శర్మ కాలక్షేపంకబుర్లు-బతికి చెడ్డవాడు.

బతికి చెడ్డవాడు.

బతికి చెడడం,చెడి బతకడం అంటుంటారు,వీటికి అర్ధం జయంతికి వర్ధంతికి ఉన్నంత తేడా ఉంది 🙂

ఇది ఏభై ఏళ్ళకితం జరిగిన సంఘటన.

ఉద్యోగం రావడంతో స్వంత ఊరునుంచి మకాం ఎత్తేసిన తరవాత పొలం వెళ్ళాలంటే అడ్డదోవన వెళ్ళి వచ్చేయడం జరుగుతోంది, ఊళ్ళో కి వెళ్ళకపోవడం తో సంగతులూ తెలియడం తగ్గింది. మా వూరు మీంచి కొత్తగా బస్సు వేశారంటే బస్సు మీద బయలుదేరా. బస్సు ఊరి సెంటర్ లో దిగుతుంటే ఒకతను పలకరించాడు, ”బావగారు బాగున్నావా” అంటూ, ముద్ద మాటతో. చూస్తిని కదా ఆ పలకరించిన వ్యక్తి తల గూళ్ళబుట్టలాగా,గెడ్డం పిచిక గూడులాగా బాగా పెరిగి, చిరిగిన చొక్కా,ఒక తువ్వాలు గోచీతో, కుడిచెయ్యి,కాలు ఈడుస్తూ నడుస్తున్నట్టుంటే, ఎడమచేతిలో కర్ర, చేతిలో సంచితో, అడుక్కునేవాడిలాగా అనిపించాడు. గుర్తు పట్టలేకపోయా! ”నేను బావా కాఫీ హొటల్ వెంకట్రావుని” అనడం తో గుర్తుపట్టి,ఆశ్చర్యపోతూ, ”ఏంటి ఇలా అయ్యావు” అన్నా! అలా రెండడుగులు నెమ్మదిగా వేసి పక్కనే ఉన్న సీను కిల్లీ కొట్టు,చిట్టిపంతులుగారి సైకిల్ షాపు, సూర్నారాయణ బియ్యంకొట్టు ఉన్న అరుగు దగ్గరకి చేరాను. వెంకట్రావు కూడా వచ్చి మెట్ల మీద కూలబడ్డాడు. అతనేదో చెబుతున్నాడుగాని నాకర్ధం కాలేదు.

ఇది చూసిన బియ్యం కొట్టు సూర్నారాయణ కలగజేసుకుని, ”మీరు ఊర్నుంచెళ్ళేకా చాలానే జరిగేయి. ఇతనికి ఆ అలవాటుందని కదా, ఇతని పొలం నాలుగెకరాలూ, ఇల్లూ పెళ్ళాం పేరున రాయించారు. హోటల్ నడుపుతుండేవాడు, లాభాల్లోనే నడిచింది,ఇతని కున్న అలవాటుతో కడుపులో నొప్పికి ఆపరేషన్ చెయ్యలిసొచ్చింది. చేసేవాళ్ళు లేక హోటల్ మూతబడింది, కొన్నాళ్ళు ఇతని భార్య కొడుకు నడిపినా, కుదరలేదు, వాళ్ళవల్ల కాలేదు. ఉన్న డబ్బు అయిపోయింది, ఇంతలో కొడుక్కి పెళ్ళి చేసేరు, ఇతని వైద్యానికి సొమ్ము కావలిసొచ్చింది. పులి మీద పుట్రలా ఇతనికి పక్షవాతం వచ్చి కుడికాలు చెయ్యి పడిపోయాయి, మాటా పడిపోయింది. ఆ తరవాత కొద్దిగా మార్పొచ్చి ఇలా ముద్దగా మాటాడతాడు. ఇంట్లో ఏదో గొడవ జరిగింది, ఇతని భార్య,కొడుకు,కోడలు ఇతన్ని ఇంట్లోంచి గెంటేసి ఇల్లమ్మేసి,డబ్బుచ్చుకుని మరో ఊరు దూరంగా పోయారు,చెయ్యి కాలు పూర్తిగా స్వాధీనంలో కి రాలేదు. ఇతన్ని చూసేవాళ్ళూ లేరు. ఊరంతా ఇతనికి కావలసిన వాళ్ళే కాని ఒక పూట ముద్ద పెట్టేవాళ్ళు లేరు”,అన్నాడు.

వెంకట్రావు సంచిలో లావుపాటి అరఠావు మడత పెట్టి కుట్టిన తోక పుస్తకం కనపడింది. అది పద్దు పుస్తకం,చాలా కాలం నేను వారానికోసారి అందరి కాతాలూ కూడి, బాకీలు తేల్చిన పుస్తకం, అతనికి సాయంగా. ఆ రోజుల్లో అందరికి ఇతని హొటల్లో కాతా ఉండేది, రోజువారీ టిఫిన్ చేసినవాళ్ళు కాతా పుస్తకంలో రాసిపోయేవారు. వారానికోసారి ఇచ్చేవాళ్ళు,నెలకోసారి ఇచ్చేవాళ్ళు, వీలుని బట్టి ఇచ్చేవాళ్ళు, సంవత్సరానికోసారి బాకీ తీర్చేవాళ్ళూ ఉండేవారు.

వెంకటరావు ఆ పుస్తకం తీసిన తరవాత సూర్నారాయణ అందుకుని ”ఈ కాతా పుస్తకం ఆస్తిగా బయట పడ్డాడు. నాకు ఈ పుస్తకమిచ్చి పద్దులు చూడమంటే ఇచ్చేసిన పద్దులు సున్నా చుడుతూ, మిగిలినవాటిని సరి చూసి ఇచ్చా! దీన్ని పుచ్చుకుని తిరిగుతింటాడు,బాకీల కోసం, చాలా బాకేలే ఉన్నాయి. బాకీ చెల్లేసిన వాడు లేడు. ఇతనికి ఎవరేనా ఒక ముద్ద పెడితే కలదు,లేకపోతే లేదు. ఈ సంచితో అలాగే ఎక్కడో ఒక అరుగుమీద పడుకుంటాడు” అని చెప్పి ముగించాడు.

నాకైతే కడుపులో దేవినట్టే అయింది, ఎలా బతికినవాడు, ఎలా అయిపోయాడని. పుస్తకం చేతిలోకి తీసుకుని పేజీలు తిరగేస్తున్నా! బాకీ చెల్లు వేసిన కాతాలు సున్నాలు చుట్టి ఉన్నాయి. రావలసిన కాతాల్లో సొమ్ము రావలసిందీ కనపడుతోంది. అలా చూస్తుండగా నా కాతా పేజి కనపడింది. అది సున్నా చుట్టి ఉంది. ఒక సారి కూడిక మళ్ళీ చేశా! ఐదు రూపాయలు తీసి వెంకట్రావు చేతిలో పెట్టి నా కాతాలో కూడిక తప్పు,నీకు ఐదు బాకీ ఉన్నా అని అతని చేతిలో డబ్బులు పెట్టి,వెను తిరిగి చూడక పరుగులాటి నడకతో వెళిపోయా!

7 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బతికి చెడ్డవాడు.

  1. విన్నకోట నరసింహారావుగారు,

    ఏసిడిటీ వలన కలిగే నొప్పికి సోడా బై కార్బ్ తత్ క్షణం మందేనండి, కాని దీనిని ఎక్కువగా ఉపయోగించకూడదు. అతను రోజూ వాడేవాడు. ఈ సోడా బై కార్బ్ ను వంటలలో వాడుతారు, పూరీ పిండిలో వేసి కలిపి పూరీలు వేసుకుంటే బాగా పొంగుతాయండి. 🙂

    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  2. వివరణిచ్చినందుకు ధన్యవాదాలు శర్మ గారు.
    “తినేసోడా” అంటే సోడియం బైకార్బొనేట్ / బేకింగ్ సోడా యే కదండి? దీన్ని డైరెక్ట్ గా తింటారు కూడానా? హోటళ్ళల్లో అన్నంలో కలుపుతారని అనేవారు. ఆ అన్నం తింటే కడుపుబ్బుతుందంటారు. దాని లక్షణం అదయినప్పుడు కడుపునెప్పి తగ్గిస్తుందనుకుని దాన్ని తినడం, పైగా అది అలవాటుగా మారడం ఆశ్చర్యంగా ఉంది.
    ఎవరి బలహీనతలు వారివి అనుకోవడమే.

    మెచ్చుకోండి

  3. విన్నకోట నరసింహారావుగారు,

    బతికి చెడ్డవాడికి సిగ్గు అభిమానం ఉంటాయికదండి, చెడి బతికినవాడికి సిగ్గూ లేదు అభిమానమూ లేదు.

    ఆ రోజుల్లో మద్య నిషేధం అమలు లో ఉండేదండి. ప్రతి ఊళ్ళోనూ సారా బట్టీలు మాత్రం ఉండేవండి. ఇతనా కాపుసారా తాగేసేవాడు, కష్టపడి పని చేసేవాడు. దానికి తోడు కడుపు నెప్పికి తినేసోడా రోజూ తినేవాడు, దాంతో బాధ ఎక్కువైనట్టు ఉంది.

    స్వయంకృతంతో అన్నీ కలిసొచ్చినట్టే ఉన్నాయండి,ఇతని పట్ల. మామూలుగా ఇస్తే ఎలాగు తీసుకోడు, అందుకు కూడిక తప్పని డబ్బు అతని చేతులో పెట్టేనండి, అతని బాధ చూడలేక.
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  4. Watch More Youtube Tutorial videos from Digital Vamshi
    YouTube Tutorials In Telugu for Beginners
    1. How to Create a YouTube Channel In telugu

    2. How to Enable Custom Thumbnail Option On YouTube In Telugu

    3. How to Create a YouTube Thubnail Without Photoshop

    4.Ways to find YouTube Channel Owner Details

    5.How to get Free Website And Hosting In Telugu By digital Vamshi

    6.Best Screen recorder For Android Mobile — Youtubers In Telugu

    7.video editing software wondershare filmora tricks in telugu

    8. How to get subscribers on youtube fast in Telugu

    9. how to create a youtube intro in telugu || Youtube Training in Telugu

    10.how to find without copyright music for youtube in telugu

    11.how to add end screen on your youtube videos in telugu

    12.how to change Youtube currency Us dollers to Indian Rupees 2018

    13.How To Collaborate On YouTube in Telugu 2018 || YouTube Training in Telugu

    14. youtube monetization process in telugu || Youtube Tutorials in telugu

    15. how to find copyright free images in telugu || Youtube Tutorials in telugu

    16. How yo make more money from Youtube In Telugu

    17. How To Enable Video Credit Option In Your YouTube Channel || in telugu by digital vamshi

    18. how to setup YouTube Commment Settings in Telugu

    19. what is default Uploads on YouTube In Telugu

    20. how to create a YouTube Channel ads in telugu

    21. how to change YouTube channel name in Telugu || By digital Vamshi

    22. whats is copyright strike how to remove it

    23. How can see my YouTube Channel Subscribers List in Telugu

    24. how to ad water mark on Your YouTube Videos in telugu

    25. what is video manager feature in YouTube in Telugu

    26. What is Playlist on YouTube in telugu

    27. what is dashboard optionon Youtube in telugu

    28.What is Youtube Creator Studio On Telugu

    మెచ్చుకోండి

  5. // “……… వీటికి అర్ధం జయంతికి వర్ధంతికి ఉన్నంత తేడా ఉంది 🙂” //

    😀😀😀
    ===========

    బతికి చెడడం కొంతమంది విషయంలో స్వయంకృతాపరాధం, మరికొంతమంది విషయంలో పరిస్థితుల ప్రభావం. ఇక్కడ వెంకట్రావు చితికిపోవడం మొదటి వర్గానికి చెందుతుందనిపిస్తోంది. మొదటిరకంవల్ల ఆ వ్యక్తి కుటుంబం ఎక్కువ కష్టాలు పడాల్సి వస్తుంది – చాలా కేసుల్లో.

    చివరలో మీరు అతని చేతిలో కాస్త డబ్బు పెట్టడానికై మీ కాతా లెక్కలో తప్పుందనే వంక పెట్టారని తెలుస్తోందిలెండి. మీరు చేసినది మంచి పని అనడానికి మాత్రం సందేహమేమీ లేదు.

    అవును శర్మ గారూ, “ఆ అలవాటు” అంటే ఏ అలవాటు? (చెడు) అలవాట్లు అనేకం కదా. “ఇతని కున్న అలవాటుతో కడుపులో నొప్పికి ఆపరేషన్ చెయ్యలిసొచ్చింది“ అని బియ్యం కొట్టు సూర్నారాయణ అన్నాడన్నారు కదా పైన, దాన్ని బట్టి ఏదైనా మాదకద్రవ్యాలకి సంబంధించిన అలవాటేమో అనిపిస్తోంది. మీకభ్యంతరం లేకపోతేనే వివరించండి.

    మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.