శర్మ కాలక్షేపంకబుర్లు-sixth letter O square L

sixth letter O square L

అవి స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజులు. తెల్లదొరల స్థానాల్లో నల్లదొరలు, పరిపాలకులుగా, అధికారులుగా కుదురు కుంటున్న కాలం. కొత్తగా అధికారులుగా కుదురు కుంటున్న నల్లదొరలలో రిటయిర్డ్ మిలిటరీ ఆఫీసర్లు కూడా ఉండేవారు. కోస్తా జిల్లాలలో ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసూ. తనిఖీ కొస్తున్నట్టు తంతి వార్త, ఆఫీస్ సిద్ధమైయింది. చిన్నదొర ఎదురెళ్ళి స్టేషన్ నుంచి పెద్ద దొరని తీసుకొచ్చాడు. మిలిటరీ ఆచారం ప్రకారంగా పెద్ద దొరొచ్చేటప్పటికి అందరూ వరుసలలో నిలబడి పెద్దదొరకి స్వాగతం చెబుతుండగా చిన్న దొర సిబ్బందిని పెద్దదొరకి పరిచయాలు చేస్తూ వచ్చాడు.

ఆఫీస్ తనిఖీ మొదలయింది, కొత్తగా వచ్చిన ఓ కుర్రగుమాస్తాకి పెద్ద దొరకి వాదన మొదలయింది, తనిఖీ రెండవరోజు. పెద్దదొర కుర్ర గుమాస్తా చెప్పినదంతా విని చివరికి ‘It seems you are a fool’ అనేశాడు. ఒక్క క్షణం ఆఫీస్ సూదిపడితే వినపడేటంత నిశ్శబ్దం అయిపోయింది. కొద్ది క్షణాల తరవాత, ఆఫీస్ వారంతా తేరుకుని ఎవరిపనిలో వాళ్ళు పడిపోయారు, పెద్దదొర మరో పనిలో పడ్డాడు. కాని, కుర్రగుమాస్తా ఉడికిపోయాడు,ఏం చెయ్యలేడు. ఎదుటివాడు పెద్ద ఆఫీసరు, ఓపిక పట్టేడు..

చివరిరోజైన మూడో రోజు పెద్దదొర వీడ్కోలు సందేశమిచ్చి, వరుసలో నిలబడ్డ ఒక్కొకరితో చేతులు కలుపుతూ వస్తున్నాడు. కుర్ర గుమాస్తా దగ్గరకొచ్చేటప్పటికి, కుర్ర గుమాస్తా ‘I refuse to shake hands with a fool’ అనేశాడు. ఒక్క సారి మళ్ళీ అంతా నిశ్శబ్దం, పెద్దదొర తేరుకుని ముందుకెళిపోయి, కారెక్కేసేడు.

అంతా చూస్తూ ఉన్న చిన్నదొర పిసుక్కుంటున్నాడు, పరుగున పెద్దదొర ఎక్కిన కార్ దగ్గర నిలబడి, కుర్ర గుమాస్తాపై ఏం చర్య తీసుకోమంటారని అడిగాడు, వినయంగా. పెద్దదొర చిరునవ్వు నవ్వి You are a sixth letter O square L అనేసి వెళిపోయాడు.

మా సీనియర్లు చెప్పుకునే ఆఫీస్ కతల్లో ఇదోహటి.