శర్మ కాలక్షేపంకబుర్లు-కంద బచ్చలి కూర-కుటుంబం

కంద బచ్చలి కూర-కుటుంబం

మొన్న వనసమారాధనలో కందా బచ్చలీ కూరొండేరు,ఆవ పెట్టి. వహ్వా! ఏమిచెప్పను అంత రుచిగా ఉందనుకోండీ!

కందాబచ్చలి కూరెలావండుకుంటారు? తియ్యకంద అదే ఎర్రకందని ముక్కలుగా తరుక్కోవాలి. కుక్కర్లో పారేస్తే అన్నీ ఉడికిపోతున్నరోజులు. పాతకాలంలో కంద, పప్పు ఉడికిన నీళ్ళంటే మంచివని అనేవారు. మా నూతి నీళ్ళకి కందా,పప్పూ ఉడుకుతాయండని చెప్పేవారు, అద్దెకొచ్చేవాళ్ళతో, ఇదో ప్రత్యేక అదనపు ఆకర్షణ, అద్దె కొచ్చేవారికి. దారి తప్పేనా? 🙂

బచ్చలిలో మట్టుబచ్చలి, ఎర్రబచ్చలి,తెల్లబచ్చలి,సిలోన్ బచ్చలి రకాలు. ఏదైనా బానే ఉంటుందిగాని, తెల్లబచ్చలి మట్టు బచ్చలి బాగున్నట్టు మిగిలినవి ఉండవు. మేనత్త కొడుకూ మొగుడేనా! ఉండ్రాళ్ళూ పిండివంటేనా సామెత అన్నట్టు, దీని గురించి మళ్ళీ చెప్పుకుందాం, మళ్ళీ దారి తప్పనుగా! 🙂 ఎక్కువగా దొడ్లో దొరికేది, పెరిగేది తెల్లబచ్చలే!

బచ్చలిని చీడా పీడా లేకుండా చూసి తరుక్కోవాలి నీళ్ళలోకి. కడిగేయాలి. కంద ఉడికించాలి, మెత్తగా, ఎనుసుకుపోయేలా. ఇందులో బచ్చలి వేసి ఉడికించాలి,తొందరగానే ఉడికిపోతుంది. కొద్దిగా పసుపేయాలి,తగిన ఉప్పేయాలి. కొద్దిగా రవ్వపులుసు తగినంత చేర్చాలి. కొద్దిగా గట్టిపడేదాకా ఉడికించాలి. పోపేయాలి, అందులో ఇంగువ ముక్క వేస్తే రాజా! ఆ సువాసనకే, కూర ఉత్తినే తినాలనిపించేస్తుంది. కూర రెడీ అనుకున్నారా? అసలు కత ముందే ఉంది 🙂 తగినన్ని ఆవాలు, ఎక్కువైతే, అతి వేడి చేస్తుంది, అసలు నోట్లో పెట్టుకోలేరు, కళ్ళ నీళ్ళు ఖాయం. తగినన్ని ఆవాలు నూరుకుని, పొట్టు ఊదేసి, కొద్దిగా ఉప్పు,పసుపు,నూనె చేర్చి (కనరెక్కిపోకుండా) కూరలో కలిపేయాలి. ఇప్పుడు కూరవడియాలు,గుమ్మడి వడియాలు వేరుగా వేయించినవి కూరలో కలపాలి. కంద బచ్చలి కూర రెడీ.

కందాబచ్చలి కూరని పెళ్ళి చూపులరోజునుంచి,తాంబూలాల్రోజునుంచి,పెళ్ళి, శోభనం, ఆ తరవాత దాకా వండుతూనే ఉంటారు. అశుభ కార్యాల తరవాత శుభాన్ని ఆశిస్తూచేసే భోజనాలకీ వండుతారు. కందా బచ్చలి రెండూ బలేగా కలిసిపోతాయి. కాబోయే భార్య,భర్త ఇలా కలిసిపోవాలనే ఆ కూర వండుతారేమో 🙂

కందాబచ్చలి కూరకీ కుటుంబానికీ పోలికుంది. కంద వేడి చేస్తుంది,బచ్చలి చలవ చేస్తుంది. భార్య కందాలా ఉంటే భర్త బచ్చలిలాగా, భర్త కందలా ఉంటే భార్య బచ్చలిలాగా ఉంటే సంసారం నడుస్తుంది, ఒకళ్ళు ఏటికంటే మరొకళ్ళు కోటికి అన్నట్టు కాక, ఉద్దాలకుడు ,చండి దాంపత్యంలా కాక, ఒకరినొకరు అర్ధం చేసుకునే వీలనమాట. చెక్ అండ్ బేలన్స్. మరి మధ్యలో వేడి చేసే ఆవ ఎందుకని కదా! ఆవ పెడితే కొద్దిగా వేడి చేసినా, కూర రుచిగా ఉంటుంది. పిల్లలే ఆవలాటివాళ్ళు, ఇబ్బందులున్నా,వాళ్ళు లేకపోతే బతుకు నిస్సారం, కుటుంబం ఆనందంగా ఉండాలంటే పిల్లలుండాలి. ఇక పులుపు మామగారిలాటిది,ఎక్కువా పనికిరాదు,తక్కువా పనికిరాదు,సమానంగా ఉంటేనే కూర రుచి. మామగారు లేకపోతే కుటుంబానికి పెద్ద దిక్కే కరువు కదా! ఇక పోపు అత్తగారు లాటిది, తగిన కారం లేకపోతే కూరకి రుచేలేదు. అలాగే అత్త అధికారం కొద్దిగా చూపిస్తేనే ఆ కుటుంబం సవ్యంగా నడుస్తుంది. ఇక ఇంగువ ముక్క బంధువులలాటిది. చుట్టాలు తిన్న ఇల్లు సుడి మంగళం అని నానుడి కాదుగాని, బంధువులొచ్చి వెళితే వాళ్ళింట్లో ఎంత ఒద్దిక,భార్య,భర్త మాటే వినపడదు, కళ్ళతోనే మాటాడేసుకుంటారు. ఇక పిల్లలు చెప్పద్దూ అబ్బో వెళ్ళింది మొదలు తాతా,అమ్మమ్మా అంటూ వదలనిదే. భార్య,భర్త ఎంత గౌరవం చేశారని, ఇదిగో బట్టలు కూడా పెట్టిపంపేరు. ఇలా సాగిపోతుంటుంది. చివరివేగాని మంచి రుచినిచ్చేవి, వేయించిన కూర వడియాలు,గుమ్మడి వడియాలు, అమ్మాయి తల్లి తండ్రీలాటివి. వీళ్ళు వేగిపోతున్నా ఇబ్బందితో, అమ్మాయి అల్లుడి సంసారానికి రుచినివ్వాలనే కోరుకుంటారు పాపం. భార్యభర్తలు పదిమందిలో ఉండీ, కళ్ళతో మాటాడేసుకోవడం, సంప్రదించుకుని ఒక మాటమీద ఉండడం, చూస్తే ముచ్చటే వేస్తుంది. కూరలో రుచిని పుట్టించే ఉప్పులాటిదే భార్యాభర్తలు పదిమందిలో ఉండి కూడా కళ్ళతోనే మాటాడుకునే సౌకర్యం, అర్ధం చేసుకునే అన్యోన్యం, అనుబంధం ఆ కుటుంబానికి రుచినిచ్చేది.

కందాబచ్చలి కూరంటే ఇష్టం లేనిదెవరు…

శర్మ కాలక్షేపంకబుర్లు-గుండు-బట్టతల.

గుండు-బట్టతల.

  ”ఏంతోచటం లేదోయ్!”
”ఇంట్లో కూచుని కుండల్లో గుర్రాలు తోలకపోతే అలా మా అన్నయ్యగారింటికేసి వెళ్ళిరారాదూ”, ఉచిత సలహా చెప్పింది ఇల్లాలు.
”సరే” అని కర్ర పోటేసుకుని బయలుదేరా! అక్కడికెళ్ళేసరికి మా సుబ్బరాజు,సత్తిబాబు చాలా జోరుగా చర్చించేసుకుంటున్నారు. వాతావరణం చాలా వేడిగా ఉన్నట్టుంది. ”ఎరక్కపోయివచ్చాను,ఇరుక్కుపోయాను” అనుకుని, ”రోటిలో తలదూర్చి రోకటిపోటునకు వెరువ నేర్చునా?” అనే జాతీయం గుర్తు చేసుకుని, కూచున్నా! మా సుబ్బరాజు ”అంతా మేధావులే” అన్నాడు, చర్చ సందర్భంగా. అమ్మయ్య! సావకాశం దొరికిందనుకుని చర్చ దారిమళ్ళించా ఇలా 🙂

సుబ్బరాజూ ”మేధావులన్నావుకదా! గుండువాళ్ళు మేధావులా? బట్టతలవాళ్ళా” ప్రశ్నించా!.
”అనుమానమేంటండీ!బట్టతలవాళ్ళే మేధావులని ఎప్పుడో తేల్చేశారు” అనేశాడు ఉడుకు మీద.
మా సత్తిబాబందుకుని ”బట్టతలవాళ్ళు మేధావులమని ప్రకటించుకుంటే సరిపోద్దా! శాస్త్రీయమైన అధారాలుండద్దూ” అనేశాడు.
”బట్టతలవాళ్ళకి చమురు ఖర్చులేదు, క్షవరం ఖర్చులేదు. ఖర్చులు తగ్గించుకున్నవాళ్ళు మేధావులుకాదా? గుండు వాళ్ళు పునః పునః క్షవరకళ్యాణం చేయించుకోవాలి, ఖర్చు, నూనె ఖర్చూ, అదేగాక మాకో పేరుంది తెలుసా? ఖర్వాటుడు అంటారు సంస్కృతంలో, బట్టతల మేధావిత్వానికి సూచన” అనేశాడు సుబ్బరాజు.

”నీకిలా చెబితే కుదరదుగాని, చెబుతా విను. జనాభాలో సగం మంది ఆడాళ్ళు, వాళ్ళకి బట్టతలొచ్చిన సావకాశం చూడలేదు. ఇంటికెళ్ళి మీ ఆవిడ దగ్గరని చూడు ఎవరు మేధావులో తెలిసిపోతుంది. నిజంగా ఆడాళ్ళే మేధావులు. బ్రిట్నీ స్పియర్స్ తెలుసా? పొన్నకాయలాగా గుండు చేయించుకున్న అందమైన గాయని. గుండు ఎందుకు చేయించుకుందో తెలుసా? మరింత అందంగా మెరిసిపోడానికే! గుండు చేయించుకుంటే అది నున్నగా, గచ్చకాయ నునుపుతో ఎంతందంగా పచ్చహా మెరిసిపోతుందో తెలుసా? బట్టతల చింతపండేసి ఎర్రగా తోమిన, తిరగేసిన ఇత్తడి బూరెల మూకుడులా ఉంటుంది. ఒకమాటయ్యా! మొక్క పెరగాలంటే భూమిలో సత్తువుండాలి కదా? బుర్రలో ఆ సత్తువ లేకేగదా నెత్తిమీద జుట్టూడిపోయింది, బుర్రలో గుంజుంటే పరకలు రాలిపోయి ఉండవు,మళ్ళీ మొలవకుండా! మరిమాకో పునః పునః నెత్తిమీద పరకలొస్తూనే ఉంటాయి, పునః పునః క్షవర కళ్యాణం చేయించుకుంటూనే ఉంటాం, బుర్రలో గుంజుందిగనకే పునః పునః వెంట్రుకలు మొలుచుకొస్తాయి. మా వల్ల ఒక వృత్తి బతుకుతోంది కదయ్యా! ఇప్పుడు చెప్పు ఎవరు మేధావులో అంటూ లేచిపోయాడు మా సత్తిబాబు.

ఇంతకీ మా సత్తిబాబు మాటే నిజమంటారా?

శర్మ కాలక్షేపంకబుర్లు-నన్ను జైల్లో పెట్టండి బాబోయ్!

నన్ను జెయిల్లో వేసేయండి బాబోయ్!

జైల్లో వేసెయ్యండటూ పెద్దగా అరుచుకుంటూ లోపలికి పరిగెట్టుకొచ్చాడో ముఫ్ఫై ఏళ్ళ యువకుడో ఉదయమే, ఒక పట్టణపు పోలీస్ స్టేషన్ లోకి.

రాత్రి మత్తు అదే నిద్రమత్తే 🙂 వదలని ఎసై గారు బద్ధకంగా నోరావలిస్తూ

”ఏం జేసేవు? ఎవణ్ణేనా చంపేవా? చచ్చేలా పొడిచావా?, చితక బాదేవా?, ఏ గుడి మీదేనా బాంబేసేవా?” అన్నట్టు వచ్చినవాడి కేసి చూస్తూ ఆరాతీశాడు, చేతుల్లో సాక్ష్యానికి తగినవేవీ కనపడక నిరుత్సాహపడ్డాడు.

”మా ఆవిణ్ణి చితకా మతకా, చింతకాయ పచ్చడి చేసినట్టు చితక్కొట్టేసేను, నన్ను లోపలేసేయండ”ని మళ్ళీ గోల పెట్టేడు యువకుడు, భయం భయంగా వెనక్కి చూస్తూ!

ఛస్! పొద్దుగాల ఇసుమంటి నూసెన్స్ కేసొచ్చినాదనుకుంటా, ”ఓస్! మొగుడూ పెల్లాల యవ్వారమా” అనేసి, సాల్లే పొద్దుగాలా అనుకుంటూ కాళ్ళు బారజాపేడు, ఎదురుగా ఉన్న డ్రాయరు మీకి.

ఇది చూసిన యువకుడికి మతిపోయింది. ఏంటీ ఎసై, పెళ్ళాన్ని చితకా మతకా చింతకాయ పచ్చడి చేసినట్టు మడతేసేనురా మగడా అని మొత్తుకుంటుంటే మాటాడ్డు, లోపలెయ్యమంటే కునుకుతున్నాడనుకుని కూచున్నాడు, ఎదుటి బల్ల మీద. ఓరకంటితో చూసిన ఎస్.ఐ ఛస్! ఈడేటీ! జిగట ఇరేచనం లా వదిలాలేడు, ఇదేటి ఉపయోగపడీ కేస్ కాదనుకునేటప్పటికి, ఓ గొప్ప ఆలోచనొచ్చీసింది. ఆ! అదగదీ అనుకుంటా, ఎ.సి.పి దొరకి ఫోన్ కలిపీసి సార్! ఇక్కడో గుంటడు పెల్లాన్ని ఉతికీసినాని తెగ్గోల జేస్తన్నాడు, తవరుగారు, పెద్దపెద్ద కేసుల్నే అలగ్గా జూసినోరు, ఇసుమంటి కేసులెన్నో చూసినోరు, పెద్దోరు, తవరే డీల్ సెయ్యాల ఈ కేస్, గుంటణ్ణి తవరిగారి సేంబర్ కాడ కూకోబెడతా అని ఎక్కించేసేడు. కుర్రోడికి చెప్పేసేడు. మేడ మీన దొరగారి రూం కాడ కూకోమని. యువకుడికీ ఆశ పుట్టుకొచ్చింది. మేడ మీదకి పోయి ఎ.సి.పి దొర రూం దగ్గర బైఠాయించాడు.

ఎ.సి.పి దొరొచ్చీ లోపులో ఒకాడకూతురో కాగితం ముచ్చుకోని స్టేషన్లోకడుగెట్టింది. ”దేశమెటుపోతాందయ్యా! మీరేటి సేత్తన్నారు, ఆడ కూతుళ్ళకి రచ్చన లేదా! ఇంట్లోనూ ఈదిలోనూ బతకనియ్యరా? మమ్మల్ని సంపీసినా, సితక బొడిసీసినా కానుకునీ ఓడే లేదా! ఏం జేత్తన్నారయ్యా! ఏడీ మీ దొరేడీ? ఏటి నువ్వేటి సేత్తన్నావు? నిద్దరోతన్నారయ్యా! ఏదీ సిఎంకి గలుపు, దొరక్కపోతే పి.ఎం ని గలుపు మాటాడ్తా! ట్విట్టర్లో ఎట్టేద్దామనుకున్నాగాని, మీకీ సేన్స్ ఇవ్వాలనొచ్చినా! ఏటింకా కునుకుతున్నావు? ఎక్కడ కురిసీ? ఏటిదేనా ఆడ కూతుల్లకిచ్చే మరేదా?” అని ఝణ ఝణలాదించేసింది.

జడుసుకుని, కొద్దిగా తెప్పరిల్లిన ఎస్. ఐ ”ఎవుడాడు తల్లీ! ఏటి జేసినాడు నిన్నూ!” అని అడిగి చేతులో కాయితం ముక్కుచ్చుకుని చదువుకుని, ”అమ్మా! ఫోటో ఏటేనా ఉన్నాదా? ఈ పిల్లగోడిద”నడిగితే ఓ ఫోటో చేతులో ఎట్టింది. ఈ లోగా పెద్ద దొరరావడం, మేడ మీదకెళ్ళిపోటం జరిగిపోయాయి. ”ఈ గుంటణ్ణి ఇంతకుముందే స్టేసన్ కి ఒట్టుకొచ్చినాం తల్లీ! మరో కేస్ మీన, సితకబొడిసీనా? లోపలేస్తాన్ తల్లి,తల్లి. పెద్ద దొరకాడికి పెసల్ ట్రీట్మెంట్ కి పమ్మించా!” అన్జెప్పి ఉగ్ర కాళికని ఇంటికి పంపేడు.

పొద్దుగాల నూసెన్స్ కేస్, అమెరికా మీదిరుసుకుబడ్డ తుఫాన్ ఎలిసినట్టు ఎలిసేసరికి, మేడ మీదనుంచి ఎ.సి.పి దొర ఆక్రందనలినపడ్డాయి. ”ఇదేటీ ఇంత! పొలీస్ టేసనిలో బయటోళ్ళ కేకలినపడాల గాని దొర కేకలేటని” మేనమీకి లగెత్తు కెల్లిన ఎస్.ఐ కి బొటబొటా ముక్కునించి రక్తంగారుతున్న దొర గనపడ్డాడు. ”ఏటయినాది దొరా?” అనడిగిన ఎస్.ఐ కి దొర జెప్పిన మాట.

”ఓర్నీయవ్వ! ఈడెవడ్రా!! పెల్లాన్ని మడతేసేనంటే ఒరే తమ్ముడూ పెల్లామంటే ఎవరు? దేవత! పువ్వుల్లో ఎట్టుకుని పూజ్జెయ్యాల అని చెబుతున్నా! ఇలా ముక్కుమీదో గుద్దు గుద్దేడని” లబలబలాడేడు, ముక్కునుంచి వరదలా కారుతున్న రక్తం తుడుచుకుంటూ.

అప్పుడు ఎస్.ఐ ”ఒరే ఫోర్ ట్వంటీ దొరని ఆస్పాటలికి తోలుకెల్లు జీప్ మీన” అన్జెప్పి యువకుణ్ణి పట్టుకుని లాకప్ లో ఏసి కూసున్నాడు. ఏటీడు, లాకప్పులో ఏసియ్యండో అంటన్నాడు, ఎందుకెయ్యాలా ఆరాదీబోతే పెద్దదొరకే సితకబొడిసినాడు, అని ఆలోచిస్తుంటే, ఇంతలో ఇనపడింది లాకప్పు లోంచీ పాట.

”కలనిజమాయెగా కోరిక తీరెగా సాటిలేని రీతిగా మదినెంతో హాయిగా” అని. ఇప్పుడు కుర్చీలో కూచుని పాట విన్న ఎస్.ఐ హటాత్తుగా లేచి యురేకా అని అరిచి కింద పడ్డాడు.

ఎస్.ఐ యురేకా అని ఎందుకరిచాడు. జ్ఞానోదయమైనదేమి?

(రాజస్థాన్ లో జైపూర్ లో జరిగిన సంఘటన.)

శర్మ కాలక్షేపంకబుర్లు-మనసే శత్రువు.

మనసే శత్రువు.

ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో చెప్పినమాట.

వైరులెవ్వరు చిత్తంబు వైరి గాక
చిత్తమును నీకు వశముగా జేయవయ్య!
మదయుతాసురభావంబు మానవయ్య!
యయ్య! నీ మ్రోల మే లాడరయ్య జనులు.

శత్రువెవరు? నీ మనసే శత్రువు. మనసును నీ స్వాధీనంలోకి తెచ్చుకో! అరిషడ్వర్గాలలోని మదం తో నిండిన అసురభావం వదలిపెట్టు. నీ ముందు జనం నిజం చెప్పరయ్యా!

లోకములన్నియున్ గడియలోన జయించినాడ వింద్రియా
నీకము జిత్తముం గెలువ నేరవు నిన్ను నిబద్ధుజేయు నీ
భీకర శత్రు లార్వుర బ్రఖిన్నుల జేసిన బ్రాణికోటిలో
నీకు విరోధి లే డొకడు నేర్పున జూడుము దానవేశ్వరా!

గడియలో లోకాలన్నీ జయించావు కాని నీ మనసును దానికి లొంగి ఉండే ఇంద్రియాలనూ జయించలేకపోయావు. నిన్ను బద్ధుణ్ణిగా జేస్తున్న భయంకర శత్రువులు ఆరుగురిని వదలేస్తే ప్రాణికోటి మొత్తం మీద నీకు శత్రువే లేడయ్యా!

మన మనసే చిత్రమైనది. మనసు పంచేంద్రియాలను శాసిస్తుంది, కాని ఇంద్రియ సుఖాల కోసం వెంపర్లాడుతుంది. ఇదో పక్క ఐతే మరో పక్క ఆరు గుణాలు మనసుని కుళ్ళబొడుస్తుంటాయి. అవే కామ,క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్యాలు. మనసువీటికీ లొంగిపోతూ ఉంటుంది.

మనసు కోరికల పుట్ట, ఒకదాని తరవాత మరొకటి కోరిక పుడుతూనే ఉంటుంది. ఎంత సంపాదించినా తృప్తి లేదు, ఇంకా సంపాదించాలనే కోరిక. కోరిక తీరితే ఆనందం లేకపోతే క్రోధం. కొన్నిటిపై,కొంతమందిపై అతి ప్రేమ, కొన్నిటిపై అతి ద్వేషం. డబ్బున్నవాళ్ళమని,అందమైనవాళ్ళమని, చదువుకున్నవాళ్ళమని,అధికారం ఉన్నవాళ్ళమని, మనం ఏం చేస్తే కాదనువారెవరు? అడ్డు చెప్పేవారెవరనే మదం. చివరగా మత్సరం, వాడు నాకంటే ఎందులో గొప్ప, వాణ్ణే ఎందుకు అందరూ పలకరిస్తారు? వాడికే ఎందుకు గౌరవం ఇస్తారు? ఇలా ప్రతి విషయంలోనూ పోలిక. భగవంతుడు ఎవరికి కావలసిన తెలివి వారికిచ్చాడు. మనగొప్ప మనదే! మనం చూసి అసూయ పడుతున్నవారికి మన దగ్గరున్నదేదో ఉండి ఉండకపోవచ్చు! ఎవరూ గొప్పవారు కాదు,ఎవరూ చిన్నవారూ కాదు. ఎవరంతవారు వారే!

ఇలా ఈ ఆరు అంతఃశ్శత్రువులు కామ,క్రోధ,మోహ,లోభ, మద, మాత్సర్యాలు మనసును పట్టి పీడిస్తుంటాయి. ఇంద్రియ సుఖాలను, అంతశ్శత్రువులను గెలవగలిగితే! సాధ్యమా!! పంచేంద్రియాలను మనసు శాసిస్తుంది కాని వాటికి లోబడిపోతుంటుంది, ఇంద్రియ సుఖం కోసం. ఇదొక విషవలయం. దీని నుంచి తప్పించుకున్నవారే లేరు. కోరిక లేనివారు లేరు. కోరిక మొదటి శత్రువు దీనినుంచే మిగిలినవి మొలుచుకొస్తాయి. కోరిక లేనివారున్నారా? ఆ( ఉన్నారున్నారు, వారిద్దరే ఒకరు పుట్టనివారు, మరొకరు మరణించినవారున్నూ!

మరి వీటినుంచి విముక్తి,విడుదల ఉంటుందా? ఉండదు, ఉండదుగాక ఉండదు. మరి దారి? మనసు ఈ అంతఃశ్శత్రువులను వదల్చుకోలేదు, అలాగే ఇంద్రియాలకూ లోబడకపోకుండా ఉండలేదు. మనసు పంచేంద్రియ సుఖానికి లోబడుతూ, అంతశ్శత్రువుల దాడికి తట్టుకోలేక విలవిలలాడుతుంది. మానవులు నాలుగు పురుషార్ధాలు సాధించుకోవాలి. అవి ధర్మ,అర్ధ,కామ,మోక్షాలు. ఇదిగో ఈ కామమే ఆ ఆరుగురు శత్రువులలో మొదటిది. దీనికి ధర్మమనే ముకుతాడు వేయగలిగితే, అన్నిటిని ధర్మానికి ముడిపెట్టుకుంటే, ధర్మమైన అర్ధం,ధర్మమైన కామం సాధించుకోవచ్చు. ఎప్పుడైతే కామం ధర్మంతో ముడి పడిందో అప్పుడు మిగిలిన అంతఃశ్శత్రువులు లోబడతారు, అప్పుడు శత్రువెక్కడా ఉండడు. అంతదాకా మనం శత్రువు బయట ఉన్నాడని వెతుకుతూనే ఉంటాం. కాని ఇది సామాన్యులు గుర్తించడం కష్టం. మన శత్రువు బయట లేడు మనలోనే ఉన్నాడు, అదే మన మనసు.

మనసును జయిస్తే!…. సామాన్యులకు సాధ్యం కాదు.

శర్మ కాలక్షేపంకబుర్లు-హిరణ్యకశిపుని అంతరంగం

హిరణ్యకశిపుని అంతరంగం

ముంచితి వార్ధులం గదల మొత్తితి శైలతటంబులందు ద్రొ
బ్బించితి శస్త్రరాజి బొడిపించితి మీద నిఖేంద్రపంక్తి ద్రొ
క్కించితి ధిక్కరించితి శపించితి ఘోర దవాగ్నులందు ద్రో
యించితి బెక్కు పాట్ల నలయించితి జావడిదేమి చిత్రమో!

ప్రహ్లాదుని చంపడం కోసం హరి భక్తి వీడేలా చేయడం కోసం

సముద్రాలలో ముంచేసేను, గదలచేత తలబద్దలయ్యేలా మొత్తించాను.పర్వతాలనుంచి కిందికి తోయించాను. ఏనుగులతో తొక్కించాను. శపించాను,ఛీ అన్నాను. అగ్నిలో తోయించాను. ఎన్ని కష్టాలు పెట్టాలో అన్నీ పెట్టించాను. చిత్రం ఏం చేసినా చావటం లేదే!

హరిభక్తి తప్పని చెప్పినవాడిని నేను,నిరూపించినవాడిని నేను,శిక్ష విధించినవాడిని నేను. నేను నియంతను,సర్వాధికారిని, నేను వేసిన శిక్ష అమలు జరక్కపోవడమా! ఎంత చిత్రం, ఇదీ హిరణ్యకశిపుని అంతరంగం..

_/\_

శర్మ కాలక్షేపంకబుర్లు-కంచికి చేరని కత

కంచికి చేరని కత

      పెళ్ళైయిపోయింది, పప్పు ధప్పళాలతో భోజనాలు జేసి బంధువు లెళ్ళిపోయారు. అమ్మాయి అబ్బాయి హనీమూన్ వెళ్ళిపోయారు. నెల తరవాత తిరిగొచ్చారు. రిసల్ట్స్ వచ్చాయి ఇద్దరూ పాస్ అయ్యారు. అబ్బాయి కుటుంబ వ్యాపారంలో పడ్డాడు, అమ్మాయి అత్తింట ఉంది. మరుసటి నెలలో అమ్మాయి నెలతప్పిందన్న వార్త పుట్టింట అత్తింట తీపి కబురే అయింది. మా కోడలు బంగారం అనుకున్నారు అత్తమామలు. నాలుగో నెలొచ్చింది. పుట్టింట పెళ్ళంత ఘనంగా సంబరం చేశారు, మా ఇంటో! అని అత్త మామలూ జరిపించారు ఒక ఫంక్షన్. ఫంక్షన్ జరిగినరోజు సాయంత్రం అబ్బాయిని హాస్పిటల్ లో చేర్చారు, కామెర్లని.

అమ్మాయి పుట్టింటికొచ్చింది, భర్తని హాస్పిటల్ కెళ్ళి చూసొస్తోంది. రెండు నెలలకి హాస్పిటల్ నుంచి బయటికొచ్చాడబ్బాయి. అమ్మాయికి ఏడో నెలొచ్చింది, పుట్టింటికి తీసుకొచ్చారు. అబ్బాయి వ్యాపారంలో ములిగాడు. తొమ్మిదో నెలొచ్చింది అమ్మాయికి, మళ్ళీ బ్రహ్మండంగా వేడుక జరిపారు, అబ్బాయికి అత్తమామల ఆనందానికి అంతే లేదు.

పురిటిరోజు దగ్గరకొచ్చింది. అమ్మాయిని హాస్పిటలుకి తీసుకెళ్ళేరు. అదే రోజు అదే సమయంలో అబ్బాయినీ అదే హాస్పిటల్ కి తీసుకొచ్చారు, కామెర్లు తిరగబెడితే. ఆ రోజే వారి పెళ్ళి రోజుకూడా. అబ్బాయి అమ్మాయి ఒకే హాస్పిటల్లో చెరో వార్డులో చేరారు. అమ్మాయికి ప్రసవం అయింది, ఆరోజే. అబ్బాయికి సీరియస్ అయింది అదే సమయానికి. చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆబ్బాయి ఊపిరి అనంత వాయువుల్లో కలిసిపోయింది, కూతురు పుట్టిన సమయానికే. కూతురు పుట్టిందన్న సంగతి కూడా తెలియకనే. మనవరాలు పుట్టిందని కబురు చెప్పడానికి పక్కవార్డ్ కెళ్ళిన అమ్మాయి తండ్రికి అల్లుని మరణ వార్త తెలిసి కూలబడిపోయాడు. కబురు చెప్పి వస్తానన్న మనిషి ఎంతకీ రాడని అమ్మాయి తల్లి అబ్బాయి దగ్గర కెళితే కబురు తెలిసి నీరైపోయింది. కొద్ది సేపటికి తేరుకున్నారు. అమ్మాయి మగతలో ఉంది.

ఇప్పుడేం చెయ్యాలి ఇదీ తల్లి తండ్రులు నలుగురి సమస్య. అదృష్టం లేక ఒకరిని పోగొట్టుకున్నాం, రెండవవారినీ పోగొట్టుకోలేము, ఈ వార్త అమ్మాయికి చేర్చద్దు, నిర్ణయం తీసుకున్నారు నలుగురూ. అబ్బాయి పార్ధివ శరీరానికి అంత్య క్రియలు జరిపించేశారు, అబ్బాయి తల్లితండ్రులు. గుడ్ల నీరు కుక్కుకుంటూ మనవరాలిని చూడ్డానికొచ్చారు, ’అబ్బాయి గురించడిగితే ఏం చెప్పాలి?’ కళవెళ పడ్డారు. అబ్బాయికి అనారోగ్యం పెరిగింది, పెద్ద హాస్పిటల్ కి పంపించాము, దగ్గరవారు కూడా వెళ్ళేరు, మనవరాల్ని నిన్ను చూసి బయలుదేరుదామని ఆగామని చెప్పి సద్దేశారు. వెళ్ళిపోయారు.

హాస్పిటల్లో ఉండగా అమ్మాయికి కబురు తెలియనివ్వకుండా జాగ్రత్తపడ్డారు. హాస్పిటనుంచి పంపేరోజు అమ్మాయి అమ్మమ్మ వచ్చి మనవరాలిని మునిమనవరాలిని తీసుకెళ్ళింది,పొరుగూరు, ఊళ్ళో ఉంటే పొరపాటున కబురు తెలిసిపోతుందేమోనని భయంతో. ’అబ్బాయి కెలా ఉంది?’ అమ్మాయి అడగనిరోజులేదు, గుడ్లనీరు కుక్కుకుంటూ పెద్దలు ’కూతురు దుష్టనక్షత్రాన్ని పుట్టిందిట, ఆరునెలలదాకా చూడ్డానికి లేదని’ అబద్ధం చెప్పేరు. ’మాటాడచ్చుగా?’ బాగా నీరసంగా ఉన్నాడు. ఇలా చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పేరు. మూడు నెలలెలాగో గడిపేరు, కష్టం మీద. ఆ తరవాత అమ్మాయి ’నా మొగుణ్ణి నేను చూడ్డానికి మీ అడ్డేంటని?’ బయలుదేరుతున్నాని పంతం పట్టింది. పంతం తెలిసిన పెద్దలు అందరూ ఒక రోజు సమావేశం ఏర్పాటు చేసి డాక్టర్ కి కూడా చెప్పుకుని,సిద్ధంగా ఉంచుకుని, నెమ్మదిగా అబ్బాయి కాలం చేసిన సంగతి చెప్పేరు. అంతే అమ్మాయి కొయ్యబారిపోయి నిలువుగుడ్లేసుకుని చూస్తూ ఉండిపోయింది, మాటా పలుకూ లేక. ఏమవుతుందోననే భయంతో తల్లితండ్రులు వణికిపోయారు. చిన్నపిల్ల ఏడ్చింది, ఆ పిల్లని తీసుకుని స్థాణువుగా ఉండిపోయిన తల్లి చేతిలో పెడితే తేరుకుంది. ఏడవలేదు, నాకెందుకు చెప్పలేదని గొడవ చేయలేదు. సామాన్యంగా ఉండిపోయింది. పెద్దలు నలుగురూ అమ్మాయిని గమనిస్తూ రెండు రోజులు గడిపేరు, అమ్మాయి ఆ విషయమే ప్రస్తావించక ఉండిపోయింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు తల్లితండ్రులు, ఇరువైపులవారూ.

అమ్మాయి భవిషయత్తేంటీ? ఇది అత్తమామల్ని, తల్లి తండ్రులని వేధించిన ప్రశ్న. అమ్మాయిని కూచోబెట్టి, తల్లితండ్రులు ఇరుపక్కలవారూ చెప్పిన మాటలు.

పోయినవాళ్ళతో పోము,పోలేము కూడా. మాకు,నీకు కూడా అదృష్టం లేకపోయింది. మాకున్న అస్థి పాస్థులన్నీ మా తరవాత నీకు,నీ కూతురుకే. ఇప్పుడు కూడా నీకు కావలసిన సొమ్ము తీసుకోవచ్చు. నీ జీవితం ఇంకా చాలా ఉంది, అందుచేత, చదువుకుంటావా? మళ్ళీ పెళ్ళిచేసుకుంటావా? లేదూ కుటుంబ వ్యాపారం చూసుకుంటావా? నీకెలా ఇష్టమైతే అలా చేసుకో! ఇందులో ఎవరి అభ్యంతరం ఏమీ లేదు, ముఖ్యంగా నీకూతురుని పెంచడంలో నీకేమైనా ఇబ్బంది ఉంటే, మేం నలుగురం ఆపిల్లని పెంచుతాం. అని చెప్పేసేరు. చిన్న పిల్లకి రెండో ఏడొచ్చింది. అమ్మాయి ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇదీ కంచికి చేరని కత, భగవంతుడు ఆడించిన వింత నాటకం.

శర్మ కాలక్షేపంకబుర్లు-ప్రేమ కుట్టిందోచ్!

ప్రేమ కుట్టిందోచ్!

    అప్పుడప్పుడే పల్లెవాసనలొదులుతున్న పట్నవాసం. ఆఊళ్ళో ఓ కాలేజి.కాలేజిలో అమ్మాయిలు అబ్బాయిలు చదువుకుంటున్నారు. ఆ ఊరుకో ప్రత్యేకత,ఒకే కులంవారో ఎనభైమందుంటారు వందలోనూ. ఒకే క్లాసులో చదువుకుంటున్న ఒకమ్మాయిని అబ్బాయిని ప్రేమ కుట్టింది. అది పెరిగింది.

చాలాకాలం ఇళ్ళ దగ్గర తెలియకుండా ప్రేమ కొనసాగించినా, చివరకి ఇళ్ళ దగ్గర తెలియక తప్పలేదు. అమ్మాయి తల్లితండ్రులు నయాన చెప్పిచూశారు,లాభం లేకపోయింది. కాలేజి మానిపించేశారు, అయినా అబ్బయితో సెల్ లో మాటాడ్టం మానలేదమ్మాయి. గట్టిగా చెప్పి చూశారు,సెల్ ఫోన్ అందకుండా చేశారు,ఉరిపోసుకు ఛస్తాను, ఆ అబ్బాయినే పెళ్ళి చేసుకుంటానని అమ్మాయి పంతంపట్టింది, తెగేసి చెప్పింది. అమ్మాయి తల్లి తండ్రులది చెప్పుకోలేని బాధ,పేదరికం. ఏం చెయ్యాలో తెలియక అమ్మాయి తల్లితండ్రులు జుట్టు పీక్కునే స్థితికొచ్చారు, ఐనా అమ్మాయి మనసు మారలేదు.

అక్కడ అబ్బాయి తల్లితండ్రులూ చెప్పి చూశారు,ఏమంత అందగత్తెని వెనకపడ్డావనీ అన్నారు. ఏమివ్వగలరనీ ఈసడించారు. ఊహు అబ్బాయి అంగుళం బెసగలేదు, చివరికి తల్లితండ్రులే దిగొచ్చి ఆచారం ప్రకారం అమ్మాయినిస్తామని వాళ్ళు రావాలి మనం ఎదురెళ్ళి అడగం కదా అని లా పాయింట్ లేవదీశారబ్బాయి దగ్గర. అబ్బాయి మాటాడలేదు, తనపనిలో తనున్నాడు, తల్లితండ్రులా మాత్రం దిగొచ్చినందుకు, సంతసించాడు.

ఇప్పుడు అబ్బాయి ఒక మధ్యవర్తిని పట్టుకొన్నాడు, ఇద్దరికి కావలసినవాడు,బంధువూనూ. విషయం చెప్పేశాడు. మధ్యవర్తీ కాదన్నాడు ముందు, నీ తల్లితండ్రులొప్పుకోరు, ఏమంత అందగత్తెలే, సొమ్ములే ఇవ్వగలరు ఇలా అని నిరుత్సాహ పరచేడు. కాని అబ్బాయి పంతం ముందు వెనకడుగేసి, అమ్మాయి తల్లితండ్రులతో మాటాడతానని మాటిచ్చి, తొందరపనులేమీ చెయ్యమని అబ్బాయితో మాట తీసుకుని అబ్బాయి తల్లితండ్రుల్ని కలిసి విషయం చెప్పాడు. అబ్బాయి తల్లితండ్రులు విషయం విని, ఏమిచ్చినా ఇవ్వకపోయినా, కనీసం సంప్రదాయాలైనా పాటించాలి కదా! వారొచ్చి పిల్లనిస్తామని అడగాలి కదా అని తేల్చారు.దానికి మధ్యవర్తి మిగిలిన ఏర్పాట్లు చూస్తాననీ అమ్మాయి తల్లితండ్రులతో మాటాడతానని చెప్పి, వారొచ్చి చెప్పిన తరవాత వెనుతీయమని అబ్బాయి తల్లితండ్రుల దగ్గరమాట తీసుకు కదిలాడు.

మధ్యవర్తి అమ్మాయి తల్లితండ్రులదగ్గర కొచ్చి విషయం కనుక్కున్నాడు. వీరు తమ బాధ, అశక్తత తెలుపుకున్నారు. అబ్బాయిది తమది ఒక కులమే తప్పించి, రెండు కుటుంబాలకు ఆర్ధికంగా మధ్య హస్తి మశకాంతరమున్న విషయమూ చెప్పారు, అబ్బాయి ఆస్థి పాస్తుల ముందు వారి కాలిగోటికి సరిపోమన్నారు, పిల్లనిస్తామని వెళ్ళే అర్ధిక స్థోమత లేదని వాపోయారు. వెళ్ళి చెప్పబోతే అవమానం ఎదురవుతుందన్నారు. విన్న మధ్యవర్తి తానన్ని విషయాలూ తల్లితండ్రులతో మాటాడేననీ, వారన్నిటికీ ఒప్పుకున్నారనీ, పెట్టుపోతల సమస్య లేదనీ, మీకు తోచిన విధంగా పెళ్ళి చెయ్యవచ్చనీ భరోసా ఇచ్చేడు. అమ్మయ్య! అమ్మాయి మనసు గూట్లో పడింది, మధ్యవర్తి దగ్గరుండి మాటలు జరిపించాడు, శుభం అనుకున్నారు,పరిక్షలు దగ్గర పడుతున్నాయి కనక చదువు పూర్తిచేశాకా పెళ్ళి అనడంతో, మళ్ళీ మొదటి కొచ్చింది వ్యవహారం. మధ్యవర్తి కలగజేసుకుని ఇందులో మోసమూ,కుట్ర, దగా లేదని తాను పూచీ పడి చదువులు పూర్తిచేయించి, దగ్గరుండి డుమ్ డుమ్ డుమ్ పి పి ప్పి పెళ్ళి జరిపించాడు. అమ్మయ్యా పెళ్ళైపోయింది, కథ కంచికి మనం ఇంటికీనా కాదు! అసలు కత ముందుంది…..

శర్మ కాలక్షేపంకబుర్లు-పచ్చిపాల పరమాన్నం.

పచ్చిపాల పరమాన్నం.

విందు అంటే పంచ భక్ష్యాలు, పరమాన్నం. భక్ష్యాలన్నిటికి వేరు,వేరుగా పేర్లు చెప్పలేదు గాని పరమాన్నాన్ని మాత్రం వేరుగా చెప్పేరు, అది పరమాన్నం కనుక, ఉత్కృష్టమైనది గనక.

పరమాన్నం ఎలా వండుకుంటారు? చిక్కటి పాలను సన్నని సెగమీద కాస్తూ ఉండాలి. ఈ లోగా తాటిపాక/బూరుగుపల్లి బెల్లాన్ని కోరుకుని ఉంచుకోవాలి. సన్నబియ్యం కడుక్కుని వోడవేసి ఉంచుకోవాలి. పాలు తరక కడుతున్నాయన్నపుడు బియ్యాని పాలలో పోయాలి. బియ్యం ఇప్పుడు పాలతో ఉడుకుతాయి. అన్నం ఉడికినతరవాత తగిన బెల్లం పాలతో ఉడుకుతున్న అన్నంలో పోయాలి. నెమ్మదిగా కలియబెట్టాలి,ఎనుసుకుపోకుండా. అవసరాన్ని బట్టి పాలుపోయాలి కూడా. ఇప్పుడు అలా ఉడుకుతున్న పరమాన్నంలో పచ్చ కర్పూరం, ఏలకులపొడి వేసుకోవాలి. వేడి వేడిగా ఉన్న పరమాన్నాన్ని అప్పుడే కోసిన లేత అరటాకులో వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకుని జుర్రుకు తినాలి. ఆహా ఏమి రుచి అనరా మైమరచి.

ఇదేంటీ? పచ్చిపాల పరమాన్నం చెబుతానని? అని కదా మీ అనుమానం. అసలు పరమాన్నం ఎలా వండుకోవాలో చెప్పి అప్పుడు పచ్చి పాల పరమాన్నం గురించి చెబుదామని.

పచ్చిపాలు అంటే అప్పుడే తీసిన పాలు. వీటినే పొదుగు దగ్గరపాలు, గుమ్మపాలు అనీ అంటారు. గుమ్మపాలగురించి వేరుగా చెబుతా,ఇప్పుడు సందర్భం కాదు గనక. అప్పుడే తీసిన గుమ్మపాలు కొద్దిగా వేడిగా ఉంటాయి. ఆ పాలలో కోరి ఉంచుకున్న బెల్లం వేసి కలపాలి, పచ్చకర్పూరం, ఏలకులపొడీ చేర్చచ్చు. ఆ తరవాత అందులో వేడి వేడి అన్నం విడివిడిగా చేసి పాలలో కలిపేసేస్తే అదే పచ్చిపాల పరమాన్నం. దీన్ని అరటాకులో పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే! ఆ రుచే వేరు, ఆ ఆనందమే వేరు. తయారు చేసుకునేటపుడు ఎక్కడ తేడా వచ్చినా పాలు విరిగిపోతాయి.

పైన చెప్పిన ఏ పద్దతిలోనూ నేడు పరమాన్నం తినేలా లేదు. 🙂

పచ్చిపాల పరమాన్నం ఎప్పుడు చేసుకుంటారు?

శర్మ కాలక్షేపంకబుర్లు-తుని తగువు

తుని తగువు

కాంతాకనకాలే కలహ కారణాలు,నేటికిన్నీ! కాదు ఎప్పటికిన్నీ!! కలహానికి కారణాలు వెతుకుతూ పోతే మూలం కాంతాకనకాలలో ఒకటిగా తేలుతుంది లేదూ జమిలిగానూ ఉండచ్చు.

తుని పట్టణం తాండవ నదికి కుడిగట్టున తూగోజిలో ఉన్నది. నది ఎడమగట్టున ఉన్నదే పాయకరావుపేట. ఇది కూడా ఒకప్పుడు తుని పట్టణంలో భాగమే, కాలంలో విశాఖ జిల్లా ఏర్పడినప్పుడు ఆ జిల్లాలో చేర్చబడింది. ఈ ప్రాంతాన్ని శ్రీ వత్సవాయి వారి వంశం పరిపాలన చేసినది. నాటి కాలంలో న్యాయంకూడా ప్రభువు బాధ్యతగానే ఉండేది. ప్రతి విషయమూ ప్రభువే చూడకపోయినా కొంతమంది అధికారులు ….న్యాయవ్యవస్థ, జాప్యం…. ఇదంతా సహజమే…నాటికాలానికే సత్వరన్యాయం అన్నది జరగనిమాటే…

తుని ప్రాంతం ఆ రోజులనాటికే పాడి,పంట, వ్యర్తకం,వ్యాపారం,చేతి వృత్తులతో తులతూగేది. ”కలిమిలేనన్నాళ్ళు కలిసి మెలిసుంటారు, కలిమి కలిగిన నాడు కాట్లాడుకుంటా”రన్నారో సినీ కవి. ఇది నిజం కదా! ఇక్కడ తగవులూ ఎక్కువగానే ఉండేవి. న్యాయం జరగడానికి సమయమూ పట్టేది. అదుగో ఆ అవసరంలో పుట్టుకొచ్చినదే తుని తగువు, అదే ప్రత్యామ్నాయ న్యాయవ్యవస్థ. ఇందులో ముగ్గురు గాని ఐదుగురుగాని సభ్యులు, వారంతా ఆ ప్రాంతంలోని సంఘంలో సత్ప్రవర్తన కలిగినవారని ధర్మాత్ములని పేరు పడ్డవారే ఉండేవారు. వీరినెవరూ నియమించరు, జీతభత్యాలూ ఉండవు, పరోపకారమూ, సత్వర న్యాయం జరగడమూ వీరి ధ్యేయం. ఒక ముగ్గురే కాకపోవచ్చు, వర్తకులందరికి ఒక వ్యవస్థ. వృత్తి పనివారలకు మరొకటి, ఇలా అవసరాలను బట్టి, ఒక న్యాయ వ్యవస్థ ఏర్పడేది. ఈ వ్యవస్థనే ”తుని తగువు” అన్నారు,(తుని తగువు=తుని తరహా న్యాయం ). వీరిచ్చే తీర్పులు కూడా వాది,ప్రతివాదులిద్దరికి సమ్మతమైనవే, న్యాయం బలవంతంగా రుద్దబడింది కాదు. విషయం చెప్పాలంటే నేటి ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థ దీనినుంచి పుట్టుకొచ్చినదే!

ఒకిద్దరి మధ్య తగవు వస్తే అది వీరి దగ్గరకొచ్చినపుడు వాది ప్రతివాదులనుండి విషయం విని, సభ్యులు సంప్రదించుకుని వాది,ప్రతివాదులను వేరు వేరుగా కలసి, వారివారి వాదనలో న్యాయమూ,లోపమూ చెప్పడంతో మొదలౌతుంది తగవుకు పరిష్కారం. వాది ప్రతివాదులిద్దరికి చెప్పి న్యాయంగా తీర్పును విడివిడిగా వినిపించి, ఇద్దరి ఇష్టం మీద, ఇద్దరిని ఒకచో చేర్చి తీర్పు వివరించడం,తీర్పు అమలుచేయడమే తుని తగువు.

ఐతే కాలంలో తుని తగువు అంటే తగవులోని ఆస్థి,డబ్బును చెరిసగం చేసి ఇచ్చెయ్యడమేగా మిగిలిపోయింది. నేనుగా అరవై సంవత్సరాల కితం ఈ తుని తగువులో ఆస్థి పొందినవాడిని. కేస్ వివరం టూకీగా చెబుతా, ఎందుకంటే కేస్ చాలా పెద్దది, విసుగు పుట్టిస్తుంది కనక…

నాకు,దాయాదులకు మధ్య ఒక ఆస్థిగురించిన తగువొచ్చింది. ఆస్థిని ప్రతివాదులు స్వాధీనం చేసుకున్నారు. నేనా మైనర్ని. నా స్థానీయులు కోర్ట్ కిపోయారు. కాలం గడుస్తోందిగాని తీర్పురాలా,ఏళ్ళు గడిచాయి, ఇరు పక్షాలకీ కాళ్ళూ లాగాయి. ప్రతి పక్షానికి న్యాయంలేదుగాని బలం ఉంది,పెద్ద వయసూ వచ్చేసింది. ఇది గెల్చుకున్నా అనుభవించేవారెవరూ లేరు. ఈ సందర్భంగా విషయం తుని తగవుకు చేరింది. సంప్రదింపులైన తరవాత న్యాయం చెప్పేవారు ఆస్థిని ఐదు భాగాలు చేసి నాలుగు భాగాలు నాకిచ్చి ఒక భాగం వారికిస్తూ తీర్పు చెప్పేరు. ఆ తీర్పును ఇద్దరం రాజీగా కోర్ట్ లో సమర్పించుకుని బయట పడ్డాం. ఇది అసలు తుని తగువంటే, ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థ.

శ్రీ.జె.వి.రావు గారి కోరిక పై ఈటపా రాశాను. ఇంకెవరికి బాకీ లేను 🙂

ఇంటిలో అనారోగ్యాల మూలంగా బ్లాగుకు కొంతకాలం శలవు. చెప్పకుండాపోతే నాకోసం వెతుకుతున్నారు, నేనే వీలు చూసుకు తిరిగొస్తా.

_____/\_____

శర్మ కాలక్షేపంకబుర్లు-నవ్విన నాపచేను పండింది.

నవ్విన నాపచేను పండింది.

అరుణ్ గారు నవ్విన నాపచేనే పండింది అన్న నానుడి గురించి రాయమని కోరిన సందర్భంగా, తుని తగువు గురించి టపా రాస్తానన్నా, అది మాత్రం బాకీ ఉండిపోయింది,తొందరలో అదీ పూర్తి చేస్తాను.

వరి ఏక వార్షికం. మరో పంట కావాలంటే మళ్ళీ విత్తుకోవలసిందే! ఇప్పుడంటే వరసల్లో నాటుతున్నారు, వరిని, కాని పాత రోజుల్లో దమ్ము చేసి వెద జల్లేవారు, వరి విత్తనాలని. నేడు మళ్ళీ వెదజల్లడమే మంచిదంటున్నారు. దారి తప్పేనా?

పండిన తరవాత, వరి దుబ్బులను నేల నుంచి ఒక అడుగెత్తులో కోసి పనలు వాటిపై వేసేవారు. కోయగా చేలో మిగిలిపోయిన వాటిని మోళ్ళు అంటారు. ఇలా చేయడం మూలంగా కంకులనున్న ధాన్యం నీటిలో ఉండదు, నానదు, ఎందుకంటే వరి పనలు మోళ్ళ మీద ఆనుకుని ఉంటాయి గనక. నేడు యంత్ర వ్యవసాయంలో మోడూ లేదు గడ్డీ లేదు, పశువులకి.

ఇలా మోళ్ళుండగా కోసిన చేనును మరలా ఊడ్చేందుకు సిద్ధం చేసేటపుడు మోళ్ళతో సహా దున్నేసి, దమ్ము చేస్తారు. అందుకని మోడు ను ప్రత్యేకంగా తీసెయ్యరు.

ఒక రైతు ఇలా వరి కోసుకున్నాడు, మళ్ళీ వ్యవసాయం చేసే సమయం వచ్చేసింది, వర్షమూ పడింది. పక్కవాళ్ళంతా వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు, ఈ రైతు మాత్రం వ్యవసాయం చేయడానికి తగిన స్తోమతు, ఇంటా వంటా లేక చేను అలాగే వదిలేశాడు. దానితో వదిలేసిన మోడు మళ్ళీ చిగిరించింది, చేనంతటా, రైతు చేసిన సంరక్షణలేకనే. ఆ తరవాత రైతు కొద్దిగా కోలుకుని నీరు నిలబెట్టుకోడం వగైరా పనులు చేస్తూ వచ్చాడు. ఇది చూసిన పక్క రైతులంతా అతనిని హేళన చేయడం మొదలెట్టేరు. ఎందుకంటే ఇలా మోడు నుంచి వచ్చిన మొక్కల్ని నాప మొక్కలు అంటారు. అంటే లేతైనది అనీ వ్యర్ధమైనదనీ, పనికిరానిదనీ అర్ధం. అదేం పండుతుంది దానికి చాకిరి చేయడం వ్యర్ధమ్నీ,చేతకాని పని చేస్తున్నాడనీ హేళన చేయడం మొదలు పెట్టేరు.

ఇలా చేస్తూ వచ్చిన ఆ నాప చేనూ పండింది, పక్క వ్యవసాయం చేసిన చేలూ పండేయి. అందరూ కోతలు పూర్తి చేసేరు. అందరికి పది బస్తాల ధాన్యం పండితే నాప చేను పదిహేను బస్తాలు పండింది. అందరు నవ్వి పండదనుకున్న నాప చేను, పండదని హేళన చేసిన చేను బాగా పండింది.

అంటే ఎవరిని హేళన చెయ్యకు, చేతకానివారని, తెలివితక్కువ వారని, పనికిరాని వారని అనుకోకు, నిందించకు,హేళన చెయ్యకు. ఏమో! ఏ పుట్టలో ఏ పాముందో! ఎవరికి తెలుసు? ఇలా పనికిరానివారనుకున్నవారు, హేళన చేయబడినవారు, చేసిన,చెప్పిన; పని,మాట ఒక సమాజాన్నే ఉన్నత స్థితికి తీసుకుపోవచ్చు. ఎవరినీ నీచంగా చూడకు, అలా నీచంగా చూడబడ్డవారే గొప్పవారై ఉండచ్చు. వారి గొప్పతనం తెలుసుకునే పరిజ్ఞానం మనలో లేకుండి ఉండాలి.

ఎంత చెప్పినా అర్ధమయేలా చెప్పలేకపోవచ్చు, అందుకో చిన్న ఉదాహరణ, నేడు పేపర్లో చూశా!.

ఒడీషా లో ఒక చిన్న పల్లెటూరు, నేటికీ కరంట్ లేని ఊరు. నీటి వసతి లేని ఊరు. వేసవి వస్తే మనుషులు పశువులు కూడా పిట్టల్లా రాలిపోయే చోటు, నీరు లేక,దాహానికి. పదేను సంవత్సరాల ఒక యువకునికి ఇది చూసి మనసు చలించిపోయింది. పలుగు పారా తీసుకుని చెరువు తవ్వడం ప్రారంభించాడు, ఒంటిగా. కూడా ఉన్నవారు, నవ్వేరు, ఇది జరిగే పనేనా అన్నారు, చేతకాని పని చేస్తున్నావన్నారు. ఎన్నో కష్టమైన మాటలూ అన్నారు, ప్రతిబంధకాలూ తెచ్చారు. ఐనా ఈ యువకుడు పని మానలేదు. చెరువు తవ్వుతూనే ఉన్నాడు, ఒంటరిగా! ఎన్నేళ్ళు దగ్గరగా ముఫై సంవత్సరాలు తవ్వేడు. ఇప్పుడక్కడొ గొప్ప చెరువు, నీటితో కళకళలాడుతోంది. ఇప్పుడంతా నాటి యువకుణ్ణి మెచ్చుకున్నారు. నేడు ఎ.ఎల్.ఎ గారేదో బహుమతి ప్రకటించారు. కలక్టర్ గారేదో చేస్తామన్నారు. ఇది కథ కాదు,జీవిత సత్యం. వీటిలో ఏమి ఆశించి ఆ నాటి యువకుడీ చెరువు తవ్వడానికి మొదలెట్టేడు?

నాడు నవ్వినవారు కూడా నేడు ఆ చెరువును ఉపయోగించుకుంటున్నారు, చిత్రంకదా! గొప్పతనాన్ని గుర్తించడానికి కూడా ఎంతో కొంత గొప్పతనం కావాలి. నవ్విన నాపచేనే పండింది, ఒంటిగాడు చెరువు తవ్వేడు.