శర్మ కాలక్షేపంకబుర్లు-మహాభారత యుద్ధానికి దూరంగా ఉన్నవాళ్ళెవరు?

మహాభారత యుద్ధానికి దూరంగా ఉన్నవాళ్ళెవరు?

మహాభారత యుద్ధంలో ప్రపంచం లో, నాటికి ఉన్న రాజులంతా పాల్గొన్నారు. జనాభాలో స్త్రీలు పిల్లలు తప్పించి యువకులు ఎవరూ మిగలలేదు. కాని ఆ యుద్ధానికి దూరంగా ఉండిపోయినవాళ్ళిద్దరున్నారు. ఒకరు రుక్మి, రెండవవారు బలరాముడు.

బలరాముడు శ్రీకృష్ణుని అన్నగారు. ఆయనకి యుద్ధం అంటే భయమేం లేదుగాని, అన్నదమ్ములు ఇలా తలపడటం ఇష్టం లేకపోయింది. ఆయన యుద్ధానికి ముందుగా ధర్మరాజు దగ్గరకొచ్చి, ఈ అన్నదమ్ముల కలహం తనకు నచ్చలేదని, తమ్ముడైన కృష్ణునికి ఈ కలహాన్ని మాన్చమని చెప్పినా వినలేదని చెప్పి, తానకి ఇరువైపులవారూ సమానమేనని చెప్పి, ఈ యుద్ధానికి దూరంగా తీర్థయాత్రలు చేస్తున్నట్లు చెప్పి వెళిపోయారు.

రుక్మి గుర్తొచ్చాడా? రుక్మిణీ దేవి అన్న, శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిని తీసుకుపోతుంటే వెనక తరిమి యుద్ధం చేసి, యుద్ధంలో చాల లేకపోతే, రథ చక్రానికి కట్టేసి, కత్తి దూసి, తల తరగడానికి బదులు, ప్రేయసి కోరికపై బావగారి మీసము,తల సగం సగం గొరిగి వదలిపెట్టబడినవాడు, శ్రీకృష్ణునిచే. యుద్ధానికి ముందు తన బలగంతో ధర్మరాజు దగ్గరకొచ్చి యుద్ధం అంటే భయమైతే చెప్పు కొరవులని ఓడించేస్తానని అంటే అర్జునుడు ఆ భయమేలేదు, మీరు మరెవరికైనా సాయం చేయచ్చని చెప్పి పంపేశాడు. రుక్మి దుర్యోధనుని దగ్గరకెళ్ళి నీకు సాయం చేస్తానంటే నమస్కారం పెట్టి వద్దని చెప్పి పంపేశాడు.

అలా మహాభరత యుద్ధానికి దూరంగా ఉన్న బలరాముడు, రుక్మి ఇద్దరూ కూడా శ్రీ కృష్ణునికి కావలసినవారే కావడం చిత్రం…ఇందులోనూ చిన్న తేడా ఉంది గమనించారా? బలరాముడు రెండు పక్షాలవారినీ కాదన్నారు, రుక్మిని రెండు పక్షాలవారూ తిరస్కరించారు అదీ తిరకాసు. ఇలా యుద్ధానికి సహాయం చేస్తానంటే వద్దని వెనక్కి పంపబడినవాడు చరిత్రలో రుక్మి ఒక్కడే!  పదిమందితో చావు కూడా పెళ్ళిలాటిదే అని నానుడి, ఇలా అందరిచేత విసర్జింపబడటం……

15 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మహాభారత యుద్ధానికి దూరంగా ఉన్నవాళ్ళెవరు?

 1. అంతేనండి శర్మ గారు. విదర్భ సైన్యం పాల్గొనలేదు. రుక్మి సహాయానికీ (ఆఫర్), కృష్ణసహాయానికీ వ్యత్యాసం గురించి బాగా చెప్పారు.

  మెచ్చుకోండి

 2. విన్నకోట నరసింహారావు గారు,
  విదర్భ సైన్యం యుద్ధంలో పాల్గొన్నట్టులేదు.

  కృష్ణుని యుద్ధానికి సాయం చేయమని ఇద్దరూ అడిగారు. ఆయన నాకు మీరిద్దరూ కావలసినవారే కనక సైన్య విభాగం చేస్తున్నా అని తానొకవైపు, పదివేల నారాయణ గ్తోపాలకులొకవైపు అన్నారు. తాను ఆయుధమున్ ధరింప అని కూడా చెప్పేసేరు. అర్జునుడు తలపులు లెక్కపెట్టుకున్నాడు, దుర్యోధనుడు తలలు లెక్కపెట్టుకున్నాడు 🙂 అందుచేత సైన్యం మరో వైపు జేరింది. ఇక్కడ ఇద్దరూ సాయం కావాలన్నారు.

  రుక్మి విషయం లో

  రాజునే తమవైపు పోరాడటానికి ఇష్టపడలేదిద్దరూ, సైన్యాన్ని తీసుకుని ఉండే సావకాశం లేదు. ఒక వేళ సైన్యాన్ని మాత్రమే తీసుకుని ఉంటే రుక్మికి అంతకంటే పెద్ద అవమానం మరొకటి ఉండదు. ఇక్కడ ఇద్దరూ సాయం వద్దన్నారు, అదే చిత్రం.
  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 3. < " రాజు యుద్ధంలో పాల్గొనక సైన్యం స్వతంత్రం గా పాల్గొనలేదేమో" అని శర్మగారన్నది సాధారణంగా జరిగేదే. అయితే రాజు ఆదేశిస్తే సైన్యం వెళ్లి పాల్గొంటుందేమో కదా? అలా జరిగిన విశేషం కూడా మహాభారతంలోనే వుందిగా. దుర్యోధనుడు, అర్జునుడు కృష్ణుడి సహాయం అర్ధించినప్పుడు పదివేలమంది గోపవీరులా, యుద్ధం చేయని తనా ఎవరు కావాలో కోరుకోమన్నాడు కృష్ణుడు. ఎవరేం కోరుకున్నారో తెలిసినదే. కృష్ణుడిని అర్జునుడు కోరుకోగా, పదివేలమంది గోపవీరులని దుర్యోధనుడు ఆనందంగా తీసుకున్నాడు. కాబట్టి ఆ గోపవీరులు తమ నాయకుడైన కృష్ణుడు పాల్గొనకుండా తాము యుద్ధంలో పాల్గొన్నట్లే అయిందిగా. ఇక్కడ నాయకుడైన కృష్ణుడి ఆదేశానుసారమే గోపసైన్యం నడుచుకుంది, వెళ్లి యుద్ధంలో పాల్గొంది, ఏమంటారు?

  మెచ్చుకోండి

 4. శివరామ్ ప్రసాద్ గారు,
  తటస్థత అంటే ఎవరితోనూ చేరకపోవడం, తమ స్వంత నిర్ణయంతో. ఇక్కడ రుక్మిని ఇద్దరూ తమ వైపు యుద్ధానికి ఒప్పుకోలేదు, అందుకు యుద్ధానికి దూరంగా ఉంచబడ్డాడు. తటస్థ దేశమేదీ లేదు. విదర్భరాజు రుక్మి యుద్ధంలో పాల్గొనకుండా రెండు శక్తులూ అడ్డుకున్నాయి, విదర్భ సైనికులు కూడా యుద్ధంలో పాల్గొన్నట్టు నాకెక్కడా కనపడలేదు. రాజు యుద్ధంలో పాల్గొనక సైన్యం స్వతంత్రం గా పాల్గొనలేదేమో
  ధన్యవాదాలు.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 5. విన్నకోటవారు,లలితమ్మాయ్!
  భీముడు,దుర్యోధనుడు బలరాముని శిష్యులు,గదా యుద్ధంలో. దుర్యోధనుని గదా చాలనంలో నిపుణత్వం,భీముని గదా చాలనంలో భుజబలం ప్రధానమైనవి. బలరామునికి ఇద్దరిలోనూ దుర్యోధనునిపై కించిత్ మమకారం ఎక్కువ ఉంది. శ్రీకృష్ణుని కాదని దుర్యోధనునికి సహాయం చేయడం ఇష్టం లేక తీర్థయాత్రలకెళ్ళేరనిపిస్తుంది.

  ఇక రుక్మి దగ్గరకొస్తే, రుక్మిణి వివాహం ఐపోయిన తరవాత కూడా శ్రీకృష్ణునితో వైరమే కొనసాగించాడు, రుక్మి. అసలు మాట శ్రీకృష్ణునికాదని చెప్పి, ఆయనకు ఇష్టం లేని పని పాండవులు ఎప్పుడూ చేయలేదు. రుక్మి వచ్చి సహాయం చేస్తానని చెప్పిన సభలో శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు.

  కృష్ణునితో యుద్ధంలో ఓడిపోయి, మీసం,తల సగంసగం గొరిగించుకున్నవాడు, కౌరవులను ఒంటి చేత్తో జయించేస్తానని చెప్పడం నవ్వు తెప్పించే మాట కదా! రుక్మి వచ్చిన సందర్భంలో శ్రీకృష్ణుడేం మాటాడలేదు, ధర్మరాజూ మాటాడలేదు, నీ సాయం వద్దని, అర్జునుడే చెప్పి పంపేసేడు.

  రుక్మి మాటలు పాండవుల దగ్గర గర్వాన్నే సూచిస్తున్నాయి,చేతకాకపోయినా!రుక్మి మాటిది”యుద్ధమంటే భయమైతే చెప్పు” అని మొదలెట్టేడు, పాండవులదగ్గర…ఎంతందంగా ఉందామాట..కవిత్రయం మాట పాండవులదగ్గర మాటాడినట్టే దుర్యోధనుని దగ్గరా మాటాడేడని ఒక్క ముక్కలో తేల్చేశారు. అంటే ఇంత గర్వంగానూ మాటాడేడనమాట. విన్నకోట వారొక్క మాటలో అన్నట్టు, అసలే మానధనుడు మన సుయోధనుడు, స్వయంగా గర్విష్ఠి, ఒక ఒరలో రెండు కత్తులా ?
  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 6. విన్నకోటవారు,
  దుర్యోధనుని దగ్గరకుపోయి పాండవుల దగ్గర మాటాడినట్టే మాట్టాడేడని ఒక్క ముక్కలో చెప్పేసేరు కవిత్రయం.
  శల్యుడి టపా రానుందండి 🙂
  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 7. లలితమ్మాయ్
  వివరంగానే చెబుతున్నా ముందు వ్యాఖ్యలో, భారతం,రామాయణం,భాగవతం మనంత మనం చదువుకుని ఒక భావాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చదవాలనుకుంటే భారతం ఈ బ్లాగ్ లోనే ఉంది టి.టి.డి వారిది, డవున్ లోడ్ చేసుకోవచ్చు, చదవనూ వచ్చు.
  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 8. శర్మగారూ తటస్థంగా ఉన్న దేశం ఏమైనా ఉందా? ఎక్కడో చదివిన గుర్తు, విదర్భ దేశం తటస్థం గా ఉండిపోయిందని? సందేహ నివృతి చేయగలరు!

  మెచ్చుకోండి

 9. “మా సరివాడివా మా పాపన్ గొనిపోవ” అంటూ కృష్ణుడి రథం వెనకబడి పరాభవం చెందినవాడు రుక్మి. కురుక్షేత్రానికి ముందు పాండవుల దగ్గరకు వెళ్లి గొప్పలు చెప్పకుంటే వాళ్లు నీ సహాయం అక్కరలేదన్నారు. కౌరవుల దగ్గర కూడా అలాగే బడాయి పోయినట్లున్నాడు.

  నాకాశ్చర్యం కలిగించేదేమిటంటే దుర్యోధనుడు రుక్మి సహాయాన్ని కాదనడం. పాండవుల (నకులసహదేవుల) మేనమామయిన శల్యుడినే మాయజేసి తనవైపు తిప్పుకున్నవాడు అయాచితంగా వస్తున్న రుక్మి సహాయాన్ని వదులుకోవడం వింతగా ఉంది. సుయోధనుడు “మానధనుడు” అంటారా? అంతేనేమో!?

  మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.