శర్మ కాలక్షేపంకబుర్లు-కంద బచ్చలి కూర-కుటుంబం

కంద బచ్చలి కూర-కుటుంబం

మొన్న వనసమారాధనలో కందా బచ్చలీ కూరొండేరు,ఆవ పెట్టి. వహ్వా! ఏమిచెప్పను అంత రుచిగా ఉందనుకోండీ!

కందాబచ్చలి కూరెలావండుకుంటారు? తియ్యకంద అదే ఎర్రకందని ముక్కలుగా తరుక్కోవాలి. కుక్కర్లో పారేస్తే అన్నీ ఉడికిపోతున్నరోజులు. పాతకాలంలో కంద, పప్పు ఉడికిన నీళ్ళంటే మంచివని అనేవారు. మా నూతి నీళ్ళకి కందా,పప్పూ ఉడుకుతాయండని చెప్పేవారు, అద్దెకొచ్చేవాళ్ళతో, ఇదో ప్రత్యేక అదనపు ఆకర్షణ, అద్దె కొచ్చేవారికి. దారి తప్పేనా? 🙂

బచ్చలిలో మట్టుబచ్చలి, ఎర్రబచ్చలి,తెల్లబచ్చలి,సిలోన్ బచ్చలి రకాలు. ఏదైనా బానే ఉంటుందిగాని, తెల్లబచ్చలి మట్టు బచ్చలి బాగున్నట్టు మిగిలినవి ఉండవు. మేనత్త కొడుకూ మొగుడేనా! ఉండ్రాళ్ళూ పిండివంటేనా సామెత అన్నట్టు, దీని గురించి మళ్ళీ చెప్పుకుందాం, మళ్ళీ దారి తప్పనుగా! 🙂 ఎక్కువగా దొడ్లో దొరికేది, పెరిగేది తెల్లబచ్చలే!

బచ్చలిని చీడా పీడా లేకుండా చూసి తరుక్కోవాలి నీళ్ళలోకి. కడిగేయాలి. కంద ఉడికించాలి, మెత్తగా, ఎనుసుకుపోయేలా. ఇందులో బచ్చలి వేసి ఉడికించాలి,తొందరగానే ఉడికిపోతుంది. కొద్దిగా పసుపేయాలి,తగిన ఉప్పేయాలి. కొద్దిగా రవ్వపులుసు తగినంత చేర్చాలి. కొద్దిగా గట్టిపడేదాకా ఉడికించాలి. పోపేయాలి, అందులో ఇంగువ ముక్క వేస్తే రాజా! ఆ సువాసనకే, కూర ఉత్తినే తినాలనిపించేస్తుంది. కూర రెడీ అనుకున్నారా? అసలు కత ముందే ఉంది 🙂 తగినన్ని ఆవాలు, ఎక్కువైతే, అతి వేడి చేస్తుంది, అసలు నోట్లో పెట్టుకోలేరు, కళ్ళ నీళ్ళు ఖాయం. తగినన్ని ఆవాలు నూరుకుని, పొట్టు ఊదేసి, కొద్దిగా ఉప్పు,పసుపు,నూనె చేర్చి (కనరెక్కిపోకుండా) కూరలో కలిపేయాలి. ఇప్పుడు కూరవడియాలు,గుమ్మడి వడియాలు వేరుగా వేయించినవి కూరలో కలపాలి. కంద బచ్చలి కూర రెడీ.

కందాబచ్చలి కూరని పెళ్ళి చూపులరోజునుంచి,తాంబూలాల్రోజునుంచి,పెళ్ళి, శోభనం, ఆ తరవాత దాకా వండుతూనే ఉంటారు. అశుభ కార్యాల తరవాత శుభాన్ని ఆశిస్తూచేసే భోజనాలకీ వండుతారు. కందా బచ్చలి రెండూ బలేగా కలిసిపోతాయి. కాబోయే భార్య,భర్త ఇలా కలిసిపోవాలనే ఆ కూర వండుతారేమో 🙂

కందాబచ్చలి కూరకీ కుటుంబానికీ పోలికుంది. కంద వేడి చేస్తుంది,బచ్చలి చలవ చేస్తుంది. భార్య కందాలా ఉంటే భర్త బచ్చలిలాగా, భర్త కందలా ఉంటే భార్య బచ్చలిలాగా ఉంటే సంసారం నడుస్తుంది, ఒకళ్ళు ఏటికంటే మరొకళ్ళు కోటికి అన్నట్టు కాక, ఉద్దాలకుడు ,చండి దాంపత్యంలా కాక, ఒకరినొకరు అర్ధం చేసుకునే వీలనమాట. చెక్ అండ్ బేలన్స్. మరి మధ్యలో వేడి చేసే ఆవ ఎందుకని కదా! ఆవ పెడితే కొద్దిగా వేడి చేసినా, కూర రుచిగా ఉంటుంది. పిల్లలే ఆవలాటివాళ్ళు, ఇబ్బందులున్నా,వాళ్ళు లేకపోతే బతుకు నిస్సారం, కుటుంబం ఆనందంగా ఉండాలంటే పిల్లలుండాలి. ఇక పులుపు మామగారిలాటిది,ఎక్కువా పనికిరాదు,తక్కువా పనికిరాదు,సమానంగా ఉంటేనే కూర రుచి. మామగారు లేకపోతే కుటుంబానికి పెద్ద దిక్కే కరువు కదా! ఇక పోపు అత్తగారు లాటిది, తగిన కారం లేకపోతే కూరకి రుచేలేదు. అలాగే అత్త అధికారం కొద్దిగా చూపిస్తేనే ఆ కుటుంబం సవ్యంగా నడుస్తుంది. ఇక ఇంగువ ముక్క బంధువులలాటిది. చుట్టాలు తిన్న ఇల్లు సుడి మంగళం అని నానుడి కాదుగాని, బంధువులొచ్చి వెళితే వాళ్ళింట్లో ఎంత ఒద్దిక,భార్య,భర్త మాటే వినపడదు, కళ్ళతోనే మాటాడేసుకుంటారు. ఇక పిల్లలు చెప్పద్దూ అబ్బో వెళ్ళింది మొదలు తాతా,అమ్మమ్మా అంటూ వదలనిదే. భార్య,భర్త ఎంత గౌరవం చేశారని, ఇదిగో బట్టలు కూడా పెట్టిపంపేరు. ఇలా సాగిపోతుంటుంది. చివరివేగాని మంచి రుచినిచ్చేవి, వేయించిన కూర వడియాలు,గుమ్మడి వడియాలు, అమ్మాయి తల్లి తండ్రీలాటివి. వీళ్ళు వేగిపోతున్నా ఇబ్బందితో, అమ్మాయి అల్లుడి సంసారానికి రుచినివ్వాలనే కోరుకుంటారు పాపం. భార్యభర్తలు పదిమందిలో ఉండీ, కళ్ళతో మాటాడేసుకోవడం, సంప్రదించుకుని ఒక మాటమీద ఉండడం, చూస్తే ముచ్చటే వేస్తుంది. కూరలో రుచిని పుట్టించే ఉప్పులాటిదే భార్యాభర్తలు పదిమందిలో ఉండి కూడా కళ్ళతోనే మాటాడుకునే సౌకర్యం, అర్ధం చేసుకునే అన్యోన్యం, అనుబంధం ఆ కుటుంబానికి రుచినిచ్చేది.

కందాబచ్చలి కూరంటే ఇష్టం లేనిదెవరు…

32 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కంద బచ్చలి కూర-కుటుంబం

  1. “సూక్షి” అనగానేమి?
    “శతముఖి” అనగానేమి?

    “మీ పన్లు” అనే బహువచనంలో ఉన్నవారెవరండీ?

    జిలేబి మీద ఒకరికి కచ్చ ఏమిటి? జిలేబికే తెలుగు భాష అన్నా, తెలుగు బ్లాగరులన్నా కచ్చ కదా 🙂 చివరికి, అందరూ వాడుక భాషలో పద్యాలు రాయాలనే లక్కాకుల వారు కూడా మీ ఖండఖండాల కంద కందాల దెబ్బకు జడుసుకుంటున్నారే. 🙂 🙂 🙂

    జిలేబీ, మీ sportive spirit గొప్పది. కానీ మీ spirit of sport కోసం ఆడే ఆట చాలా సార్లు (మీవల్ల కానీ, మీరు “ఎనకరేజ్” చేస్తున్న వారి వల్ల కానీ) foul play కి కారణమయింది. మీరు ఒప్పుకున్నా, కోకపోయినా అది నిజం. అందుకే మిమ్మల్ని భరించడమూ కష్టమే.

    మెచ్చుకోండి

  2. రాకా చంద్రుని రాత్రులెల్ల మదిలో రాగమ్ము గావింపగన్
    శాకంబై వెలయున్నదే గద వయస్యా నీకు రమ్యంబుగన్
    వీకాశమ్ముల దేలగన్ మజ జిలేబీలన్ సమాళింపగన్
    పైకూలన్ వదులంగ మాకు రమణీ వైద్యమ్మదేనమ్మరో 🙂

    మెచ్చుకోండి

  3. Zilebi
    పైకూ లు రాయడం మానద్దు. నిత్య కల్యాణంలాగా నిత్యమూ తమకి ఎక్కడో ఒక చోట సన్మానం జరుగుతూనే ఉంది కదా 🙂
    పన్జెప్తా నని బెదిరించక్కరలేదు, తమ గురించి తెలియకపోతే కదా 🙂
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  4. శర్మ గారూ, సినిమా హాలుకు వెళ్ళి చూసినదొక్కసారేనండీ (సినిమా విడుదలైనప్పుడు, అప్పట్లో నేను విశాఖపట్టణంలో పని చేస్తున్న రోజులు) ☝️. తతిమ్మా దఫాలన్నీ టీవీలో వేస్తే చూసినది / చూస్తున్నది 🙏 .

    మెచ్చుకోండి

  5. పైకూలతో శతముఖి
    న్నే కామింటులుగ మార్చి నేలన్ గూల్తున్
    మీకో ఝలక్కు చూపిం
    చే కాళిక నయ్యెద, సయి చేవ్రాలిదియే 🙂

    జిలేబి

    మెచ్చుకోండి

  6. ఔరా !

    ఇంత సూక్షియా !
    జిలేబి మీద ఇంత కచ్చయా !

    ఉండండి మీ పన్లు చెబ్తా !

    ఇక వదలక ఐదు నిమిషాలకో పైకూ లతో ,శతముఖి పుచ్చుకుంటా 🙂

    చీర్స్
    జిలేబి

    మెచ్చుకోండి

  7. // “బహుశా సదరు అనామకుడి ఉద్దేశంలో పైకూ అంటే “పైత్యపు కూత” అయి ఉండవచ్చును.//

    హ్హ హ్హ ఫణీన్ద్ర గారు. అదే అయ్యుండే అవకాశం చాలా వుంది 😀😀.

    మెచ్చుకోండి

  8. విన్నకోట నరసింహారావుగారు,

    ఒక సినిమా అన్ని సార్లు చూడటమా? విత్రమే 🙂 ఒక సారి కూడా చూశానో లేదో గుర్తులేదు 🙂 తమ ఓపికకు జోహారు, లోకో భిన్నరుచిః కదా 🙂

    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  9. ఫణీన్ద్ర పురాణపణ్డగారు,

    అలాగనా! కొత్తమాట కనిపెట్టిన అనామకానికి వీరతాడేస్తానన్నారు, అమ్మవారు. వారెవరో అమ్మవారికి తెలిసుండాలనుకుంటానే 🙂

    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  10. నిజంగా కైకే 🙂

    నాకూ తెలియదండి

    అక్కడెవరో “అన్నా” నిమస్సు రాసే 🙂
    నాకు హైకూ అనే మొదట కనిపించి అనుకున్నా 🙂 ఆ పై మన ఈ “కవి” గారు కూడా పైకూ అంటే “some” దేహపు మాటల “పేర్పుడు ” లా వుందని పించింది 🙂

    “అన్నా” నిమస్సుకు వెయ్యాలి వీరతాడు ఆ పైకూ పదాన్ని కనుక్కున్నందుకు 🙂

    ఏమో ఎక్కడైనా ఈ మాట లో దాక్కొని వుందా పైకూ అని చూడాలె 🙂

    చీర్స్
    జిలేబి

    మెచ్చుకోండి

  11. జిలేబి గారూ, “సాగరసంగమం” అలాటిలాటి సినిమా కాదండీ. ఒక wasted life గురించి విశ్వనాధ్ గారి అద్భుత సృష్టి. YVR గారి లాగా నేను కూడా ఆ సినిమాని రెండంకెల సార్లు చూసినవాడినే 🤓.

    మెచ్చుకోండి

  12. అన్యగామి గారూ, కంద వేపుడు కూడా అద్భుతహ. ముళ్ళపూడి వారి కథల్లో ఒకచోట “సోంపేట దొడ్డమ్మ” గారు చేసే కంద వేపుడు కోలాహలం గురించి వుంటుంది 🙂. కందతో ఏ రకపు కూరైనా మహత్తరం – కంద బచ్చలి, కంద పులుసు బెల్లం, కంద వేపుడు 👌.
    శర్మ గారి సలహా పాటించెయ్యండి, కంద కఱవు తీరిపోతుంది (మీరుంటున్నది అపార్ట్మెంటు కాకపోతే) 👍.

    మెచ్చుకోండి

  13. జిలేబి గారూ, పైకూలు అంటే ఏమిటి? హైకూలు అనే పేరు విన్నాంగానీ పైకూలు ఏమిటో? అసలిందంతా “కైకూ” (హైదరాబాద్ భాషలో)? 😀

    మెచ్చుకోండి

  14. సినిమా డవిలాగులవెం
    త నిక్కముగ గుర్తుమీకు ! తరమై గనిరే 🙂
    మనుజుడు సాగర సంగమ
    మును, యిరవై “తూర్లు” చూడ ముద్దుగ గుర్తౌ 🙂

    మెచ్చుకోండి

  15. ఎవరో యేదో కూయం
    గ విదురుడా!మాచనార్య కష్టేఫలి ! మా
    చవులూరు పద్య ముల వల
    దు వలదనుట తగున? యెండదొర! దీక్షితుడా! 🙂

    శుభోదయమండి
    కుశలమేనా ?

    ఓ వైపేమో లైకులు ::)
    మరో వైపేమో పైకూలు 🙂

    వెరసి జిలేబి
    Its really cool when its hot 🙂

    చీర్స్

    జిలేబి

    మెచ్చుకోండి

  16. anyagaamiగారు,

    నెక్శ్ట్ టైమ్ బెటర్ లక్, ఓ పది కేజిల కంద పంపేదా 🙂
    పెరడుంటే ఒక ముక్క నేలలో పడేయండి, మొక్కొస్తుంది.
    నచ్చినందుకు

    ధన్యవాదాలు.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  17. వెంకట రాజారావు . లక్కాకులగారు,

    వంటా వార్పు మాటల దాకానే 🙂

    తమకాతిధ్య మివ్వాలని కోరుకుంటున్నాం. మా అతిధులు అల్ప సంతోషులే!

    అమ్మవారివి కందాలు కాదుటండీ, పైకూ లట, నిన్ననే ఎవరో చెప్పేరు సుమండీ 🙂

    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  18. గురువు గారు, మీరొక్క నాలుగు రోజుల ముందర ఇది వ్రాసి ఉంటె, నేను ఈకూర చేయించుకొని మీరు చెప్పిన రుచిని ఆస్వాదించేవాడిని. మాకు కంద దొరకదు. పొరపాటున దొరికింది. ఇంటావిడకి ఎలా వండాలో తెలియక, నాపోరు పడలేక వేపుడు చేసింది. మా చిన్నతనంలో తరచూ తినేవాళ్ళము. మరొక్కసారి అవన్నీ గుర్తుచేసినందుకు మీకు కృతజ్ఞతలు. YVR గారన్నట్టు మీకు మీరే సాటి ఏ విషయాన్నయినా విడమరచి చెప్పటంలో.

    మెచ్చుకోండి

  19. బోనగిరి గారు , సాగర సంగమం 22 సార్లు చూసినా మీరన్న కవిత బిర్లా టెంపుల్ దగ్గర చదినదో, ప్రెస్ సీన్లో చదివిందో ఆ రెండు సీన్లు యూ ట్యూబులో చూసి కన్ఫర్మ్ చేసుకున్నా . బిర్లా గుడి దగ్గర చదివిందే. 😊

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  20. పెద్దన్న లాంటి భాస్కరు
    లుధ్ధతులే … , వంట వార్పులో ఘనులేనా ?
    సుద్దులు వరకేనా ? ఓ
    ముద్దయినన్’ కందకూర ‘ భోజన మిడరా ?

    మామి ‘కంద’ రుచులు మరి మరి తిని తిని
    కంద మీద మాకు కసటు గలిగె
    కంద బచ్చలైన కడుపు నిండ తినిన
    కంద మీద నున్న కసటు వోవు .

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

వ్యాఖ్యలను మూసివేసారు.