project… blah blah” There was no story in such guys’ story of being born with silver spoon in mouth. Actual stories come from guys who can stand to the test of time – like yours. The story of Dhirubhai Ambani is a hit but his son’s story is nothing much to hear since the sons are born with everything already arranged for them.

  Keep writing. There is no real reason to abruptly close it. There is a moral to learn from your story but not from Ambani sons’ stories. If you read story of Hotmail inventor. He sold it to Microsoft and nobody even knows what he is doing now. It is all flash in the pan.

  మెచ్చుకోండి

 11. ‘ సీతా ఫలము ‘ నొక బుధుడు
  ‘ శీతఫల ‘ మది యనంగ జెప్పెను , నిజమా ?
  చేతో ముదముగ తింటిని
  భాతిగ మ్రగ్గంగ ‘ రామ ‘ ఫలములు చాలా .

  అన్న ! ‘ లక్ష్మణ ‘ ఫలమొక టున్నదన్న
  సంగతే నాకు తెలవదు శర్మగారు !
  వీలు వెంబడి ఫోటో లభించు నేని
  పరగ ప్రకటించ గోరెద బ్లాగు లోన .

  మెచ్చుకోండి

 12. మీ జీవిత కథ అద్భుతంగా వుంది – అది చెప్పిన తీరు కూడా. కానీ ఆ ఆఖరి పేరానే బాలేదు – మీ కబుర్లు మెచ్చుకునే నాలాంటి ఎందరో వున్నప్పుడు మీరింకా మీదేమీ అంత గొప్ప కథ కాదనుకోవడం – ఒకరకంగా మా మాటని కాదనడమే 😦
  ఇంతకీ “పులగం మీద పప్పు” అంటే ఏంటండి – వీలైతే చెప్పండి ప్లీజ్!

  మెచ్చుకోండి

 13. అతుకుల గతుకుల మార్గము
  బతుకును నేర్చె మన యొజ్జ పారుండతడౌ !
  వెతలను జీవన సమరపు
  కతలను వింజో విగాను కవగూర్చెనిటన్ !

  జిలేబి

  మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.