శర్మ కాలక్షేపంకబుర్లు-తుని తగువు

తుని తగువు

కాంతాకనకాలే కలహ కారణాలు,నేటికిన్నీ! కాదు ఎప్పటికిన్నీ!! కలహానికి కారణాలు వెతుకుతూ పోతే మూలం కాంతాకనకాలలో ఒకటిగా తేలుతుంది లేదూ జమిలిగానూ ఉండచ్చు.

తుని పట్టణం తాండవ నదికి కుడిగట్టున తూగోజిలో ఉన్నది. నది ఎడమగట్టున ఉన్నదే పాయకరావుపేట. ఇది కూడా ఒకప్పుడు తుని పట్టణంలో భాగమే, కాలంలో విశాఖ జిల్లా ఏర్పడినప్పుడు ఆ జిల్లాలో చేర్చబడింది. ఈ ప్రాంతాన్ని శ్రీ వత్సవాయి వారి వంశం పరిపాలన చేసినది. నాటి కాలంలో న్యాయంకూడా ప్రభువు బాధ్యతగానే ఉండేది. ప్రతి విషయమూ ప్రభువే చూడకపోయినా కొంతమంది అధికారులు ….న్యాయవ్యవస్థ, జాప్యం…. ఇదంతా సహజమే…నాటికాలానికే సత్వరన్యాయం అన్నది జరగనిమాటే…

తుని ప్రాంతం ఆ రోజులనాటికే పాడి,పంట, వ్యర్తకం,వ్యాపారం,చేతి వృత్తులతో తులతూగేది. ”కలిమిలేనన్నాళ్ళు కలిసి మెలిసుంటారు, కలిమి కలిగిన నాడు కాట్లాడుకుంటా”రన్నారో సినీ కవి. ఇది నిజం కదా! ఇక్కడ తగవులూ ఎక్కువగానే ఉండేవి. న్యాయం జరగడానికి సమయమూ పట్టేది. అదుగో ఆ అవసరంలో పుట్టుకొచ్చినదే తుని తగువు, అదే ప్రత్యామ్నాయ న్యాయవ్యవస్థ. ఇందులో ముగ్గురు గాని ఐదుగురుగాని సభ్యులు, వారంతా ఆ ప్రాంతంలోని సంఘంలో సత్ప్రవర్తన కలిగినవారని ధర్మాత్ములని పేరు పడ్డవారే ఉండేవారు. వీరినెవరూ నియమించరు, జీతభత్యాలూ ఉండవు, పరోపకారమూ, సత్వర న్యాయం జరగడమూ వీరి ధ్యేయం. ఒక ముగ్గురే కాకపోవచ్చు, వర్తకులందరికి ఒక వ్యవస్థ. వృత్తి పనివారలకు మరొకటి, ఇలా అవసరాలను బట్టి, ఒక న్యాయ వ్యవస్థ ఏర్పడేది. ఈ వ్యవస్థనే ”తుని తగువు” అన్నారు,(తుని తగువు=తుని తరహా న్యాయం ). వీరిచ్చే తీర్పులు కూడా వాది,ప్రతివాదులిద్దరికి సమ్మతమైనవే, న్యాయం బలవంతంగా రుద్దబడింది కాదు. విషయం చెప్పాలంటే నేటి ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థ దీనినుంచి పుట్టుకొచ్చినదే!

ఒకిద్దరి మధ్య తగవు వస్తే అది వీరి దగ్గరకొచ్చినపుడు వాది ప్రతివాదులనుండి విషయం విని, సభ్యులు సంప్రదించుకుని వాది,ప్రతివాదులను వేరు వేరుగా కలసి, వారివారి వాదనలో న్యాయమూ,లోపమూ చెప్పడంతో మొదలౌతుంది తగవుకు పరిష్కారం. వాది ప్రతివాదులిద్దరికి చెప్పి న్యాయంగా తీర్పును విడివిడిగా వినిపించి, ఇద్దరి ఇష్టం మీద, ఇద్దరిని ఒకచో చేర్చి తీర్పు వివరించడం,తీర్పు అమలుచేయడమే తుని తగువు.

ఐతే కాలంలో తుని తగువు అంటే తగవులోని ఆస్థి,డబ్బును చెరిసగం చేసి ఇచ్చెయ్యడమేగా మిగిలిపోయింది. నేనుగా అరవై సంవత్సరాల కితం ఈ తుని తగువులో ఆస్థి పొందినవాడిని. కేస్ వివరం టూకీగా చెబుతా, ఎందుకంటే కేస్ చాలా పెద్దది, విసుగు పుట్టిస్తుంది కనక…

నాకు,దాయాదులకు మధ్య ఒక ఆస్థిగురించిన తగువొచ్చింది. ఆస్థిని ప్రతివాదులు స్వాధీనం చేసుకున్నారు. నేనా మైనర్ని. నా స్థానీయులు కోర్ట్ కిపోయారు. కాలం గడుస్తోందిగాని తీర్పురాలా,ఏళ్ళు గడిచాయి, ఇరు పక్షాలకీ కాళ్ళూ లాగాయి. ప్రతి పక్షానికి న్యాయంలేదుగాని బలం ఉంది,పెద్ద వయసూ వచ్చేసింది. ఇది గెల్చుకున్నా అనుభవించేవారెవరూ లేరు. ఈ సందర్భంగా విషయం తుని తగవుకు చేరింది. సంప్రదింపులైన తరవాత న్యాయం చెప్పేవారు ఆస్థిని ఐదు భాగాలు చేసి నాలుగు భాగాలు నాకిచ్చి ఒక భాగం వారికిస్తూ తీర్పు చెప్పేరు. ఆ తీర్పును ఇద్దరం రాజీగా కోర్ట్ లో సమర్పించుకుని బయట పడ్డాం. ఇది అసలు తుని తగువంటే, ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థ.

శ్రీ.జె.వి.రావు గారి కోరిక పై ఈటపా రాశాను. ఇంకెవరికి బాకీ లేను 🙂

ఇంటిలో అనారోగ్యాల మూలంగా బ్లాగుకు కొంతకాలం శలవు. చెప్పకుండాపోతే నాకోసం వెతుకుతున్నారు, నేనే వీలు చూసుకు తిరిగొస్తా.

_____/\_____

15 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-తుని తగువు

 1. అనామకం
  అనామకాలని పరిగణలోకి తీసుకో కూడదనుకున్నాగాని, మీరిచ్చిన లింక్ చూశా! కలిగిన వారికే న్యాయం 🙂 విన్నకోటవారి మాటే నాదీ!

  నెనరుంచండి.

  మెచ్చుకోండి

 2. విన్నకోట నరసింహారావుగారు,

  ఇప్పుడు అమల్లో ఉన్న లోక్ అదాలత్, అంబుడ్స్ మన్, కన్స్యూమర్ ఫోరం వగైరా వగైరా అన్నీ ఈ ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థ కిందకే వస్తాయి కదండి. తుని తగువుకు ఎక్కువ సమయమూ తీసుకోదు, న్యాయం చెప్పేవారు దేనికి దానికి వేరు వేరుగా ఉండడం మూలంగా!

  తుని తగువులో ఖర్చు చాలా తక్కువ. అది కూడా న్యాయం చెప్పేవారికి ఏర్పాటు చేసే ప్రయాణ సాధనాలు( అవసరాన్ని బట్టి) వారి బోజనం వగైరా ఇవీ అవసరమైతేనే., లేకపోతే అసలు ఖర్చు లేదు.

  ఒకప్పుడు పంచాయతీ కోర్ట్ లు ఉండేవి గుర్తు ఉందనుకుంటా. అందులో సివిల్ క్రిమినల్ రెండూ విచారించేవారు, గ్రామ స్థాయిలో. ఇదెందుకు చచ్చిపోయిందో తెలుసా! గ్రామాల్లో రాజకీయాలు చొరబడ్డంతో, నిస్పక్షపాతంగా న్యాయం చెప్పేవారు నశించడంతోనూ, మరి ఇతర కారణాలతోనూ!

  విద్య,వైద్యం, న్యాయం, ఈ మూడూ బ్రహ్మ పదార్ధాలయ్యాయి, నేడు!

  ఇంకా చాలా చెప్పాలి ఇంతతో ముగిస్తా!

  నెనరుంచండి.

  మెచ్చుకోండి

 3. మనదేశంలో కోర్టులు వృధా చేస్తున్న సమయాన్ని అక్కడ చార్జ్ చేసే డబ్బుతో కొలిస్తే చాలా తక్కువే ! సమయం విలువ తెలియకే గదా వెనకబడిన దేశంలో ఉండి వర్ధమాన దేశంగా చెప్పుకుని బ్రతికేస్తున్నాం.

  మెచ్చుకోండి

 4. లింకిచ్చినందుకు ధన్యవాదాలు “అనామకం” గారూ. చూశాను. లింక్ లోవివరించిన ప్రత్యామ్నాయ వ్యవస్ధ కాస్త ఖరీదైన వ్యవహారంలాగా తోస్తోంది.

  మెచ్చుకోండి

 5. “తుని తగవు” ఆసక్తికరంగా ఉంది శర్మ గారు. అటువంటి ఏర్పాట్లు కక్షిదారులకు సౌకర్యవంతంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాల కన్నా “తుని తగవు” వేగవంతంగా పూర్తవుతుంటుందనే అనుకుంటున్నాను. అయితే ఈ వ్యవస్ధలో ఖర్చులు ఉంటాయా, ఉంటే ఏ మాత్రంగా ఉంటాయో కూడా వివరిస్తే బాగుంటుంది.

  “నేటి ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థ దీనినుంచి పుట్టుకొచ్చినదే!” అన్నారు మీరు. అంటే “లోకదాలత్” గురించా మీరనేది? ఇతరత్రా ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్ధలు ఇంకా ఏమన్నా ఉన్నాయంటారా? మీ వీలును బట్టే జవాబివ్వండి.
  ఆరోగ్యాలు జాగ్రత్త శర్మ గారూ.

  మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.