కంద బచ్చలి కూర-కుటుంబం
మొన్న వనసమారాధనలో కందా బచ్చలీ కూరొండేరు,ఆవ పెట్టి. వహ్వా! ఏమిచెప్పను అంత రుచిగా ఉందనుకోండీ!
కందాబచ్చలి కూరెలావండుకుంటారు? తియ్యకంద అదే ఎర్రకందని ముక్కలుగా తరుక్కోవాలి. కుక్కర్లో పారేస్తే అన్నీ ఉడికిపోతున్నరోజులు. పాతకాలంలో కంద, పప్పు ఉడికిన నీళ్ళంటే మంచివని అనేవారు. మా నూతి నీళ్ళకి కందా,పప్పూ ఉడుకుతాయండని చెప్పేవారు, అద్దెకొచ్చేవాళ్ళతో, ఇదో ప్రత్యేక అదనపు ఆకర్షణ, అద్దె కొచ్చేవారికి. దారి తప్పేనా? 🙂
బచ్చలిలో మట్టుబచ్చలి, ఎర్రబచ్చలి,తెల్లబచ్చలి,సిలోన్ బచ్చలి రకాలు. ఏదైనా బానే ఉంటుందిగాని, తెల్లబచ్చలి మట్టు బచ్చలి బాగున్నట్టు మిగిలినవి ఉండవు. మేనత్త కొడుకూ మొగుడేనా! ఉండ్రాళ్ళూ పిండివంటేనా సామెత అన్నట్టు, దీని గురించి మళ్ళీ చెప్పుకుందాం, మళ్ళీ దారి తప్పనుగా! 🙂 ఎక్కువగా దొడ్లో దొరికేది, పెరిగేది తెల్లబచ్చలే!
బచ్చలిని చీడా పీడా లేకుండా చూసి తరుక్కోవాలి నీళ్ళలోకి. కడిగేయాలి. కంద ఉడికించాలి, మెత్తగా, ఎనుసుకుపోయేలా. ఇందులో బచ్చలి వేసి ఉడికించాలి,తొందరగానే ఉడికిపోతుంది. కొద్దిగా పసుపేయాలి,తగిన ఉప్పేయాలి. కొద్దిగా రవ్వపులుసు తగినంత చేర్చాలి. కొద్దిగా గట్టిపడేదాకా ఉడికించాలి. పోపేయాలి, అందులో ఇంగువ ముక్క వేస్తే రాజా! ఆ సువాసనకే, కూర ఉత్తినే తినాలనిపించేస్తుంది. కూర రెడీ అనుకున్నారా? అసలు కత ముందే ఉంది 🙂 తగినన్ని ఆవాలు, ఎక్కువైతే, అతి వేడి చేస్తుంది, అసలు నోట్లో పెట్టుకోలేరు, కళ్ళ నీళ్ళు ఖాయం. తగినన్ని ఆవాలు నూరుకుని, పొట్టు ఊదేసి, కొద్దిగా ఉప్పు,పసుపు,నూనె చేర్చి (కనరెక్కిపోకుండా) కూరలో కలిపేయాలి. ఇప్పుడు కూరవడియాలు,గుమ్మడి వడియాలు వేరుగా వేయించినవి కూరలో కలపాలి. కంద బచ్చలి కూర రెడీ.
కందాబచ్చలి కూరని పెళ్ళి చూపులరోజునుంచి,తాంబూలాల్రోజునుంచి,పెళ్ళి, శోభనం, ఆ తరవాత దాకా వండుతూనే ఉంటారు. అశుభ కార్యాల తరవాత శుభాన్ని ఆశిస్తూచేసే భోజనాలకీ వండుతారు. కందా బచ్చలి రెండూ బలేగా కలిసిపోతాయి. కాబోయే భార్య,భర్త ఇలా కలిసిపోవాలనే ఆ కూర వండుతారేమో 🙂
కందాబచ్చలి కూరకీ కుటుంబానికీ పోలికుంది. కంద వేడి చేస్తుంది,బచ్చలి చలవ చేస్తుంది. భార్య కందాలా ఉంటే భర్త బచ్చలిలాగా, భర్త కందలా ఉంటే భార్య బచ్చలిలాగా ఉంటే సంసారం నడుస్తుంది, ఒకళ్ళు ఏటికంటే మరొకళ్ళు కోటికి అన్నట్టు కాక, ఉద్దాలకుడు ,చండి దాంపత్యంలా కాక, ఒకరినొకరు అర్ధం చేసుకునే వీలనమాట. చెక్ అండ్ బేలన్స్. మరి మధ్యలో వేడి చేసే ఆవ ఎందుకని కదా! ఆవ పెడితే కొద్దిగా వేడి చేసినా, కూర రుచిగా ఉంటుంది. పిల్లలే ఆవలాటివాళ్ళు, ఇబ్బందులున్నా,వాళ్ళు లేకపోతే బతుకు నిస్సారం, కుటుంబం ఆనందంగా ఉండాలంటే పిల్లలుండాలి. ఇక పులుపు మామగారిలాటిది,ఎక్కువా పనికిరాదు,తక్కువా పనికిరాదు,సమానంగా ఉంటేనే కూర రుచి. మామగారు లేకపోతే కుటుంబానికి పెద్ద దిక్కే కరువు కదా! ఇక పోపు అత్తగారు లాటిది, తగిన కారం లేకపోతే కూరకి రుచేలేదు. అలాగే అత్త అధికారం కొద్దిగా చూపిస్తేనే ఆ కుటుంబం సవ్యంగా నడుస్తుంది. ఇక ఇంగువ ముక్క బంధువులలాటిది. చుట్టాలు తిన్న ఇల్లు సుడి మంగళం అని నానుడి కాదుగాని, బంధువులొచ్చి వెళితే వాళ్ళింట్లో ఎంత ఒద్దిక,భార్య,భర్త మాటే వినపడదు, కళ్ళతోనే మాటాడేసుకుంటారు. ఇక పిల్లలు చెప్పద్దూ అబ్బో వెళ్ళింది మొదలు తాతా,అమ్మమ్మా అంటూ వదలనిదే. భార్య,భర్త ఎంత గౌరవం చేశారని, ఇదిగో బట్టలు కూడా పెట్టిపంపేరు. ఇలా సాగిపోతుంటుంది. చివరివేగాని మంచి రుచినిచ్చేవి, వేయించిన కూర వడియాలు,గుమ్మడి వడియాలు, అమ్మాయి తల్లి తండ్రీలాటివి. వీళ్ళు వేగిపోతున్నా ఇబ్బందితో, అమ్మాయి అల్లుడి సంసారానికి రుచినివ్వాలనే కోరుకుంటారు పాపం. భార్యభర్తలు పదిమందిలో ఉండీ, కళ్ళతో మాటాడేసుకోవడం, సంప్రదించుకుని ఒక మాటమీద ఉండడం, చూస్తే ముచ్చటే వేస్తుంది. కూరలో రుచిని పుట్టించే ఉప్పులాటిదే భార్యాభర్తలు పదిమందిలో ఉండి కూడా కళ్ళతోనే మాటాడుకునే సౌకర్యం, అర్ధం చేసుకునే అన్యోన్యం, అనుబంధం ఆ కుటుంబానికి రుచినిచ్చేది.
కందాబచ్చలి కూరంటే ఇష్టం లేనిదెవరు…