శర్మ కాలక్షేపంకబుర్లు-నవ్విన నాపచేను పండింది.

నవ్విన నాపచేను పండింది.

అరుణ్ గారు నవ్విన నాపచేనే పండింది అన్న నానుడి గురించి రాయమని కోరిన సందర్భంగా, తుని తగువు గురించి టపా రాస్తానన్నా, అది మాత్రం బాకీ ఉండిపోయింది,తొందరలో అదీ పూర్తి చేస్తాను.

వరి ఏక వార్షికం. మరో పంట కావాలంటే మళ్ళీ విత్తుకోవలసిందే! ఇప్పుడంటే వరసల్లో నాటుతున్నారు, వరిని, కాని పాత రోజుల్లో దమ్ము చేసి వెద జల్లేవారు, వరి విత్తనాలని. నేడు మళ్ళీ వెదజల్లడమే మంచిదంటున్నారు. దారి తప్పేనా?

పండిన తరవాత, వరి దుబ్బులను నేల నుంచి ఒక అడుగెత్తులో కోసి పనలు వాటిపై వేసేవారు. కోయగా చేలో మిగిలిపోయిన వాటిని మోళ్ళు అంటారు. ఇలా చేయడం మూలంగా కంకులనున్న ధాన్యం నీటిలో ఉండదు, నానదు, ఎందుకంటే వరి పనలు మోళ్ళ మీద ఆనుకుని ఉంటాయి గనక. నేడు యంత్ర వ్యవసాయంలో మోడూ లేదు గడ్డీ లేదు, పశువులకి.

ఇలా మోళ్ళుండగా కోసిన చేనును మరలా ఊడ్చేందుకు సిద్ధం చేసేటపుడు మోళ్ళతో సహా దున్నేసి, దమ్ము చేస్తారు. అందుకని మోడు ను ప్రత్యేకంగా తీసెయ్యరు.

ఒక రైతు ఇలా వరి కోసుకున్నాడు, మళ్ళీ వ్యవసాయం చేసే సమయం వచ్చేసింది, వర్షమూ పడింది. పక్కవాళ్ళంతా వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు, ఈ రైతు మాత్రం వ్యవసాయం చేయడానికి తగిన స్తోమతు, ఇంటా వంటా లేక చేను అలాగే వదిలేశాడు. దానితో వదిలేసిన మోడు మళ్ళీ చిగిరించింది, చేనంతటా, రైతు చేసిన సంరక్షణలేకనే. ఆ తరవాత రైతు కొద్దిగా కోలుకుని నీరు నిలబెట్టుకోడం వగైరా పనులు చేస్తూ వచ్చాడు. ఇది చూసిన పక్క రైతులంతా అతనిని హేళన చేయడం మొదలెట్టేరు. ఎందుకంటే ఇలా మోడు నుంచి వచ్చిన మొక్కల్ని నాప మొక్కలు అంటారు. అంటే లేతైనది అనీ వ్యర్ధమైనదనీ, పనికిరానిదనీ అర్ధం. అదేం పండుతుంది దానికి చాకిరి చేయడం వ్యర్ధమ్నీ,చేతకాని పని చేస్తున్నాడనీ హేళన చేయడం మొదలు పెట్టేరు.

ఇలా చేస్తూ వచ్చిన ఆ నాప చేనూ పండింది, పక్క వ్యవసాయం చేసిన చేలూ పండేయి. అందరూ కోతలు పూర్తి చేసేరు. అందరికి పది బస్తాల ధాన్యం పండితే నాప చేను పదిహేను బస్తాలు పండింది. అందరు నవ్వి పండదనుకున్న నాప చేను, పండదని హేళన చేసిన చేను బాగా పండింది.

అంటే ఎవరిని హేళన చెయ్యకు, చేతకానివారని, తెలివితక్కువ వారని, పనికిరాని వారని అనుకోకు, నిందించకు,హేళన చెయ్యకు. ఏమో! ఏ పుట్టలో ఏ పాముందో! ఎవరికి తెలుసు? ఇలా పనికిరానివారనుకున్నవారు, హేళన చేయబడినవారు, చేసిన,చెప్పిన; పని,మాట ఒక సమాజాన్నే ఉన్నత స్థితికి తీసుకుపోవచ్చు. ఎవరినీ నీచంగా చూడకు, అలా నీచంగా చూడబడ్డవారే గొప్పవారై ఉండచ్చు. వారి గొప్పతనం తెలుసుకునే పరిజ్ఞానం మనలో లేకుండి ఉండాలి.

ఎంత చెప్పినా అర్ధమయేలా చెప్పలేకపోవచ్చు, అందుకో చిన్న ఉదాహరణ, నేడు పేపర్లో చూశా!.

ఒడీషా లో ఒక చిన్న పల్లెటూరు, నేటికీ కరంట్ లేని ఊరు. నీటి వసతి లేని ఊరు. వేసవి వస్తే మనుషులు పశువులు కూడా పిట్టల్లా రాలిపోయే చోటు, నీరు లేక,దాహానికి. పదేను సంవత్సరాల ఒక యువకునికి ఇది చూసి మనసు చలించిపోయింది. పలుగు పారా తీసుకుని చెరువు తవ్వడం ప్రారంభించాడు, ఒంటిగా. కూడా ఉన్నవారు, నవ్వేరు, ఇది జరిగే పనేనా అన్నారు, చేతకాని పని చేస్తున్నావన్నారు. ఎన్నో కష్టమైన మాటలూ అన్నారు, ప్రతిబంధకాలూ తెచ్చారు. ఐనా ఈ యువకుడు పని మానలేదు. చెరువు తవ్వుతూనే ఉన్నాడు, ఒంటరిగా! ఎన్నేళ్ళు దగ్గరగా ముఫై సంవత్సరాలు తవ్వేడు. ఇప్పుడక్కడొ గొప్ప చెరువు, నీటితో కళకళలాడుతోంది. ఇప్పుడంతా నాటి యువకుణ్ణి మెచ్చుకున్నారు. నేడు ఎ.ఎల్.ఎ గారేదో బహుమతి ప్రకటించారు. కలక్టర్ గారేదో చేస్తామన్నారు. ఇది కథ కాదు,జీవిత సత్యం. వీటిలో ఏమి ఆశించి ఆ నాటి యువకుడీ చెరువు తవ్వడానికి మొదలెట్టేడు?

నాడు నవ్వినవారు కూడా నేడు ఆ చెరువును ఉపయోగించుకుంటున్నారు, చిత్రంకదా! గొప్పతనాన్ని గుర్తించడానికి కూడా ఎంతో కొంత గొప్పతనం కావాలి. నవ్విన నాపచేనే పండింది, ఒంటిగాడు చెరువు తవ్వేడు.

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నవ్విన నాపచేను పండింది.

  1. చెరువు తవ్విన యువకుడి పట్టుదలను మెచ్చుకోవాలి. “నవ్విన నాపచేనే పండింది” అనే సామెతకు నిజంగానే దృష్టాంతం.

    అటువంటిదే మరొక ఉదాహరణ కొండ మధ్య నుండి తవ్వి బాట తయారుచేసిన ఒక మహానుభావుడి దీక్ష. బీహార్ రాష్ట్రంలో గయకు దగ్గర గెలౌర్ అనే గ్రామ వాస్తవ్యులకు సమీప పట్టణానికి / కొండకు అవతలివైపున్న పట్టణానికి వెళ్ళాలంటే కొండ చుట్టి 55 కి.మీ. ప్రయాణం చేయాల్సి వచ్చేదిట. వైద్యం కోసం అవసరమయినప్పుడు ఇది మరీ ప్రాణాంతకం అయ్యే ప్రమాదం (తెలుగు టీవీ చానెళ్ళ వారి పరిభాషలో “అవకాశం” ; ప్రమాదం అనాల్సిన చోట కూడా వాళ్ళు అవకాశం అనడం తరచుగా చూస్తుంటాం 🙁🙁) కూడా ఉంటుంది కదా. ఆ గ్రామనివాసి దశరథ్ మాంఝీ తన భార్య విషయంలో అటువంటి ఇబ్బందులు పడి, చివరకు ఆ కొండ తొలిచి బాట చెక్కాలని నిశ్చయించుకున్నాడట. లేబరర్ అవడం వలన ఆర్థికంగా ఏమీ లేనివాడు. అందువల్ల తన దగ్గరున్న సుత్తి, ఉలి ఉపయోగిస్తూ పని మొదలు పెట్టాడట. గ్రామస్తులు అతన్ని చూసి నవ్వారట, హేళన చేసారట. అయినా జంకక తను తలపెట్టిన పని కొనసాగించాడట. ఎంత కాలం? 22 సంవత్సరాలు పట్టిందట. చివరికి ఆ కొండని తొలిచి 360 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు గల బాట తయారు చేసాడట. దాని ఫలితం – 55 కి.మీ. దూరం 15 కి.మీ. లకు కుంచించుకు పోయిందిట 👏. సంకల్పం, కార్యదీక్ష లకు తార్కాణం 🙏. ఇప్పుడు ఆ రోడ్డు గ్రామస్తులందరూ వాడుతున్నారు. ఆ మహానుభావుడు చనిపోయినప్పుడు బీహార్ రాష్ట్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించిందట. 2016 లో పోస్టల్ శాఖ అతని పేర స్టాంప్ విడుదల చేసిందట.

    ఆ కారణజన్ముడు దశరథ్ మాంఝీ గురించి ఈ క్రింది లింక్ లో చదవచ్చు.

    https://en.m.wikipedia.org/wiki/Dashrath_Manjhi

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s