శర్మ కాలక్షేపంకబుర్లు-దుర్యోధనుని అంతరంగం

దుర్యోధనుని అంతరంగం

కౌరవులు రాజధానీ నగరంలో పుట్టిన రాకుమారులు,కష్టం తెలియనివారు, గౌరవ మర్యాదలు పుట్టినప్పటినుంచి అనుభవించినవారు, సేవలందుకున్నవారు. దీనికి వ్యతిరేకంగా పాండవులు అడవులలో,కొండలలో పుట్టి,పెరిగినవారు, సేవించడం తెలిసినవారు, గౌరవ మర్యాదలు, ఇచ్చి పుచ్చుకునే అలవాటున్నవారు. కౌరవులు బలవంతులేగాని పాండవులతో పోలిస్తే, లొక్కే. ఇవి మౌలికమైన తేడాలు.

పాండురాజు మరణం తరవాత, మునులు కుంతిని పాండవులను తీసుకువచ్చి సభలో ధృతరాష్ట్రునునికి అప్పగించి వెళ్ళారు. ఇది మొదలుగా పాండవులు కూడా రాజపుత్రులుగా, కౌరవులు పొందుతున్న గౌరవ మర్యాదలు, అభిమానాలు పొందడం జరుగుతూ వచ్చింది. పాండవులు కౌరవులకంటే కొద్ది హెచ్చుగానే గౌరవ మర్యాదలు పొందుతూ వచ్చారేమో కూడా, అది వారి నడవడి,బలం,తండ్రిలేని పిల్లలనే ఆదరణతోనూ. వీటికి మిక్కిలిగా ధర్మరాజు కాబోయే యువరాజు, మహరాజన్నదీ కూడా తక్కువ మాట కాదు.

ఇదిగో ఈ కారణాలు కౌరవులలో ముఖ్యంగా దుర్యోధనునిలో అసూయను పెంచాయి, చిన్ననాట. ఈ అసూయ ఏ స్థాయికి పెరిగిందంటే జలక్రీడలలో అలసిన భీముని తాళ్ళతో కట్టించి,గంగలో తోయించడం, నిద్రిస్తున్నవాడిని విషనాగులతో కరిపించడం, విషాన్నం పెడితే, దానిలో విషం ఉందని యుయుత్సుడు చెప్పినా తిని హరీ మనక హరించుకున్న వరకు. భీముని చూస్తే,అసూయ,భయం పెరిగిపోయాయి, దుర్యోధనునిలో. ఈ విషయాలు కుంతి దాకానే తప్పించి పెద్దల దృష్టికి రాకపోయీ ఉండచ్చు, కారణాలనేకం.

ఇలా ఉండగా ధర్మరాజు యువరాజయ్యాడు అంటే రాజ్య నిత్య వ్యవహారాలన్నీ ధర్మరాజు నిర్వహిస్తున్నాడు, ఇది దుర్యోధనుని కోపాన్నీ, అసూయనూ పెంచాయి, దాని ఫలితమే లక్క ఇల్లు.

దుర్యోధనునిలో రెండు భావాలు మొదలయ్యాయి, నా తండ్రి రాజు,ఆయన పెద్ద కొడుకునైన నేను యువరాజు కావాలిగాని, ఎక్కడో పుట్టి పెరిగినవాడు యువరాజు,రాజు ఎలా అవుతాడు? పోనీ అనుకున్నా ఇతను నా పిన తండ్రికి పుట్టినవాడా? కాదే? మరి ఇతనికి యువరాజ్యం, రాజ్యం ఎలా సమకూరుతాయనేదే ఆ మాట. ఒకప్పుడు ఈ భావాన్ని దుర్యోధ్యనుడు తండ్రి దగ్గర కూడా వెలిబుచ్చాడు. ”తండ్రీ తమ్ముడి కొడుకులు,తమ్ముడు కొడుకులు అని గింజుకుంటున్నావే, కుంతికి యమునివలన ధర్మరాజు,వాయువు వలన భీముడు, ఇంద్రునివలన అర్జునుడు, మాద్రికి అశ్వనీ దేవతలవల్ల నకుల,సహదేవులూ జన్మించారు కదా! వీరిలో యముడా,వాయువా….ఎవరయ్యా నీ తమ్ముడూ” అని నిలదీశాడు కూడా.

https://kastephale.wordpress.com/2013/12/07/

నాటి కాలానికి ధర్మ సంతానంగా పన్నెండు రకాల పుత్రులను సమాజం ఒప్పుకుంది, దీనిని దిర్యోధనుడు నిరసించాడు.

చివరిమాటేగాని కొసరు మాట కాదు సుమా:- కర్ణుడు కుంతి కుమారుడని తెలిసినా కర్ణుని కూడా రాజుగా ఒప్పుకునేవాడే కాదు దుర్యోధనుడు, ఇతను కానీనుడు కదా! మరో మాట నాటికాలంలో పురుషాధిక్యత సమాజంలో ఉన్నా, కుటుంబంలో మాత్రం స్త్రీ ఆధిక్యత కొనసాగింది, దీనినీ దుర్యోధనుడు నిరసించాడు. నాటి సమాజ కట్టుబాట్లు కాదన్నాడు, దీనిని పెద్దలెవరూ ఒప్పుకోలేదు, అదీ అసలు సంగతి……….ఇదీ దుర్యోధనుని అంతరంగం.

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-దుర్యోధనుని అంతరంగం

  1. తాడిగడప శ్యామలరావుగారు,

    విద్య యొసగును వినయంబు వినయమునను
    బడయు పాత్రత పాత్రత వలన ధనము
    ధనము వలనను ధర్మంబు దాని వలన
    నైహికాముష్మిక సుఖంబు లందు నరుడు

    అన్నది భర్తృహరి మాట, లక్ష్మణకవి నోట. విద్యా వినయ సంపన్నులైన మీరు నా పై అభిమానంతో అనే మాటది. ఉన్నమాట చెప్పుకున్నాను.

    మీ అభిమానానికి మరొకసారి
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  2. శ్రీ కష్టే ఫలి శర్మ ! యద్భుతముగన్ శ్రీమాన్యుడై వెల్గ యా
    రాకా కాంతిని జూడవమ్మ కథలన్ రమ్యంబుగా వించి తా
    వీకాశమ్మును గాంచె నొప్పు విధమై విద్వత్తు మాణిక్య కై,
    దూకో! కష్టమునోర్చినావు గద! శార్దూలా !విహారీ భళా !

    జిలేబి

    మెచ్చుకోండి

  3. శ్యామలరావు గారు, శర్మ గారి బ్లాగ్ వ్యాసంగం గురించి మీరు చెప్పింది అక్షరసత్యం. అయితే “పండితులు పండితులకు మాత్రమే అర్థమయ్యే విధంగా పాండిత్యప్రకర్ష వెలయుస్తూ చెప్పినప్పుడు మాబోంట్లకు వారి పాండిత్యం గొప్పగా ఉందన్న సంగతి తప్ప చెప్పిన విషయం సరిగా తెలియకపోవటం తరచుగా జరిగే తమాషా” అని మీబోంట్లనడమేమిటి శ్యామలరావు గారు? పాండిత్య సంబంధిత విషయాలలో మీరేమన్నా తక్కువా? వినయమే మీచేత అలా పలికిస్తోంది.

    మెచ్చుకోండి

  4. మిత్రులు శర్మ గారు,

    మీరు ఇలా బ్లాగు వ్రాయటం వ్యసనంగా లెక్కకు రాదు. వ్యసనం అంటే దుఃఖం అని అర్థం. అందుచేత దుఃఖానికి కారణమయ్యే పనులను కూడా ఆర్యులు వ్యసనాలని వ్యవహరించారు. మీరు లోకోపకారకంగా ఉండేందుకు గాను శ్రమను లెక్కించక అనునిత్యమూ సులభమైన శైలిలో ఆహ్లాదకరమైన భాషలో మంచిమంచి విషయాలను విశదీకరిస్తున్నారు. మాబోంట్లకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. మీరిలా చేస్తూ ఉండటం వలన, తెలిసినవిషయాలను పదిమందికీ చెప్పి మంచిపని చేస్తున్న తృప్తి మీకు కలుగుతున్నది – మీనుండి మంచి విషయాలు నేర్చుకుంటున్న సంతోషం‌ మాకు కలుగుతున్నది. ఇక్కడ ఉభయత్రా దుఃఖం అనేదాని ప్రస్తావన సూచనామాత్రంగా కూడా లేదు. అందుచేత మీ యీ అలవాటును వ్యసనం అన్నట్లుగా అనుకోకండి. పండితులు పండితులకు మాత్రమే అర్థమయ్యే విధంగా పాండిత్యప్రకర్ష వెలయుస్తూ చెప్పినప్పుడు మాబోంట్లకు వారి పాండిత్యం గొప్పగా ఉందన్న సంగతి తప్ప చెప్పిన విషయం సరిగా తెలియకపోవటం తరచుగా జరిగే తమాషా. మీరు చెప్పుతున్న విషయమూ చెప్పే విధానమూ కూడా మాబోంట్లకు బాగుంటున్నాయి,

    మెచ్చుకోండి

  5. విన్నకోట నరసింహారావు గారు,
    ధృతరాష్ట్రుని బిడ్డలలో మిగిలినవాడితడొకడే!
    యుద్ధం తరవాత కాలంలో ధర్మరాజు ఇతనికి సముచిత స్థానమే ఇచ్చాడు, ఇతనొక మంత్రి కూడా.

    భారతంలో పాండురాజు కుంతికి చెబుతాడు, సంక్షిప్తంగా, కాని భీష్ముడు బాగా వివరిస్తారు. మొత్తానికి భారతం బాగానే తిరగేస్తున్నారనమాట,మంచిదే 🙂 నచ్చినందుకు
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  6. తాడిగడప శ్యామలరావుగారు,
    శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రి గారు రాసిన వ్యాసం నేను చూడలేదు. లింక్ దొరుకుతుందేమో చూడాలి. వివరంగానే రాద్దామనుకున్నగాని, ముఖ్యమైనవి రాసి వదిలేశా,వేడిమిని భరించలేక, డెస్క్ టాప్ దగ్గర కూచోలేక 🙂
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  7. లలితమ్మాయి,
    ఎండవేడికి తట్టుకోలేక పగలు,రాత్రి కూడా డెస్క్ టాప్ దగ్గర కూచోలేకపోతున్నా! టపా రాయక ఉండలేకపోతున్నా,తెల్లవారుగట్ల నాలుగు నుంచి ఆరువరకు, ఇదిగో ఇక్కడ, వ్యసనం కదా 🙂 అందుకు చిన్న టపాలు, అందునా భారతం, అదనమాట సంగతి 🙂
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  8. యుయుత్సుడు ధర్మవర్తనుడు. మీరన్నట్లు భీముడిని విషాన్నం తినవద్దని హెచ్చరించాడు. అలాగే యుద్ధం ఆరంభమయ్యేముందు కౌరవుల వైపు నుండి పాండవుల పక్షానికి వచ్చేసాడు. మహాభారతంలో నాకు నచ్చిన పాత్రలలో ఒకడు.
    పుత్రులలో రకాలెన్ని అని యుద్ధం తరవాత ధర్మరాజు అడిగితే భీష్ముడు వివరించాడు (పైన మీరిచ్చిన లింకులోని మీ పాత 2013 టపా). వివిధరకాల పుత్రుల గురించిన వివరణ మరోచోట కూడా కనబడుతుంది. పుత్రుల కోసం కుంతితో చర్చిస్తున్న సందర్భంలో పాండురాజు ఈ రకాల గురించి చెబుతాడు – కాకపోతే క్లుప్తంగా (భీష్ముడు చెప్పినంత వివరంగా కాకుండా). ఆదిపర్వంలో వుంటుంది.
    దుర్యోధనుడి అంతరంగం బాగా విశ్లేషించారు.

    మెచ్చుకోండి

  9. చదువన యర్ధాంతరముగ
    పదునటు గానక టపాను పారుడు రమణీ
    కుదురక నిలిపెన్నో యని
    చెదురుముదురుగ యనిపించె చెవియొగ్గవయా !

    జిలేబి

    మెచ్చుకోండి

  10. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు వ్రాసిన ‘కౌరవపాండవకలహకారణము’ అనే పెద్దవ్యాస‌ం‌ ఒకటి మాకు పాఠశాలలో పైతరగతుల్లో ఒకదానిలో పాఠ్యాంశంగా వచ్చింది. ఇప్పుడా వ్యాసం లభ్యం అవుతుందో‌ లేదో తెలియదు. అందులో ఈ సోదరపంచకానికీ ఆ సోదరశతానికీ‌ మధ్య వారి బాల్యంలో జరిగిన సంఘటనలను చక్కగా విశ్లేషించి చూపారు శాస్త్రిగారు.

    మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.