శర్మ కాలక్షేపంకబుర్లు-త్రయోదశి

త్రయోదశి

    త్రయోదశి,థర్టీన్, పదమూడు అన్నీ పది+ మూడు అనే అర్ధం. తెలుగులో పదులస్థానం ముందు చెప్పి ఒకట్ల స్థానం తరవాత చెబుతాం, మరి ఇంగ్లీషులో ఈ ఒక్క ’టీన్లు’ తప్పించి మిగిలినవన్నీ పదుల స్థానం ముందు చెబుతాం. ఈ టీన్లు మాత్రం ఒకట్ల స్థానం ముందు చెబుతాం. మరైతే సంస్కృతంలో అంతటా ఒకట్ల స్థానం ముందు చెప్పి తరవాతే పదుల స్థానం చెబుతాం, ఎలాగంటే త్రయోదశి,అష్టాదశి అంటే మూడు తో పది, ఎనిమిదితో పది కలిగినదీ అనర్ధం. మరోమాట అష్టోత్తర శతం అంటే ఎనిమిదికి ఉత్తరంగా నూరు కలిగినది నూటెనిమిదని కదా! ఈ ఉత్తరమేంటని తమ అనుమానం కదా! ’అంకానాం వామతో గతిః’ అన్నది సంస్కృతపుమాట, అంటే అంకెలు ఎడమవైపుకు పెరుగుతాయన్నదే అది. అంకెలు ఎడమనుంచి కుడికి వేసి, కుడినుంచి ఎడమకు లెక్కించి, ఎడమనుంచి కుడికి పలుకుతాం. మరి సంస్కృతంలో కుడినుంచి అనగా ఒకట్ల స్థానం నుంచి అష్టోత్తర శతమని ఎందుకంటాం అని కదూ! ఉత్తరమెందుకంటారనేగా అనుమానం.

తూర్పుకి తిరిగి దణ్ణం పెట్టండి, ఏమండోయ్! ఎదో చెబుతున్నారనుకుంటే ఇలా…. కాదండి బాబు నిజం తూర్పుకి తిరిగి దణ్ణం పెట్టేరా? చేతులు బార్లాచాపండి, కుడి వైపు చూడండి ఏదిక్కదీ, దక్షిణం కదా? అలాగే ఎడమవైపు చూడండి అదేదిక్కూ ఉత్తరం కదా! ఇప్పుడు ఉత్తరం అంటే ఎడమ వైపని అర్ధం కదా! అందుకుగాను అష్టోత్తర శతం అంటే ఎనిమిది కి ఉత్తరంగా అనగా ఎడమ వైపున వంద కలదీ నూటెనిమిది. ఏంటిదీ పదమూడు చెబుతానని ఇలా దారి తప్పేరంటారా? నిజమే ఈ మధ్య అన్నిటా దారి తప్పిపోతూనే ఉందండి. దారిలో కొద్దాం. ..

అప్రాచ్యులకి పదమూడంటే భయం వరుసగా అంకెల్లో కూడా వేయరట పన్నెండు తరవాత పన్నెండు (అ) అంటారట, ఇంతకీ వీరికింత భయమెందుకంటే, ఏసు చివరివిందులో పదమూడు మందితో కలిసి భోంచేశారట! అందులో ఒకడు ఏసుని పట్టించాడట. ఇదేమండి అప్రాచ్యులని తిడతారా అనడుగుతారా! అప్రాచ్యులంటే తిట్టు కాదండీ న+ప్రాచ్యులు=అప్రాచ్యులు అనగా తూర్పు దిశకు సంబంధించినావారు కాదు, అనగా పశ్చిమదేశీయులు అని అర్ధమండీ! అప్రాచ్యులకి మూఢనమ్మకాలు లేవుగాని పదమూడంటే భయమే అలాగే మనకీ పదమూడంటే కొన్ని నియమాలున్నాయి, చూదాం…పంచాంగం అంటే ఐదు అంగములు కలిగినది ఏమవి? తొథి,వారం,నక్షత్రం, యోగం,కరణమనేవే ఆ ఐదూ!
ఇందులో తిథీ వారం కలిస్తే వచ్చే మొత్తం కనక పదమూడు ఐతే అది దగ్ధ యోగం అన్నారు మనవారు. ఆ దగ్ధ యోగాలున్నవేవీ?

షష్టీ 6+7శనివారం
సప్తమీ7+6 శుక్రవారం
అష్టమీ8+5 గురువారం
నవమీ9+4 బుధవారం
దశమీ10+3 మంగళవారం
ఏకాదశీ11+2 సోమవారం
ద్వాదశీ12+1 ఆదివారం

ఈ రోజుల్లో ఏ పని మొదలుపెట్టినా జరగదని భావం. అదేంటీ శశిరేఖా వివాహం దగ్ధయోగంలో కదూ జరిగిందంటారా? నిజమే! మాయా శశిరేఖా వివాహం మొదట్లోనే సంధికొట్టేసింది!  మరి ఇదంతా దగ్ధయోగం కాదూ 🙂

నిజమెంతో గాని చవితి ప్రయాణాని ఫలితం మరణం అంటారు, షష్టి నాడు మొదలెట్టిన పని కలహంతో ముగుస్తుందిట. అష్టమినాటి పని కష్టాన్ని మిగులుస్తుంది, నవమినాటి పని వ్యప్రయాసలకే కారణం అంటారు. చిత్రం త్రయోదశినాటి పని దిగ్విజయంగా ముగుస్తుందట. పదమూడు వర్జించవలసిందికాదు, రెండు కలిస్తే పదమూడు వర్జనీయమే !

చవితి,షష్టి,అష్టమి,నవమి,
ద్వాదశి తథులను వదిలేస్తాం గనక వీటితో వచ్చే దగ్ధయోగాలను పట్టించుకోం. ఇక దశమి మంగళవారం,ఏకాదశి సోమవారాలే మనల్ని ఇబ్బంది పెట్టేవి.తిధివారాలు కలిసి దోషప్రదమైన దగ్ధయోగాన్నిస్తాయి. నిత్యమూ చేసే పనులకి పంచాంగం చూడక్కరలేదంటారు,పెద్దలు.

పంచాంగాన్నే నమ్మం అంటే ఎదీ మనల్ని ఏమీ చెయ్యలేదు.

13 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-త్రయోదశి

  1. త్రయోదశి కథల్ గను! మన తాతగారి ప
    ల్కు యోచనల గాను బుళుబుళుక్కులాడెనే!
    వయోజనుల పల్కులకు సవాలు వేయుమా
    ప్రయోజనములేని కతల పంచనేలయా 🙂

    బ్రేవ్ (తెలుగు బ్రేవ్ :))

    నారదాయ నమః

    జిలేబి

    మెచ్చుకోండి

  2. విన్నకోట నరసింహారావుగారు,

    నిత్య కర్మలకి తిథివారం వర్జ్యం శంక లేదండి. ఈ యోగాలు వగైరా అన్నీ ముహూర్తం పెట్టేటప్పుడు చూసేవే! మంగళవారం శంక చిత్రం. ఇంతకు మించిన చిత్రం చూడమని చేతికిస్తే శుక్రవారమని ఇంట్లో పెట్టుకుందని నానుడి కదా 🙂
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  3. ఫణీన్ద్ర పురాణపణ్డగారు,
    ఆరున్నొక్కటి అనడానికి కారణం అదే శబ్దం రోదనని కూడా సూచన చేయడంతో ఆరున్నొక్కటి అంటారు.నమ్మకం ఏం లేదండీ.
    పదమూడు రాయడానికి సంఖ్య దేనికైనా ఇవ్వడానికి భయపడతారండి. 🙂
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  4. విన్నకోట నరసింహారావుగారు,
    మాట ఉచ్చరించడానికే భయపడతారట. ఎవరినమ్మకాలు వారివేగాని ఇతరౌలను మీవి మూఢ నమ్మకాలనడమే వింత 🙂
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  5. పదమూడవ తేదీ యన
    గ దమ్ములున్ బోవగాను గజగజ వణికా
    రు దహనుడనుకొనుచు ఫిరం
    గి దేశపు జనులు జిలేబి గిర్రలు బోవన్ !

    జిలేబి

    మెచ్చుకోండి

  6. మీ ఈ టపా ప్రధానంగా 13 మీదే గానీ మంగళవారం గురించొక మాట చెబుదామనిపించింది.

    ఎవరి నమ్మకాలు వారివి అన్నది నిజమే గానీండి, మంగళవారంనాడు ఏ పనిని ప్రారంభించని వారు కొంతమంది నాకు తెలుసు (క్షవరం చేయించుకోకపోవడం ఒకటే కాదు నేను చెప్పేది. ఎల్లాగూ ఆ రోజున క్షౌరశాలలు తెరవరు, అది వేరే సంగతి). మీ టపాలో చెప్పినట్లు మంగళవారం దశమి కాకపోయినా సరే ఏ మంగళవారం నాడూ కొత్తగా దేనికీ పూనుకోరు అటువంటివారు.

    దీంట్లో లాజిక్ ఏవిటో నాకైతే బోధపడడం లేదు. అడిగితే సింపుల్‌గా “మంగళవారం నాడు ఎలా మొదలెడతామండీ?” అని మాత్రం అనేసి ఊరుకుండిపోతారు.

    ఈ “నమ్మకం” వెనక ఏదైనా ఆధారం ఉందేమో మీకు తెలిస్తే కాస్త చెబుతారా?

    మెచ్చుకోండి

  7. “అప్రాచ్యులు” కొందరికి పదమూడు అంకే కాక శుక్రవారం అంటే కూడా భయమే శర్మ గారూ (ఏసుక్రీస్తుని శిలువ వేసింది శుక్రవారం అనేదొక కారణం కావచ్చు). ఇక పదమూడో తారీకు శుక్రవారం నాడు పడిందంటే గజగజే.

    13 అంకెకి సంబంధించినంత వరకు చాలాచోట్ల (మచ్చుకి – లిఫ్ట్‌లో ఫ్లోర్ నెంబర్లు, హోటల్లో రూం నెంబర్లు, కొన్ని ఎయిర్‌లైన్స్‌లో సీట్ నెంబర్లు) వారు పన్నెండు తరవాత సరాసరి 14 కి వెళ్ళిపోతారట.

    ఏవిటో, ఎవరి నమ్మకాలు వారివి..

    మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.