శర్మ కాలక్షేపంకబుర్లు-బస్సులో హరేరామ

బస్సులో హరేరామ

అబ్బో! ఇదెప్పటి మాటా? డెబ్బై ఐదేళ్ళకితం మాటకదూ!

నాకు ఊహ తెలిసిన తరవాత మొదటి సారిగా బస్సెక్కేను అమ్మతో,గోకవరం నుంచి రాజమంద్రి కి. అది బొగ్గుబస్సు, రోజూ చూస్తూనే ఉండేవాళ్ళం గాని లోపలికెక్కెలేదు. బస్సెక్కిన తరవాత పరిశీలించాను. డ్రైవర్ దగ్గర ”దేవుని స్మరింపుము” అని ఎర్ర అక్షరాలతో రాసుంది. ఏంటో అర్ధం కాలేదు. ఆ తరవాత చూస్తే బస్సులో టాప్ కింద మూడు పక్కలా ఇలా రాసుంది. హరేరామ హరేరామ రామరామ హరేహరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. నాకప్పటికున్న ఊహతో ఈ అక్షరాలు కూడబలుక్కుని చదివేను. అమ్మ కొంగు పట్టుకుని తిరగడం అలవాటుగా అందుకు అమ్మ చేసే పనులన్నీ పరిశీలించడం అలవాటయింది. అమ్మ నెమ్మదిగా పని చేసుకుంటూ ఇలా హరేరామ హరేరామ రామరామ హరేహరే హరేకృష్ణ హరేకృష కృష్ణకృష్ణ హరేహరే అంటూ ఉండేది ఎప్పుడూ. అది జ్ఞాపకం వచ్చి అమ్మని అడగబోయాను గాని, మరిచిపోయా మరో హడవుడిలో. బస్సులో ఇలా ఎందుకురాస్తారు అర్ధం కాలేదు. ఇది మనబస్సు కదా అందుకు ఇలా రాసేరేమో అనుకున్నా! ఆ బస్సులో మాకూ వాటా ఉండేది,నాటి రోజుల్లో 🙂

కాలం గడుస్తోంది! రాజమంద్రి నుంచి మామయ్యగారి ఊరికి బస్సెక్కా,అమ్మతోనే! అప్పుడూ ఆ బస్సులోనూ చూశా ఇలా రాసి ఉండడం, ఏంటబ్బా అని అమ్మని అడిగేశా! ఇలా రాస్తారు,ఎందుకో తెలీదు అనేసింది అమ్మ. సమాధానం దొరకలేదు,ప్రశ్న అలాగే ఉండిపోయింది. కాలం గడిచింది, ఒకసారెవరో ఒక పెద్దాయనతో మాటాడుతూ ఉండగా ఈ అనుమానం వెలిబుచ్చా! దానికాయన, ఒక బ్రేక్ ఇనస్పెక్టర్ గారికి ఈ మంత్రం అంటే అమితమైన అభిమానం అందుకు బ్రేక్ సర్టిఫికట్ కావలసిన బస్సులలో ఇలా రాస్తే ఆయన సంతోషించేవాడట, పైస కూడా లంచం తీసుకునేవాడు కాదట. లంచం తీసుకోనందుకుగాను ఆయన చెప్పకనే అందరూ ఇలా హరేరామ హరేరామ రామరామ హరేహరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరే హరే అని రాయించేవారట. ఆ తరవాత కాలంలో ఆర్.టి.సి బస్సులొచ్చాయి, వీటిలో చిల్లర తెచ్చుకోవలెను, జేబుదొంగలున్నారు, చేతులు బయట పెట్టరాదు, వగైరాలు రాసి ఉండేవి. ఇప్పటికి లారీలలో డ్రైవర్ దగ్గర దేవుని స్మరింపుము అని రాస్తూనే ఉన్నారు.

ఇక లారీల వెనక చిన్న కార్ల వెనక రాసేవాటి గురించి చెప్పుకోవాలంటే!

లారీలైతే ’అందగాడివే! నావెనక పడకు’ ’నన్ను చూసి ఏడవకు’ ’దేవుని దీవెన’ ’యేసే రక్షకుడు’ ’నన్నుకాదు! రోడ్డు చూడరా’ ’సోగ్గాడు’ ’సోగ్గాడు సోమరాజు’ ’ఏ ఊరు మనది’ ’ఇంటి దగ్గర చెప్పొచ్చావా?’ ’నా కూడా రాకు’ ’నావెంట పడకు’ ’మందేశావా?’ ’మీదపడకు’ ’దూరంగా నిలబడలేవూ?’ ’పెళ్ళయిందా?’ ఇలా రాయడం అలవాటు, ఎప్పుడయిందో చెప్పలేనుగాని, కొన్ని కొన్ని కళాత్మకంగానూ,సందేశాత్మకంగానూ ఉన్నాయి.

ఇక ౘిన్నకార్లు ఐతే
’ ఓం’ ’అమ్మ దేవెన’ ’యేసే దైవం’ ’ప్రభువే రక్షకుడు’ ’అమ్మ బహుమతి’ ఇలా రాస్తూ వస్తున్నారు. వీటిలో ఎక్కువ మతాన్ని సూచించేవే.

ఎవరిష్టం వారిది

17 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బస్సులో హరేరామ

  1. ఖద్దరు కాలము మాదే
    విద్దెగ బ్లాగుల హరిమయు ఫేస్బుక్కులునూ
    హద్దన్నదిలేదే మా
    పెద్దరికమునకు జిలేబి బెంగ్లూర్కూచీ 🙂

    జిలేబి

    మెచ్చుకోండి

  2. పద్యాన్ని మెచ్చుకున్నాం గానీ, ఖద్దరు కాలానికే పరిమితం జేసేరా మమ్మల్ని 🙂 ఖద్దరు కాలానికీ ముందున్నాం తరవాతా ఉన్నాం, ఎప్పుడూ ఉంటాం 🙂

    మెచ్చుకోండి

  3. అదేమిటి శర్మ గారూ 😕, నేను కూడా “హరేరామ”, :”దేవుని స్మరింపుము” వగైరా రాతల బస్సుల్లో తిరిగిన వాడినేనండి.. ఆర్.టి.సి 1950ల చివర్లో మొదలయినా 1960 వ దశకంలో కూడా కోనసీమలో ప్రైవేట్ బస్ రూట్లుండేవి కదండి

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  4. అమ్మాయ్!
    నిన్న సాయంత్రం వేళ వీధి చివర నిలబడ్డా! వరసగా లారీలు వెళుతున్నాయి,చూస్తూ ఉంటే కొత్త కొత్తవి నినాదాలు కనపడ్డాయి, ”ధనలక్ష్మి,ధాన్యలక్ష్మి”, ”పోసమ్మతల్లి”, ”నిదానమే ప్రధానము”. ఒక లారీ మీద ”శాంతముకన్న సముద్రము చిన్నది” అన్న మాట కనపడింది.
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  5. ఆర్టీసీకి ప్రత్యేకం :
    >స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం, వారి సీట్లలో వారినే కూర్చోనిద్దాం.🙏
    > ప్రజాసేవయే మా కర్తవ్యము. 😆
    >లైట్లు ఆర్పి సెల్ఫ్ కొట్టవలెను.😇

    మెచ్చుకున్నవారు 2 జనాలు

  6. బస్సుల్లో “దేవుని స్మరింపుము” అని వ్రాసేదానికి ఒకాయన (ముళ్ళపూడా??) చెప్పిన భాష్యం – ప్రమాదం జరగకుండా క్షేమంగా బస్సు దిగాలని ప్రార్థించుకోవడం ట 🙂

    మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.