శర్మ కాలక్షేపంకబుర్లు-రోజులు మారాయి-ఏరువాక

రోజులు మారాయి-ఏరువాక

కల్లాకపటం కానని వాడా! లోకం పోకడం తెలియని వాడా!!
ఏరువాక సాగారో రన్నో… చిన్నన్నా నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్నా!!

నవ ధ్యానాలను గంపకెత్తుకొని… చద్ది అన్నము మూట గట్టుకొని
ముల్లు గర్రను చేతబట్టుకొని… ఇల్లాలును నీ వెంటబెట్టుకొని………Iఏరువాక!

పడమట దిక్కున వరద గుడేసె… ఉరుముల మెరుపుల వానలు గురిసె
వాగులు వంకలు ఉరవడి జేసె… ఎండిన బీళ్లూ ఇగుళ్ళు వేసె………..Iఏరువాక!

కోటేరును సరి జూచి పన్నుకో యలపటదాపట ఎడ్ల దోలుకో
సాలు తప్పక పంట వేసుకో విత్తనము లిసిరిసిరి జల్లుకో…..Iఏరువాక!

పొలాలమ్ముకొని పోయేవారు… టౌనులో మేడలు కట్టేవారు
బ్యాంకులో డబ్బును దాచేవారు… నీ శక్తిని గమనించరు వారు…..Iఏరువాక!

పల్లెటూళ్లలో చెల్లని వాళ్లు… పాలిటిక్సుతో బతికే వాళ్లు
ప్రజాసేవయని అరచేవాళ్లు…ప్రజాసేవయని అరచేవాళ్లు… వొళ్లు వంచి చాకిరికి మళ్లరు……Iఏరువాక!

పదవులు స్థిరమని బ్రమిసే వాళ్లే… ఓట్లు గుంజి నిను మరచే వాళ్లే
నీవే దిక్కని వత్తురు పదవోయ్…నీవే దిక్కని వత్తురు పదవోయ్….

రోజులు మారాయ్ రోజులు మారాయ్
మారాయ్.. మారాయ్.. మారాయ్.. రోజులు మారాయ్……Iఏరువాక!

   పాట, జానపద కవి కొసరాజు, రోజులు మారాయి చిత్రం కోసం రాసినది. అరవైఏళ్ళ కితం వ్యవసాయం, నాటి పల్లె మాటలు తో, నాటి రాజకీయ, ఆర్ధిక,సాంఘిక ముఖచిత్రాన్ని టూకీగా కూర్చిన పాట. జిక్కి గానం చేయగా మా రాజమండ్రి అమ్మాయి (నేటి అమ్మమ్మ) వహీదా నర్తించినది. నాటి రోజుల్లో సినిమా తో పాటు కథ, పాటల పుస్తకాలూ అమ్మేవారు, ఖరీదు అణా. పాట కోసం చూశాను,సరైన మాటలున్న సాహిత్యం దొరకలేదు, రాజ్యలక్ష్మి గారినడిగితే వారిబ్లాగ్ లో ఇచ్చారు. వారికి ధన్యవాదాలు.

నేటికీ కల్ల కపటం తెలియనివాళ్ళే వ్యవసాయం చేస్తున్నారు, వీరికి వ్యవసాయమే లోకం, లోకం పోకడ తెలీదు అన్నది, నేటికీ నిజమే. కుళ్ళు,కుచోద్యం ఎక్కువగా అంటనివారు రైతులే, అనుమానం లేదు. ఏ ప్రభుత ఏలినా రైతుకి ఒరిగింది శూన్యం.

ఏఱువాక అన్న పదం ఏఱురాక నుంచి పుట్టిందేమోనని అనుమానం. ఏరు అంటే నాగలి అని వాక అంటే నది,సెలయేరని అర్ధంట. వానొస్తే వరదొస్తదన్నట్టు ఏరొస్తేనే వ్యవసాయం కదా! ఏఱువాకంటే వ్యవసాయం ప్రారంభం, దీని కోసం ఒక రోజు కేటాయించారు,మనవారు. అదే ఆషాఢ శుద్ధ పౌర్ణమి, ఇదేంటీ? ఆషాఢం గీష్మ ఋతువుకదా అని అనుమానం. అవును, గ్రీష్మ ఋతువు చివరికి మిగిలిన పదేనురోజుల ముందు రోజు, తరవాతది వర్ష ఋతువే. ప్రతి ఋతువు చివర పదేను రోజుల్లోనూ ఆ ఋతువు,రాబోయే ఋతువు లక్షణాలు కలిసుంటాయి. అంటే ఈ రోజు నుంచి వర్షము ఎండా కూడా ఉంటాయనమాట. ఈ రోజు మరే శంక లేక ఏరువాక అనగా వ్యవసాయ పనులు మొదలెట్టమన్నారు, చేయమన్నారు. చినుకురాక వ్యవసాయ పనులేముంటాయనికదా! గట్టు లంకలెయ్యడమని ఉంటుంది,అంటే గట్లని పటిష్టం చేసుకోడంతో వ్యవసాయం ప్రారంభమవుతుంది.

ఏరువాక రోజేం చేస్తారో చెప్పేరు కవి. నవధాన్యాలు మూట కడతారు,చద్దెన్నమూ మూట కడతారు, వీటితో పాటు, బెల్లమూ,పెసరపప్పూ, బియ్యంతో వండిన పులగమూ తయారు చేస్తుంది, రైతు భార్య. పసుపు, కుంకుమ తీసుకెళుతుంది. వీటినో గంపలో పెట్టుకుని, నీళ్ళు, పాల తపేలాలో తీసుకుని బయలుదేరుతుంది. ఎలా? ఏడు గజాల చీర, కచ్చపోసి కట్టి, కుడిపైట వేసి (దీన్నే తమిళులు మడికట్టు అంటారు).మామూలు రోజుల్లో ఏడమ పైట వేయడమే మన అలవాటు. ఇక రైతు పంచకట్టి, రెండుపక్కలా జేబులున్న కంటి మెడ బనీను తొడిగి, తలకు పాగా చుట్టి,ఎడ్లను కాడికి పూన్చి, భుజాన నాగలి ఎత్తుకుని చేత ముల్లు గఱ్ఱ (దీని గురించి వేరు టపా ఉంది) పట్టుకుని, బయలుదేరుతాడు. పాలేరు కొత్తవాడు పనిలో ప్రవేశించడం, పాత వారు కొనసాగడం ఈ రోజుతో మొదలు.

చేలో వీలున్నచోట చిన్న మడి చేసి దానిలో నీరు చల్లి, తెచ్చిన నవధాన్యాలు వేసి పసుపు కుంకుమలతో పూజచేసి, తెచ్చిన పులగాన్ని నైవేద్యం పెట్టి, దానిని తీసుకుని మెతుకులుగా విడతీసి తాను వ్యవసాయం చేయబోయే చేను మొత్తంలో ’పొలి”పొలి’ అని కేకలేస్తూ చల్లుతాడు. ఇల్లాలు లేక వ్యవసాయం లేదు, కుటుంబం లేదు,జీవితం లేదు. అది సూచిస్తూ ఏరువాక సాగేటపుడు ఇల్లాలు కూడా ఉండాలన్నారు. ఈ తరవాత నుంచి వ్యవసాయపనులు మొదలు పెడతారు,అదును బట్టి.

పాత కాలపు రైతు ప్రకృతిని నిత్యమూ గమనించేవాడు. సూర్య చంద్రుల చుట్టూ వలయం ఏర్పడుతూ ఉంటుంది,వర్ష కాలంలో, దీన్నే గుడికట్టడం అంటారు, రైతుల పరిభాషలో, అదే వరద గుడంటే. ఇది రైతుకు వర్ష సూచన చేసేది. సూర్య చంద్రులకు దగ్గరగా గుడి కడితే వర్షాలు ఆలస్యంగా పడతాయని, దూరంగా గుడికడితే తొందరలో వానలుపడతాయని సూచన. వర్షాలు పడితే వాగులు,వంకలు పొర్లి ప్రవహిస్తాయి, ఆరోజుకి వ్యవసాయం ఎక్కువగా వర్షాధారమే! చినుకు పడితే భూమి పులకిస్తుంది, పచ్చని చిగురు మొలకెత్తుతుంది.

నేడంతా యంత్ర వ్యవసాయమే,పశువులు పల్లెలలో కూడా కనపడటం లేదు. నాలుకు అరకల వ్యవసాయం, నాలుగు కాళ్ళ వ్యవసాయం అనేవారు అంటే ఎనిమిది ఎద్దులను రైతు కలిగున్నాడని అర్ధం, నాలు కాళ్ళు అంటే (కాడికి బహువచనం కాళ్ళు అనేశారు) నాలుగు అరకల వ్యవసాయమనే అర్ధం.

నాగలికి నాలుగు భాగాలు. ఎడ్లను కట్టేదాన్ని కాడి అంటారు. కాడి నుంచి పొడుగ్గా ఏటవాలుగా ఉండేదాన్ని పోలుగర్ర అంటారు. ఈ పోలుగర్రను నాగలి దుంపలో అమరుస్తారు. నేలను చీల్చే ఇనపకర్రు ఉన్నదానిని నాగలి దుంప అంటారు. పోలుగర్రను ఇందులో ఇమిడ్చి చివరగా మేడిని తగిలింది ఒక చీల వేసారు. ఇంతతో సరిపోలేదు. ఈ నాగలిని కాడిని అనుసంధానం చేసేదే మోకు. మేడి వెనకనుంచి, మేడిని నాగలిదుంపని గట్టిగా పట్టి పోలుగర్రతో ఉంచుతుంది, ఈ మోకు, చివరకు కాడితో అనుసంధానం అవుతుంది. దీన్నే కోటేరు పన్నుకోడం అంటారు, ఇది సరిగా కనక చేసుకోకపోతే నాగలి దుంప ఊడి వస్తుంది,దున్నేటపుడు. ఇక ఎడ్లని ఎలపట,దాపట ఎడ్లు అంటారు. కుడివైపు ఎద్దును ఎలపట ఎద్దు,ఎడమవైపు ఎద్దును దాపట ఎద్దు అంటారు. ఈ ఎడ్లు ఏపక్క కాడికి కట్టే అలవాటుంటే, అటే పని చేసేందుకు కట్టాలి. మార్చి కడితే ఎద్దు పని చెయ్యలేదు. రైతుకు ఈ ఎడ్లలో తేడా తెలిసి ఉంటుంది. ఒక వేళ రైతు మరచినా ఎడ్లని కాడికి పూన్చడానికి తీసుకెళ్ళి వదిలేస్తే తనంత తనే ఏ పక్క పని చేసే ఎద్దు ఆ పక్క చేరిపోతుంది, అదీ విచిత్రం.

ఇక సాలు తప్పకుండా పంట వెయ్యమన్నారు. అదును తప్పిన వ్యవసాయం ఫలించదు. వ్యవసాయానికి కావలసినవి రెండు. ఒకటి అదును అనగా సరైన సమయం, రెండవది పదును అనగా భూమిలో తడి. నిజజీవితంలో కూడా అదును తప్పినదేదీ ఆనందంగా ఉండదు. చదువుకోవలసిన సమయంలో చదువుకోవాలి, సంసార బాధ్యతలు తీసుకోవలసిన సమయంలో వాటిని తీసుకోవాలి, అలాగే అదునుకే పిల్లల్నీ కనాలి, అప్పుడే వారు ముదిమికి బాసటవుతారు.

విత్తనాలు చల్లుకోవడం ఒక కళ. ఇది అందరివల్లా కాదు. విత్తనాల గంప ఎడమ చంకలో ఇరికించి పట్టుకుని, కుడి చేత కొద్దిగా విత్తనాలు తీసుకుని గుప్పిట మూసి, చూపుడు వేలు,బొటన వేళ్ళు మూస్తూ తెరుస్తూ విసురుగా చల్లితే సమానంగా విత్తనాలు చాళ్ళలో పడతాయి. ఒక్కో రైతు జిల్లిన విత్తనాలు వరుసలలో పేర్చినట్టు పడతాయి. అదీ కవిగారి హృదయం.

ఈ పాట మొదటి భాగానే ఇంతయింది,టపా పెరిగింది, మిగిలిన భాగంలో నాటి రాజకీయ,ఆర్ధిక,సాంఘిక స్థితులను చూదాం.

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-రోజులు మారాయి-ఏరువాక

 1. ==

  చప్పట్లు మీకు కరివెద
  గప్పున పట్టిరి పదమును ఘనముగ రమణీ !
  చెప్పితి నే నప్పు డపుడు
  జొప్పించదగును జిలేబి జొళ్ళెము లోనన్ 🙂

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. పాటల పుస్తకాలు కొని దాచడం చాలా మంది చేసేవారండి. ఎప్పుడో పాటల పుస్తకాలు అచ్చెయ్యడం మానేసేరు, ఇప్పుడు డిస్కులు విడుదల చేస్తున్నట్టుంది.

  కోటేరు లాటి ముక్కు,కోటేరేసిన ముక్కు ఈ పదాలన్నీ దీనినుంచి పుట్టినవేనండి. అందమైన కొనతేలిన ముక్కుకి ఆ వర్ణన.

  మెచ్చుకోండి

 3. అద్భుతమైన, అర్థవంతమైన పాట.
  పాటల పుస్తకం – భలే గుర్తు చేశారు ☺. ఆ కాలపు ప్రపంచమే వేరు, అటువంటి ప్రపంచం ఉండేదని ఇప్పటివాళ్ళు ఊహించను కూడా ఊహించలేరు.

  కోటేరుముక్కు అనే మాట ఈ నాగటికోటేరు నుండే వచ్చిందేమో, ఏమంటారు?

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

వ్యాఖ్యలను మూసివేసారు.