శర్మ కాలక్షేపంకబుర్లు-మనసే శత్రువు.

మనసే శత్రువు.

ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో చెప్పినమాట.

వైరులెవ్వరు చిత్తంబు వైరి గాక
చిత్తమును నీకు వశముగా జేయవయ్య!
మదయుతాసురభావంబు మానవయ్య!
యయ్య! నీ మ్రోల మే లాడరయ్య జనులు.

శత్రువెవరు? నీ మనసే శత్రువు. మనసును నీ స్వాధీనంలోకి తెచ్చుకో! అరిషడ్వర్గాలలోని మదం తో నిండిన అసురభావం వదలిపెట్టు. నీ ముందు జనం నిజం చెప్పరయ్యా!

లోకములన్నియున్ గడియలోన జయించినాడ వింద్రియా
నీకము జిత్తముం గెలువ నేరవు నిన్ను నిబద్ధుజేయు నీ
భీకర శత్రు లార్వుర బ్రఖిన్నుల జేసిన బ్రాణికోటిలో
నీకు విరోధి లే డొకడు నేర్పున జూడుము దానవేశ్వరా!

గడియలో లోకాలన్నీ జయించావు కాని నీ మనసును దానికి లొంగి ఉండే ఇంద్రియాలనూ జయించలేకపోయావు. నిన్ను బద్ధుణ్ణిగా జేస్తున్న భయంకర శత్రువులు ఆరుగురిని వదలేస్తే ప్రాణికోటి మొత్తం మీద నీకు శత్రువే లేడయ్యా!

మన మనసే చిత్రమైనది. మనసు పంచేంద్రియాలను శాసిస్తుంది, కాని ఇంద్రియ సుఖాల కోసం వెంపర్లాడుతుంది. ఇదో పక్క ఐతే మరో పక్క ఆరు గుణాలు మనసుని కుళ్ళబొడుస్తుంటాయి. అవే కామ,క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్యాలు. మనసువీటికీ లొంగిపోతూ ఉంటుంది.

మనసు కోరికల పుట్ట, ఒకదాని తరవాత మరొకటి కోరిక పుడుతూనే ఉంటుంది. ఎంత సంపాదించినా తృప్తి లేదు, ఇంకా సంపాదించాలనే కోరిక. కోరిక తీరితే ఆనందం లేకపోతే క్రోధం. కొన్నిటిపై,కొంతమందిపై అతి ప్రేమ, కొన్నిటిపై అతి ద్వేషం. డబ్బున్నవాళ్ళమని,అందమైనవాళ్ళమని, చదువుకున్నవాళ్ళమని,అధికారం ఉన్నవాళ్ళమని, మనం ఏం చేస్తే కాదనువారెవరు? అడ్డు చెప్పేవారెవరనే మదం. చివరగా మత్సరం, వాడు నాకంటే ఎందులో గొప్ప, వాణ్ణే ఎందుకు అందరూ పలకరిస్తారు? వాడికే ఎందుకు గౌరవం ఇస్తారు? ఇలా ప్రతి విషయంలోనూ పోలిక. భగవంతుడు ఎవరికి కావలసిన తెలివి వారికిచ్చాడు. మనగొప్ప మనదే! మనం చూసి అసూయ పడుతున్నవారికి మన దగ్గరున్నదేదో ఉండి ఉండకపోవచ్చు! ఎవరూ గొప్పవారు కాదు,ఎవరూ చిన్నవారూ కాదు. ఎవరంతవారు వారే!

ఇలా ఈ ఆరు అంతఃశ్శత్రువులు కామ,క్రోధ,మోహ,లోభ, మద, మాత్సర్యాలు మనసును పట్టి పీడిస్తుంటాయి. ఇంద్రియ సుఖాలను, అంతశ్శత్రువులను గెలవగలిగితే! సాధ్యమా!! పంచేంద్రియాలను మనసు శాసిస్తుంది కాని వాటికి లోబడిపోతుంటుంది, ఇంద్రియ సుఖం కోసం. ఇదొక విషవలయం. దీని నుంచి తప్పించుకున్నవారే లేరు. కోరిక లేనివారు లేరు. కోరిక మొదటి శత్రువు దీనినుంచే మిగిలినవి మొలుచుకొస్తాయి. కోరిక లేనివారున్నారా? ఆ( ఉన్నారున్నారు, వారిద్దరే ఒకరు పుట్టనివారు, మరొకరు మరణించినవారున్నూ!

మరి వీటినుంచి విముక్తి,విడుదల ఉంటుందా? ఉండదు, ఉండదుగాక ఉండదు. మరి దారి? మనసు ఈ అంతఃశ్శత్రువులను వదల్చుకోలేదు, అలాగే ఇంద్రియాలకూ లోబడకపోకుండా ఉండలేదు. మనసు పంచేంద్రియ సుఖానికి లోబడుతూ, అంతశ్శత్రువుల దాడికి తట్టుకోలేక విలవిలలాడుతుంది. మానవులు నాలుగు పురుషార్ధాలు సాధించుకోవాలి. అవి ధర్మ,అర్ధ,కామ,మోక్షాలు. ఇదిగో ఈ కామమే ఆ ఆరుగురు శత్రువులలో మొదటిది. దీనికి ధర్మమనే ముకుతాడు వేయగలిగితే, అన్నిటిని ధర్మానికి ముడిపెట్టుకుంటే, ధర్మమైన అర్ధం,ధర్మమైన కామం సాధించుకోవచ్చు. ఎప్పుడైతే కామం ధర్మంతో ముడి పడిందో అప్పుడు మిగిలిన అంతఃశ్శత్రువులు లోబడతారు, అప్పుడు శత్రువెక్కడా ఉండడు. అంతదాకా మనం శత్రువు బయట ఉన్నాడని వెతుకుతూనే ఉంటాం. కాని ఇది సామాన్యులు గుర్తించడం కష్టం. మన శత్రువు బయట లేడు మనలోనే ఉన్నాడు, అదే మన మనసు.

మనసును జయిస్తే!…. సామాన్యులకు సాధ్యం కాదు.

5 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మనసే శత్రువు.

 1. గురువుగారు నమస్కారం.
  //మన శత్రువు బయట లేడు మనలోనే ఉన్నాడు, అదే మన మనసు.//
  ఈ మనసు బాధలు పడలేకే మనసుకవి “మనసున్న మనిషికీ సుఖములేదంతే..,” అనీ, “మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడ,”నీ అనేశారు.

  మెచ్చుకోండి

 2. అనఘా ! ద్వాస్థితులా హరిన్విడిచిరే యంకంబు తప్పంగ నౌ !
  ననబోణిన్ మజ గాంచ తప్పిరకటా నైమిత్తికర్మమ్ములన్
  వినుమా ! జీవుల కెల్లతప్ప దు సుమీ వీకమ్ము గూడంగనౌ
  మనసే శత్రువు మాచనార్యుడనియెన్ మాన్యంబు గా గాంచుమా !

  జిలేబి

  మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.