శర్మ కాలక్షేపంకబుర్లు-చావా చావడు-మంచమూ ఇవ్వడు.

చావా చావడు-మంచమూ ఇవ్వడు.

     చావనూ చావడు మంచమూ ఇవ్వడని ఒక నానుడి చెబుతారు. ఒక చిన్న కత.

ఒక లేని కుటుంబం, పెద్ద కుటుంబం. ఉన్నదొకటే మంచం. పెద్దవయసున్న ఇంటిపెద్ద పడుకుంటాడు దాని మీద, మిగిలిన అందరికి నేలే గతి. ఇలా జరుగుతుండగా ఆ ఇంటికోడలు ప్రసవించింది, చిన్న పిల్లవాడితో కింద పడుకుంటోంది, చలి కాలం బాధ పడుతోంది. ఇక ఇంటి పెద్దది వచ్చే ప్రాణం పోయే ప్రాణం లాగా ఉండటం తో మంచం మీంచి దించుతున్నారు, పోతాడేమోనని. కొంతకాలం తరవాత మళ్ళీ కుదుటపడితే మంచం మీదకి చేరుస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? మంచం మీద చనిపోకూడదనేది ఒక నమ్మకం. అందుకు ప్రాణం గుటుకు,గుటుకూ మంటుంటే కిందకి దింపేస్తున్నారనమాట. ఇలా జరుగుతుంటే, మంచం పురటాలికి ఎలా వేస్తారు? ఇలా చస్తాడనుకుని మంచం దింపేస్తే బతుకుతున్నాడు, బతుకుతాడని మంచం మీద ఉంచేస్తే చస్తాడేమోనని భయం. మంచం మీద ముసలాడు చస్తే ఊళ్ళోవాళ్ళు ఆడిపోసుకుంటారని భయం..ఏదో ఒకటవుతుందిలే అని కిందుంచేస్తే ”ఒరే బతికుండగానే చలికి చంపేస్తార్రా” అని లోకులంటారేమోనని భయం. అంచేత ప్రాణం గుతుకూ గుటుకూమంటే మంచం దింపుతున్నారు, బాగుంటే మంచం ఎక్కిస్తున్నారు. పోతే మంచం పురటాలికి వేసెయ్యచ్చు నిశ్చింతగా, చావా చావడు మంచమూ ఇవ్వడని, మంచం అలాగే ఉంటోంది,వాడుక తక్కువై. ఇదీ చావా చావడు మంచమూ ఇవ్వని కత… ఇదెప్పుడెందుకూ? … ఇదీ అసలు కత.

పండగొస్తోందంటే అదే పెద్ద పండగొస్తోందంటే మా నెట్ కి ఇలాటి పరిస్థితే వస్తుంది. అదేమని కదా మీ అనుమానం. పండగకి జాతరలు,సంబరాలు చేస్తారు,పల్లెలలో. దానికోసం పందిళ్ళూ వేస్తారు,అలంకరణా చేస్తారు. ఇలా రోడ్ల మీద పందిళ్ళు వేయడానికి రాట(గుంజ)లు పాతుతారు, చాలా లోతుగా. ఈ నెట్ కేబుల్ చాలా లోతులోనే ఉంటుంది, కాని అది కూడా పాడయ్యేటంత లోతుకి పాతుతారీ గుంజలు. ఇక చెప్పేదేమి? మా వాళ్ళు పొలో మని పోతారు,వెతుక్కుంటూ. ఏ గుంజ కేబుల్ ని పాడుచేసిందో కనుక్కుంటారు. గుంజ తీసేస్తే పల్లెటూరివాళ్ళు తాట తీస్తారు. మరెలా? ఏం చేస్తారు? వాళ్ళని ఒప్పించి గుంజ తీసి గొయ్యి తీసి గబగబా కేబుల్ అతికించి మళ్ళీ గొయ్యి పూడ్చేస్తారు. ఇది ఓ.ఫ్.సి కేబుల్ కదా కొన్ని ఇబ్బందులుంటాయి. పూర్తిగా నెట్ పోదు అలాగని పనీ చెయ్యదు, వచ్చే ప్రాణం పోయే ప్రాణం లా కొట్టుకుంటూ ఉంటుందన మాట. పోయిందని కంప్యూటర్ కట్టేస్తే నెట్ పని చేస్తున్నట్టు కనపడుతుంది. పన్జేస్తున్నట్టుందే అని నెట్ లోకెళితే పుటుక్కునపోతుంది, అయ్యో అనిపిస్తుంది. సరే కట్టేదామంటే మళ్ళీ వస్తుంది. ఆ బాగున్నట్టుందనుకుంటే కామెంటో, టపాయో వేసేలోగా మళ్ళీ గుటుక్కుమంటుంది. ఈ లోగా మేమేం తక్కువ తిన్నామని కరంట్ వారు పావుగంటకో సారి గుటుక్కు మనిపిస్తున్నారు…. ఇలా వస్తూ పోతూ మా పండగ కాస్తా గడచిపోతుంది. మరి కొన్ని పన్జేస్తాయే! అవును, బేంక్ లు కేబుల్ టి.వి ఇలా ముఖ్యమైనవాటికి ప్రయారిటీ ఉంటుంది, సామాన్యులది వెనకబెంచీయే ఎప్పుడూ! పండగైపోయిన తరవాత పందిరి తీసిన తరవాత దీన్ని సరి చేస్తారు, అంత దాకా ఇంతే! ప్రతి సంవత్సరం జరిగేదే కదా! అంటే ఎంతమందికి చెప్పగలమండి? మీకు మాత్రం తెలీదూ? అంటారు మావాళ్ళు, ఇదింతే! రెండు రోజుల్నుంచి జరుగుతున్న కత, అదనమాట… మేరా భారత్ మహాన్.