శర్మ కాలక్షేపంకబుర్లు-మెరుగు బంగారంబు మ్రింగబోడు

సీII తల్లి గర్భమునుండి ధనము దేడెవ్వడు,
వెళ్ళి పోయెడినాడు వెంటరాదు;
లక్షాధికారైన లవణ మన్నమెకాని,
మెరుగు బంగారంబు మ్రింగబోడు;
విత్తమార్జనజేసి విర్రవీగుటె కాని,
కూడబెట్టిన సొమ్ము గుడువబోడు;
పొందుగా మరుగైన భూమిలోపల బెట్టి,
దానధర్మము లేక దాచి దాచి;
తేII తుదకు దొంగల కిత్తురో ? దొరల కవునొ ?
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు ?
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !

    తల్లి గర్భం నుంచి బయట పడేటప్పుడు డబ్బు మూట కూడా తేడు, పోయేటపుడు నూలుపోగు కూడా తీసుకుపోడు. ఎంత ధనవంతుడైనా అన్నమే తింటాడు తప్పించి బంగారపు కణికలు మింగడు. సొమ్ము సంపాదించి, కూడబెట్టి ఇతరుల మీద సవారీ చేయడం తప్పించి, చచ్చిన తరవాత ఒంటి మీద బట్టకూడా లేకుండానే కాల్చి పారేస్తారు, అప్పటివరకు అయ్యగారని వంగి నమస్కారం పెట్టినవాడే, కర్రతో పొడిచి పొడిచి కాల్చి పారేస్తాడు, చితి మీద. కూడా ఏం రాదు. సొమ్ము సంపాదించి భూమిలో గొయ్యితీసి పాతేస్తారు, తాము అనుభవించరు, మరొకరికి దానమూ చెయ్యరు. పాత కాలపు దాపరికాలెలా ఉండేవంటే, పడుకునే మంచం తలదిక్కున మంచానికే ఉన్న పెట్టెలో దొంగ అరలో దాచేవారు. మరికొందరు, మంచం దిగే దగ్గర కాళ్ళ వైపు గొయ్యితీసి అందులో పాతేసి, పైన అలికేవారు, మిగతా నేలతో సహా! పడుకునే మంచం నాలుగు కోళ్ళ కిందా గొయ్యి తీసి పాతేసేవారు, మంచం కదిలించేవారు కాదు. గోడలో పాతేసేవారు. దేవుని మందిరం కింద గోతిలో కప్పెట్టేవారు. ఇలా పోగేసిన సొమ్ము దొంగలు బలవంతంగా గుంజుకుపోవచ్చు, లేదా ప్రభుత్వమే కొల్లగొట్టేయచ్చు. తేనెటీగలు ఎంతో కష్టపడి తేనెను సంగ్రహించి నిలవచేసి మానవులకిస్తాయి, వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలుసా? కింద మంట పెట్టి ఈగలను పట్టునుంచి తరిమేసి తేనె పిండుకుంటారు, అలా కుదరకపోతే కాల్చేస్తారు.. ఇలా ఎందుకు మానవులు సొమ్ము పోగుచేయడానికి కష్టపడతారో అంటారు, శేషప్ప కవి.

ఈ మధ్య కొంతమంది సొమ్ము ఖర్చు పెడుతున్నారు,ఎందుకు? పేరు కోసం పెట్టుబడి, మరింత సంపాదనకే. ఇక పెళ్ళిలో ఆడంబరాలకి భోజనాలకి ఖర్చు చేస్తున్నారు. అమ్మో! వారింట పెళ్ళిలో 64 రకాలు చేసారంటే, మనింట్లో మరో పదెక్కువ అన్నట్టు వంటలు చేయించి వడ్డించడం మొదలెట్టేరు. ఎవరు తిన్నా అజానెడు కడుపుకే. ఒక సారి నిండుగా తింటే ఇక వద్దు అంటాడు. వద్దనిపించగలది అన్నదానమొక్కటే, మరొకటి లేదు. మానవులు ఎంత తింటారు? పప్పు, రెండు కూరలు, రెండు పచ్చళ్ళు, ఒక తీపి, ఒక కారా. అబ్బో ఇది తినడమే చాలా ఎక్కువ, మరి అరవైనాలుగు తయారు చేయడం? గోతి పాల్జేయడానికా?

ఈ మధ్య ఇలా ఎక్కువ వెరైటీలు చేయడం మానేశారు, ఏం జేస్తున్నారూ? బంగారపు రేకులు వడ్డిస్తున్నారు. నిజమే చెబుతున్నా! ఇలా బంగారాన్ని ఆహారంతో తీసుకోవడం కొత్త మాటేం కాదు. చాలా పాత కాలం నుంచే బంగారపు రేకుల్ని ఆహారంతో తీసుకోవడం భారతీయులకు అలవాటే. ఇదెందుకు? బంగారం కూడా ఔషధంగా గుర్తించారు,భారతీయులు. బంగారాన్ని ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు, అలాగే హోమియోలో బంగారం ఒక మందుగా వినియోగిస్తారు. కలిగినవారు ఇలా బంగారపు రేకులు తినడం అలవాటే! దాన్నే ఇప్పుడు కలిగినవారు గొప్ప కోసం బంతి మీద వడ్డిస్తున్నారు. ఎలా తింటారని కదా! వేడి వేడి అన్నం మీద ఈ బంగారం రేకు వేస్తే అది కరిగిపోతుంది, దానిలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక ఆధరువుతో తినెయ్యచ్చు. ఇది నేటి గొప్పవారి బంగారం మింగడం కత.

కొసమాట:- కొసరు మాట కాదూ! 25 బంగారపు రేకులు ఖరీదు దగ్గరగా ఐదువేలు, బజారులో దొరుకుతున్నాయి.ఈ పరిశ్రమ మన దేశంలో చాలా కాలంగానే ఉన్నది. ప్రయత్నించండి,మీదే ఆలస్యం 🙂

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మెరుగు బంగారంబు మ్రింగబోడు

 1. అంతేనంటారా? అంతేలెండి, “ఏమున్నదక్కో, ఏమున్నదక్కా” (ఏమున్నది + అక్కా) అని ఓ సినిమా పాట లో అంటాడు లెండి, అలాగన్నమాట 🙁 !

  మెచ్చుకోండి

 2. // “ఒక్కమాటలో చెప్పాలంటే అమ్మవారి చలవండి 😦
  ఇప్పుడు కనపట్టం లేదండి.” //
  ————————————-
  విదేశీహస్తం అన్నమాట 👋.

  మెచ్చుకోండి

 3. విన్నకోటవారు,
  అమ్మ దయవల్ల అంతా సవ్యమేనండి. బండి నడుస్తోందండి

  బ్లాగుల్లోకి రావాలనే కోరిక పోయిందండి, అంతేనండి కారణం.

  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 4. విన్నకోటవారు,
  చాలా పెద్ద కతండి!
  ఒక్కమాటలో చెప్పాలంటే అమ్మవారి చలవండి 😦
  ఇప్పుడు కనపట్టం లేదండి.
  —————————————————————————————————–
  రోజుకు ఒక రేకు మాత్రమే తినాలండి. పరిమితి ఉండి, బంగారం కదాని ఎక్కువ తింటే ప్రమాదమండి. అసలు వైద్యుడు చెప్పందే తినకూడదండి.

  పులిని చూసి నక్కవాతలెట్టుకున్నట్టు చెయ్యడం మన లవాటే కదండి!

  బంగారం పిసరు రెండు తోలు ముక్కల మధ్య పెట్టి కర్ర సుత్తితో కొట్టి రేకులు తయారు చేసేవారు, ఇప్పుడు యంత్రాలొచ్చి మాయ పెరిగి కల్తీ వచ్చినట్టేనండి 🙂

  ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా చింతలూరివారి ఆతుర్వేద షాపుల్లో దొరుకుతాయండి.

  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.