శర్మ కాలక్షేపంకబుర్లు-రోజులు మారాయి-పొలాలమ్ముకుని…

రోజులు మారాయి-పొలాలమ్ముకుని…

కల్లాకపటం కానని వాడా! లోకం పోకడం తెలియని వాడా!!
ఏరువాక సాగారో రన్నో… చిన్నన్నా నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్నా!!

నవ ధ్యానాలను గంపకెత్తుకొని… చద్ది అన్నము మూట గట్టుకొని
ముల్లు గర్రను చేతబట్టుకొని… ఇల్లాలును నీ వెంటబెట్టుకొని………Iఏరువాక!

పడమట దిక్కున వరద గుడేసె… ఉరుముల మెరుపుల వానలు గురిసె
వాగులు వంకలు ఉరవడి జేసె… ఎండిన బీళ్లూ ఇగుళ్ళు వేసె………..Iఏరువాక!

కోటేరును సరి జూచి పన్నుకో యలపటదాపట ఎడ్ల దోలుకో
సాలు తప్పక పంట వేసుకో విత్తనము లిసిరిసిరి జల్లుకో…..Iఏరువాక!

పొలాలమ్ముకొని పోయేవారు… టౌనులో మేడలు కట్టేవారు
బ్యాంకులో డబ్బును దాచేవారు… నీ శక్తిని గమనించరు వారు…..Iఏరువాక!

పల్లెటూళ్లలో చెల్లని వాళ్లు… పాలిటిక్సుతో బతికే వాళ్లు
ప్రజాసేవయని అరచేవాళ్లు…ప్రజాసేవయని అరచేవాళ్లు… వొళ్లు వంచి చాకిరికి మళ్లరు……Iఏరువాక!

పదవులు స్థిరమని బ్రమిసే వాళ్లే… ఓట్లు గుంజి నిను మరచే వాళ్లే
నీవే దిక్కని వత్తురు పదవోయ్…నీవే దిక్కని వత్తురు పదవోయ్….

రోజులు మారాయ్ రోజులు మారాయ్
మారాయ్.. మారాయ్.. మారాయ్.. రోజులు మారాయ్……Iఏరువాక!

          మొదటి భాగంలో పల్లెలు వ్యవసాయం చెప్పుకున్నాంకదా! ఈ భాగంలో ఆ నాటి సాంఘిక,రాజకీయ,ఆర్ధిక స్థితిగతులు తడువుదాం, కవిగారి మాటల్లో.

ఈ పాట స్వాతంత్ర్యం వచ్చిన ఎనిమిదేళ్ళకి, ఏస్టేట్ అబాలిషన్ ఏక్ట్ వచ్చిన ఏడేళ్ళకి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ రెండేళ్ళకి రాయబడింది, ఆంధ్రాలో టెనన్సీ ఏక్ట్ రావడానికో సంవత్సరం ముందు కాలం. ఈ సినిమా తీయబడింది. ఎస్టేట్ ఎబాలిషన్ ఏక్ట్ కొంతమందికి ఉపయోగపడింది, కొంతమంది ఎస్టేట్ దారులు కూటికి లేక అడుక్కునే స్థితికి చేరిపోయారు. భూమి కౌలుదారలకు స్వంతమెంతయిందో చెప్పలేను, దళారులు బాగుపడ్డారు. ౧౯౫౨ లో జరిగిన ఎన్నికలలో నాటికి ఏకముక్కగా ఉన్న కమ్యూనిస్ట్ లు మద్రాస్ రాష్టంలో గెలిచినంత పని చేశారు, ఎవరికి మజారిటీ రాలేదు, కాంగ్రెస్ వారు సమయాన్ని ఉపయోగించుకుని అధికారం చేజిక్కించుకున్నారు. దున్నేవానిదే భూమి నినాదం, చిన్న కమతాల వారి గుండెల్లో రైళ్ళు పరిగెట్టించాయి. కౌలుదార్లకి దురాశ పుట్టింది. అప్పటికి పల్లెలలో ఎంతో కొంత ఉన్న సౌమనస్యం పూర్తిగా చెడింది. ఒకరిని చూస్తే మరొకరికి భయం పట్టుకుంది, అనుమానం ఊడలు దిగింది. ఇదిగో ఈ సావకాశాన్ని ఉపయోగించుకుని కొత్త పెత్తందార్లు తయారయ్యారు. కౌలు రైతులకు, చిన్న కమత దారులకు చెప్పేలా చెప్పేరు,భయం పెంచారు, విడదీశారు, పాలించారు. చిన్న కమత దారులు భూములు అమ్మకం మొదలు పెట్టేరు, భయంతో, కౌలు రైతు పట్టుకుపోతాడని. కొంతమంది అమ్ముకోనుకూడా లేకపోయారు, రైతూ బాగుపడలేదు, భూమిదారూ బాగుపడలేదు, ఈ పేరున కొన్ని హత్యలూ జరిగాయి. పల్లెలు నివురుగప్పిన నిప్పులా తయారయ్యాయి, ద్వేషాలు పెరిగాయి. కేస్ లు కోర్టులకెక్కాయి,లాయర్లు బాగు పడ్డారు. సమయం ఉపయోగించుకున్న దళారులు భూముల్ని కొన్నారు, బినామీల పేర. కొంతమంది భూమి పోతుందని పెళ్ళానికి విడాకులిచ్చినట్టు పంపకం చేసి, కాపరాలు చేసి పిల్లలనీ కన్నారు. నాడు రెండు పంటలు పండే, నీటి వసతి ఉన్న భూమి ఖరీదు ఎకరాకు మూడు వేలు. కాని భయాన్ని సాకుగా చూపి ఈ భూముల్ని ఎకరం పదిహేనువందలకే నొక్కేశారు. చచ్చినవాడి పెళ్ళికి వచ్చిందే కట్నమనుకుని కమతదారులు అమ్ముకున్నారు, పట్నం బాట పట్టేరు.

పట్నం బాటపట్టినవారు టవునుల్లో ఇళ్ళు కట్టేరు, అద్దెలకిచ్చేరు. అద్దెల వసూలుకు, అద్దె ఇవ్వక ఖాళీ చెయ్యక ఇబ్బంది పెడుతున్నవారిని దారిలో పెట్టేందుకు, జబ్బ పుష్టి ఉన్న కొత్త రౌడీలు తయారయ్యారు. వీరిని కొన్ని పార్టీలూ ఆదరించాయి, కొత్త పెత్తందారులు తయారయ్యారు, ఇక్కడా. మరికొంతమంది ఈ బాధలు పడలేక పొలాలమ్ముకుని బేంక్ లో సొమ్ము డిపాసిట్ చేసుకున్నారు, చదువుల పేరుతో ఉద్యోగం పేరుతో, ఇక్కడ బతికేందుకు సావాకాశం లేక దేశాన్నే వదలి వలసపోయారు. ఇటువంటి కుటుంబాలను నేను ఎరుగుదును. ఈ వర్గంవారంటే కవిగారికి కొంచం అభిమానం ఉన్నట్టుంది అందుకే ముందు చెప్పేరు. నీ శక్తి గమనించలేకపోతున్నారు రైతన్నా! అని బాధపడ్డారు.

పల్లెలో బతకాలంటే పని చేయడం తెలియాలి,పని చెయ్యాలి, లేదా పెట్టుబడి పెట్టాలి. ఏపనీ చేయనివారు పాలిటిక్స్ పేరుతో బతకడం మొదలెట్టేరు, వీరికి పార్టీలు ఆదరణ కలిగింది, వీరు ఊళ్ళలో కాంట్రాక్టర్లు, పచ్చగడ్డి పాటదారులు,కొలగారం పాటదారులు, కో ఆపరేటివ్ సొసైటీ పరిపాలకులుగా అవతారాలెత్తేరు. వీళ్ళే ప్రజాసేవ అనే కొత్త పదాన్నీ కనిపెట్టేరు, ప్రజల్ని ఊదరకొట్టడం మొదలెట్టేరు. వీళ్ళు ఏ పనీ చేయకనే బతికెయ్యడం మొదలెట్టేరు, వీరంటే కవిగారికి చాలా తేలిక భావమే కనపడింది.

చివరిగా ఆరోజునాటికే అనగా ఒకసారి ఎన్నికలయ్యేటప్పటికే కవిగారు పదవులే స్థిరం అనుకునేవాళ్ళు, ఓట్లు గుంజుకుని మళ్ళీ కనపడకపోయేవారిని ఈసడించారు, నువ్వే దిక్కని వస్తారన్నారు. కాని కవిగారి అంచనా ఇక్కడే దెబ్బతింది. ఓట్లు ఒకరేసేదేంటీ? మా పెట్టెలో మీ ఓటూ అనేవారు, బయట. అప్పటికి ఓటు కాయితం మీద ముద్ర వేయడం లేదు. ఎవరికి వారికి వేరుగా పెట్టెలుండేవి, అందులో అందరి పేరుతో తామే వేసుకునేవారు, పుట్టనివారు,చచ్చినవారితో సహా!

రోజులు మారాయి! రోజులు మారాయన్నారు, అప్పటికి ఇప్పటికి రోజులేం మారలేదు, అవే రోజులు,అవే గంటలూ,నిమిషాలూ,వారాలూన్నూ. సంవత్సరాలే మారిపోతున్నాయి, మనుషుల బుద్ధులు మారిపోయాయి. రైతు దగ్గర కొచ్చేటప్పటికి ఎవరికి చేతులు ముందుకు రావటం లేదు, మోరలు దిగిపోతున్నాయి.

రైతు బాగుపడకుండానే ఉండాలనేదే నాటికి నేటికీ ఆశయం. పెట్టుబడిలేని వ్యవసాయం అంటే మూతి విరుస్తున్నారు. విత్తనాలు మా కంపెనీలోనే కొనాలి,రైతు విత్తనాలు తయారు చేసుకోడానికి వీల్లేదనే వారొకరు. పని చేయడానికి మనుషులు దొరక్కుండా చేసిన ప్రభుత్వం వారు. యంత్రాలు రైతు కొనలేడు, దొరకవు. పశువులతో పని చేయించడం అన్యాయమనే వారు మరికొందరు. ఎరువులు,పురుగుమందులు లేని వ్యవసాయమంటే ఎరువుల ఫేక్టరీలవారికి, పురుగు మందుల కంపెనీలవారికి మంట.

వీటన్నిటికంటే ముందు రైతుకు విచ్చలవిడిగా దొరుకుతున్నది మాత్రం రకరకాల మందు,మత్తు మందులూ. పురుగులు చావటం లేదు, మందుచల్లితే కాని, రైతు తాగితే మాత్రం ఛస్తున్నాడు, ఇదే చిత్రమో!

రోజులు ఇలా మాత్రం మారేయండి! ఇదండి రోజులుమారాయి కత.

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-రోజులు మారాయి-పొలాలమ్ముకుని…

  1. విన్నకోటవారు,

    పొలాలమ్ముకునిపోయేవారు,టవునులో మేడలు కట్టేవారు అన్నమాటలకి వివరణ ఇచ్చానండి. సమాజంలో నాడు జరిన విషయాలు, దళారులు ఎలా బాగుపడ్డారన్నదానికి నిదర్శనం.

    ౧౯౫౭ ఎన్నికల ముందు జరిగిన వాటి నుంచి కమ్యూనిస్టులు మరి కోలుకోలేకపోయారు. అధికారం మాటెలా ఉన్నా కనీస ప్రతి పక్షంగా కూడా లేకుండా పోయారు.

    మీరన్న మరో పాటలో కవిగారు, ఏమవుతుందోనని ఆందోళన వెలిబుచ్చినా దీనికి పరిష్కారమూ చెప్పేసేరండి, ఒక్క మాటలో స్వార్ధమీ అనర్ధ కారణం అని, ఎవరు విన్నారు లెండి, మనకి ఉన్నది వాక్స్వాతంత్ర్యం కదా!
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  2. ఈ పాటలో ప్రతిబింబించే ఆ నాటి దేశపరిస్ధితుల గురించి కవి గారు వ్రాసినదాన్ని (స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దం కూడా కాకుండానే) మీరు చాలా వివరంగా చెప్పారు.

    మరొక పాట “పాడవోయి భారతీయుడా” 1960ల ప్రారంభంలోనే వచ్చిన “వెలుగునీడలు” సినిమాలోనిది. ఆ పాటలో “ఆకాశం అందుకునే ధరలొకవైపు .. అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ .. అవినీతి .. బంధుప్రీతి .. చీకటి బజారూ .. అలముకున్న ఈ దేశం ఎటు దిగజారూ” అనే చరణాలున్నాయి.

    ఇటువంటివి విన్నప్పుడల్లా స్వాతంత్ర్యం వచ్చిన అతి తక్కువ కాలానికే దేశం అలా అయిపోయిందా, స్వాతంత్ర్యాన్ని సరిగ్గా హాండిల్ చెయ్యగలిగామా అనిపిస్తుంటుంది నా మటుకు.

    మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.